కర్మ – చతుర్విధ మార్గంలో తొలి మెట్టు

ఈ వ్యాసం, చతుర్విధ మార్గం — కార్యాచరణ, ఆలోచన, విచారణ, అన్వేషణ — వైపు సాగే ప్రయాణానికి తొలి అడుగును ఆవిష్కరిస్తుంది. మనం ముందుగా పరిశీలించిన “మనము ఎక్కడ ఉన్నాము?” అనే వ్యాసంలో, ఆధునిక జీవన స్థితిని, యాంత్రిక దినచర్యల ప్రవాహంలో మనం ఎలా కొట్టుకుపోతున్నామో గమనించాము. మనలో చాలామంది ఈ అనాలోచితమైన స్థితిలోనే జీవిస్తున్నాము. ఉదయం మొబైలు ఫోన్లో నోటిఫికేషన్‌లకు మేల్కొనడం, ఆఖరి నిమిషంలో పనుల కోసం పరుగులు, సామాజిక మాధ్యమాలలో (సోషల్ మీడియా) ఉత్తర–ప్రత్యుత్తరాలకు యాంత్రిక స్పందనలు, సమావేశాలు, బాధ్యతలు, చివరకు రాత్రికి అలసిపోయిన భావనతో రోజును ముగించడం. చివరిగా ఒక రోజుని గడిపేసాం, ఇక ఈ పూటకి చేయవలసినది ఏమి లేదు అనే తృప్తితో (లేదా అసంతృప్తితో అయినా కావచ్చు) నిద్రలోకి జారుకుంటాము.  

కానీ ఆ రోజు నిజంగా ఏమి సాధించాము ? నిన్నటిదాక లేని ఏ కొత్తదనాన్ని ఈ రోజు మనదిగా చేసుకున్నాం ? ఏ స్ఫూర్తితో ఈ నాటి పనులని చేశాం ? ఈ ప్రశ్నలలో దేనికి సమాధానాలు లేకుండానే, ఒక రోజు ఏ ప్రణాళిక పై గడిచిందన్న స్పష్టత కూడా లేకుండానే గడిచిపోతోంది మన దైనందిన జీవితం. ఇది చైతన్యపూర్వక జీవనం కాదు; కేవలం కొన్ని అచేతన కదలికల సమూహం మాత్రమే. ఈ యాంత్రిక ప్రవాహం నుంచి బయటపడటానికి కేవలం ఎక్కడికో వెళ్ళి తత్వచర్చలోనో , ధ్యాన సాధనలోనో పాల్గొనాలి అని అనుకోవాల్సిన అవసరం లేదు. దానికి సులభమైన తొలి మెట్టు — కార్యాచరణ లేదా కర్తవ్య నిర్వహణ లేదా కర్మ చేయడం; ఇక్కడి నుంచే, సులభతరంగా ఉండే ఒక సాధనాయానం మొదలుపెట్టొచ్చు. ఇదే ఇంతకు ముందు మనము అనుకున్న చతుర్విధ మార్గాలలో మొట్ట మొదటిది .

కర్మ అంటే ఏమిటి?

శ్రీమద్భగవద్గీత మూడవ అధ్యాయం (కర్మయోగం), ఒక ప్రాథమిక సత్యాన్ని స్పష్టంగా ప్రతిపాదిస్తుంది: ఎవ్వరూ ఒక్క క్షణం కూడా కర్మ చేయకుండా ఉండలేరు (గీత 3.5 — “న హి కశ్చిత్ క్షణమపి…”). ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మనం గమనించాలి. “నేను రోజంతా ఏదో ఒక పనిలోనే ఉంటాను” అని అనుకోవచ్చు; కానీ పనుల్లో మునిగి ఉండే క్రియ ఒకటైతే , కర్మ మరొకటి  – ఈ రెండూ ఒకటే అని అనలేం. పనుల్లో మునిగి ఉండే క్రియ ఒక అగమ్య ప్రవాహంలో కొట్టుకుపోవడం అయితే, కర్మ (లేదా కార్యాచరణ) అనేది నిర్దిష్టంగా స్వీకరించిన ఒక బాధ్యత.

సరిగ్గా గమనిస్తే, మనం బాధ్యతల బరువుల వల్ల అలసి పోవడం లేదు; మనకు వచ్చే అలుపు, అసంఖ్యాక అనాలోచిత స్పందనల వల్ల. కర్మను, ఒక బాధ్యతగా స్వీకరించడం అంటే, ఆ యాంత్రిక ప్రవాహం విడిచి,  ఒక క్షణకాలం వెచ్చించి, “ఇది నా కర్తవ్యం” అని మనస్సులో ఒక్క దృఢమైన నిశ్చయం చేసుకుని ఆ కార్యాన్ని మొదలుపెట్టడమే.

మనం కర్మను ఎందుకు ఆచరించాలి?

జీవితంలో మన పాత్ర మనం సక్రమంగా పోషించాలంటే, బాధ్యతాయుతమైన కర్మ (కర్మ /  కార్యాచరణ / కర్తవ్య నిర్వహణ – ఏ పదం వాడినా) తప్పనిసరి.

గీత రెండవ, మూడవ అధ్యాయాలలో మనకు స్పష్టంగా కనిపించే విషయం ఏమిటంటే — మనకు కర్మ చేయడంలోనే అధికారం ఉంది; ఫలితాలపై కాదు, అలాగే కర్మ చేయకుండా ఉండడం అసాధ్యం (గీత 2.47; 3.5). ఈ రెండు ఉపదేశాలు ఒకే దిశగా సూచిస్తాయి — ఫలితాల పట్ల ఆసక్తిని వదిలి, స్పృహతో కర్మ చేయాలి. అంచేత, మన సంకల్పాలు కార్యరూపం దాల్చాలంటే, కర్మ చేయడం అనేది అనివార్యం.

కర్మ ఏ పరిస్థితులలో చేయాలి?

కర్తవ్యం లేదా బాధ్యత మన ముందుకు స్పష్టంగా వచ్చినప్పుడు, కర్మ చేయక తప్పదు. మన వంతుగా చేయాల్సిన పని ఏదో తెలిసినప్పటికీ దాన్ని వాయిదా వేస్తూ ఉంటే, మనశ్శాంతి ఉండదు. అదే పని సరైన సమయంలో చేసేస్తే, అంతకుముందు ఉన్న కంగారు తగ్గి, మనసు కాస్త తేలిక పడుతుంది.

మనం సులభతరమైన పనులనే తీసుకుందాం — ఎప్పటినుంచో అసంపూర్ణంగా మిగిలి ఉన్న ఒక చిన్న పని పూర్తిచేయడం, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం, లేదా ఎంతోకాలంగా మనం తప్పించుకుంటూ వచ్చిన ఒక బాధ్యతను ఒక్కసారి నిలబడి ఎదుర్కోవడం — ఇవి చాలు కర్మగా చేయడానికి. ఇలాంటి పనులు చేసిన తరువాత మనకు కలిగే ఒక చిన్న తృప్తి; మనమేంటో మనకు తెలిసే వచ్చే ఒక చిన్న స్పష్టత; ఇవే మనల్ని మరింత సచేతనంగా జీవితాన్ని సాగించడానికి ప్రోత్సాహం ఇస్తాయి.ఇక ఇదే రీతిలో నిజంగా కష్టతరమైన పనులు చేస్తే, అప్పుడు కలిగే ఆ తృప్తి గురించి, పెరిగే ఆనాటి ఆత్మ విశ్వాసం గురించి, మన సామర్ధ్యం పై మనకొచ్చే స్పష్టత గురించి ఇక చెప్పనే అక్కరలేదు.

కర్మ : క్రియ vs ప్రతిక్రియ

మన జీవితంలో జరిగే ప్రతి సంఘటనకి మనం స్పందించడం సహజం. అయితే, మనలో పుట్టే ప్రతి భావానికి క్రియాశీలంగా స్పందించాల్సిన అవసరం లేదు. కోపం, చిరాకు, భయాందోళనలు, ఉద్వేగాలు — ఇవన్నీ చాలాసార్లు మన ప్రమేయం లేకుండానే మన ఆచరణ ద్వారా బయటకు వ్యక్తం అవుతూ ఉంటాయి. ఈ విధమైన వ్యక్తీకరణ వల్ల మన మనసు తేలిక పడుతుందని అనుకోవడం తప్పు. ఎందుకంటే, కోపంతో కమ్ముకున్న కోరిక మన ఆలోచనా శక్తిని అస్థిరం చేస్తుందని గీత కూడా సూటిగా చెబుతుంది (గీత 3.36–37, కర్మయోగం).

అంచేతనే, మనం ఆలోచించి, ఆ ఆలోచనలో ఒక స్పష్టత వచ్చాక, దాన్ని ఒక నిర్ణయంగా మార్చి, ఆ నిర్ణయాన్ని అమలు చేస్తే, ఆ క్రియని కర్మ అనగలము. దీనికి విరుద్ధంగా, ప్రతిక్రియను మాత్రమే ఆచరిస్తే, దాన్ని మనం చేసిన ఒక కర్మగా లెక్క కట్టలేం. కర్మగా మారిన ఒక క్రియకి – ఒక ప్రతిక్రియకి మధ్య ఉన్న ఈ వ్యత్యాసమే మనం తెలుసుకోవలిసినది. ఇది దృష్టిలో ఉంచుకుని మనం క్రియ ఆచరిస్తే, మన చేసే క్రియ సకర్మ అవుతుంది. అంతే కాకుండా, ఈ స్పృహతో చేసిన ప్రతి కర్మ, ఎంత చిన్నదైనా సరే, మనల్ని యాంత్రికంగా స్పందించే అలవాట్ల నుంచి కొంతైనా బయటకు తీసుకెళ్తుంది; మరో పక్క, మన వల్ల జరిగే ప్రతి ప్రతిక్రియ, మన శక్తిని కరిగిస్తూ, మునుపటి మానసిక అస్థిరత వైపే తిరిగి తోసేస్తుంది.

కర్మ ఏ పరిస్థితులలో చేయకూడదు?

ఇంతకు మునుపు అనుకున్నట్టు, మనం ఒకోసారి ప్రతిక్రియ దశలోకి జారిపోతూ ఉంటాము. అలాంటి పరిస్థితుల్లో, అంటే మనలో భావోద్వేగాలు అస్థిరంగా ఉన్నప్పుడు, లేదా పరిస్థితి ఇంకా స్పష్టంగా అర్థం కాకముందే ఏదో ఒకటి చేసేయాలి అనే తపన కలిగినపుడు, కొద్దిగా ఆగి ఆలోచించడం అవసరం.

మరి కర్మ చేయకుండా ఒక్క క్షణం కూడా ఉండలేము అని గీత స్పష్టం చేసింది కదా ? మౌనం, సహనం, కొద్దిసేపు వేచి ఉండటం — ఇవి బాహ్య క్రియలు కాకపోయినా, సరిగ్గా చూస్తే, ఇవి కూడా కర్మలే. కాకపోతే బాహ్య కర్మలు కావు – సరైన మానసిక కర్మలు. మానసిక అస్థిర స్థితిలో ఉన్నప్పుడు, ఒక ప్రతిక్రియను సకర్మగా మార్చే సరయిన సాధనాలు ఇలాంటి మానసిక కర్మలే అని మనం గుర్తించాలి.

ఉదాహరణకి, భగవద్గీతలో అర్జునుడి మానసిక స్థితిని గమనిస్తే, అది అతని బలహీనతని మాత్రమే సూచించదు; తానే ఆలోచన చేసి, తనలోని మానసిక సందిగ్ధతని ముందుగా తానే గుర్తించి, తద్వారా భగవద్గీత బోధకు అర్హుడు అవ్వగలిగాడనే విషయం కూడా మనం ఖచ్చితంగా గమనించాలి. రెండవ అధ్యాయం మనకు స్పష్టంగా చెబుతుంది — సరైన కర్మకు ముందు స్పష్టత అవసరం. ఇప్పటికి కూడా, అంటే ఈనాటి ఆధునిక జీవితానికి కూడా ఈ సిద్ధాంతం వర్తిస్తుంది. “కోపం, భయం, లేదా ఆందోళనలో ఉన్నప్పుడు వెంటనే స్పందించడం తరచుగా మరింత గందరగోళానికే దారి తీస్తుంది” అనే సంగతి తెలియని వాళ్ళమేమి కాదు మనం; అయినాసరే, మరో మారు మనని మనం హెచ్చరించుకుందాము. గమనించవలసినది ఏంటంటే, సరైన సమయంలో కొన్ని క్షణాలు ఆగి ఉండటం, మనసు కుదుటపడేందుకు అవకాశం ఇస్తుంది; ఆ తరువాత చేపట్టే కర్మకు స్థిరత్వం ఇస్తుంది.

కర్మ నుండి ఆలోచన వైపు

మన జీవితంలో చేసే పనులలో కొన్ని ఎలాంటివి అంటే, ఆ పనిని ఎన్నో సార్లు చేసి ఉంటాము; ఇంకా ఎన్నో సార్లు చేయాల్సి ఉంటుంది. ప్రతీ రోజూ విధిగా చేసే పనులను నిత్య కర్మలు అంటారు. రోజూ కాకపోయినా, అడపా దడపా వచ్చే అవసరాల నిమిత్తం చేసే వాటిని నైమిత్తిక కర్మలు అంటారు. ఇలాంటి కర్మలు మళ్లీ మళ్లీ చేస్తున్నప్పుడు, ఏదో ఒక దశలో మనకు ఆ పని మీద, ఆ కర్మ మీద ఒక స్థిరత్వం వస్తుంది.

ఎందుకంటే, చేయాల్సినది ఏమిటో స్పష్టంగా తెలుసు; అనేక పర్యాయాలు దాన్ని అదే విధంగా, సునాయాసంగా ఆచరణలో పెట్టాము. అంచేత, మళ్లీ అవే పనులు చేస్తున్నప్పుడు, మనసు ఇక నిర్ణయాల గందరగోళంలో ఉండదు; స్థిరంగా ఉంటుంది. అలా కర్మ తన దారిలో తాను సాగుతున్నప్పుడు, మనం ఆ కార్యాన్ని కేవలం చేస్తూనే ఉండి పోకుండా, దాన్ని గమనించే స్థితిలోకి వస్తాము.

ఈ గమనికే ఒక ఆలోచన పుట్టేలా చేస్తుంది. ఇప్పుడేమి చేస్తున్నామన్నది మాత్రమే కాక, ఎందుకు చేస్తున్నాం, దాని లక్ష్యం ఏమిటి, ఆ లక్ష్యానికి మనం ఆచరించే విధానం అనుగుణంగా ఉందా, ఈ విధానంలో మార్పు అవసరమా, ఇదే కర్మను ఇంతకంటే మరింత ఉపయోగకరంగా చేయవచ్చా అనే ప్రశ్నలు సహజంగా మనలో ఉత్పన్నమవుతాయి.

అలా పుట్టిన ఆలోచన కర్మకు విరుద్ధమైనది కాదు; కర్మలోని సహజమైన తదుపరి దశ. ఈ దశలో పుట్టే ఆలోచన, ఒక నిరాశతో గానీ, సందిగ్ధతతో గానీ వచ్చినది కాదు; సచేతనంగా సాగుతున్న కర్మ నుంచే పుట్టిన ఒక మానసిక కర్మ. ఇదే ‘ఆలోచన’; తదుపరి దశ అయిన విచారణకు మనల్ని సిద్ధం చేసే రెండో మెట్టు. మరి, కర్మని గూర్చి ఇప్పటిదాకా అర్థం చేసుకున్న విధంగా ఆచరించడం మొదలుపెడితే, మనం మొదటి మెట్టును విజయవంతంగా ఎక్కినట్టే కదా.

ముక్తాయింపు

కర్మపై మనకు కలిగే అవగాహన, మన జీవితాన్ని మనమే గమనించే స్థాయికి తీసుకువెళ్తుంది. మనం చేయాల్సిన పనిని ప్రతిక్రియగా కాకుండా, ఆలోచించి, బాధ్యతగా చేయడం మొదలుపెట్టినప్పుడు, జీవనయానం స్థిరపడుతుంది. ఆ స్థితిలో మనం పనులను కేవలం చేస్తూనే ఉండకుండా, వాటి లక్ష్యాన్ని కూడ మన దృష్టిలోకి తెచ్చుకుంటాము; ఆ దృష్టే ఆలోచనకీ, తరువాత విచారణకీ దారి తీస్తుంది.

ఇలా చూస్తే, కర్మ, ఆలోచన, విచారణ, చివరిగా నిరంతర సాధనగా ఒక అన్వేషణ — ఈ చతుర్విధ మార్గాలు వేర్వేరు కాదు; జీవన ప్రయాణంలో ఒకదాని వెంట మరొకటి ఒక క్రమంలో ముందుకు తీసుకెళ్లే సోపానాలు. జీవన సరళిలో చిన్న చిన్న మార్పులతో, కొద్దిపాటి అవగాహనతో, ఈ సోపానాలు మన జీవితానికి ఒక స్థిరత్వాన్ని, అదే విధంగా మన లక్ష్య సాధనకి ఒక అర్హతను కూడా అందిస్తాయి.

Comments

Leave a comment