(జ్ఞాన కర్మ సన్యాస యోగము – భగవద్గీత 4వ అధ్యాయం)
ఉపోద్ఘాతం
గీతలోని రెండవ, మూడవ అధ్యాయాలలో, భగవానుడు ఆత్మ యొక్క స్వభావాన్ని సాంఖ్య యోగం ద్వారా, అలాగే, ఈ ప్రపంచంలో కర్మ ఫలాల పట్ల ఆసక్తి లేకుండా స్థిరంగా, లక్ష్యాన్ని ఏలా సాధించాలో కర్మ యోగం ద్వారా అర్జునుడికి మార్గనిర్దేశం చేస్తాడు. నిష్కామ కర్మ చిత్త-శుద్ధికి తోడ్పడుతుందని, ఈ చిత్త శుద్ధే అటు పిమ్మట చేసే సత్య శోధనకి అవసరమైన సాధనం అవుతుందని గీత ప్రబోధిస్తుంది.
గీత ముందుకు సాగుతున్న కొద్దీ, అర్జునుడి పరిజ్ఞానం పెరుగుతూ వస్తుంది. ఇలా పెరుగుతున్న అవగాహనకు అనుగుణంగా మరిన్ని బోధనలు వెల్లడవుతూ ఉంటాయి. ప్రతి కొత్త విషయం కూడ అప్పటిగే సుస్థిరమైన అవగాహనపై నిర్మితం అవుతుంది. అలా అవుతున్న బోధలపై స్పష్టత పెరిగే కొద్దీ, అర్జునుడి దృక్పథం మరింత విశాలమై, మరింత సంస్కరింపబడుతూ ఉంటుంది.
ఇలాటి స్థితిలో ఉన్న అర్జునుడికి, భగవానుడు నాలుగవ అధ్యాయం ద్వారా, సూక్ష్మమైన, సునిశితమైన మరొక సత్యాన్ని వెలువరిస్తాడు. మన లోపల ఉన్న జ్ఞానం, బాహ్యంగా చేసే కర్మలను సరిదిద్ది, సరైన దిశలోకి ఎలా మలుస్తుంది, మళ్ళీ వాటిని పటిష్టంగా ఎలా పునర్నిర్మిస్తుంది అనేదే ఈ అధ్యాయంలో భగవానుడి ఉద్దేశ్యం.
అనాదిగా జ్ఞాన పరంపర
ఈ అధ్యాయంలో భగవానుడు ముందుగా, గీతాబోధలు నిత్య సత్యాలు అనే విషయం ఒక ప్రాచీనమైన వంశ పరంపర ద్వారా పరిచేయం చేస్తాడు. ఈ యోగం మొదట సూర్య భగవానుడైన వివస్వానుడికి అప్పగించబడిందని, అదే జ్ఞానం గురు-శిష్య పరంపర ద్వారా మరికొంత మంది రాజర్షులకి అందించబడింది అని, కాలక్రమేణా ఈ జ్ఞానం మానవ మేధస్సు నుండి కనుమరుగైంది అని భగవానుడు వివరిస్తాడు. (4.1-ఇమం వివస్వానే యోగం …: 4.2 ఏవం పరంపరా-ప్రాప్తం…). ఈ జ్ఞానాన్ని అర్జునుడికి చెప్పడం వెనక ఉన్న ఉద్దేశ్యం, కేవలం వాటిని గుర్తు చేసుకోవడం మాత్రమే కాదు; ఒక అర్హత గలిగిన వ్యక్తి ద్వారా ఆ జ్ఞానాన్ని మళ్ళీ సజీవం చేసి, మానవ జాతితో పునః అనుసంధానం చేయడమే భగవానుడి ఉద్దేశ్యం. అప్పటిదాకా చేసిన బోధనల ద్వారా మానసికంగా సిద్ధపడిన అర్జునుడు, కేవలం విషాదంలో ఉన్న ఒక సగటు మానవుడిగా మాత్రమే కాకుండా, ఒక భక్తుడిగా మరియు ఒక స్నేహితుడిగా కూడా ఈ జ్ఞానాన్ని పొందడానికి అర్హత సంపాదించాడు (4.3- స ఏవాయం మయా తే అద్య …).
అవతారం – ఆచరణా స్వేచ్ఛ
చాలా కాలం క్రితమే తన బోధనలను అందించిన అటువంటి జగద్గురువు, మానవుడైన అర్జునుడి పక్కన ఉండి, అతనితో జీవితాన్ని గడపడం ఏమిటి ? అర్జునుడికి మళ్ళీ స్వయంగా ఇదంతా బోధించాల్సిన అవసరం భగవంతుడికి ఎందుకు కలిగింది? అసలు అర్జునుడికే ఎందుకు? ఇటువంటి అన్ని ప్రశ్నలకు సమాధానం కావాలంటే, మనం గమనించి అర్ధం చేసుకోవలసిన విషయం ఒకటి ఉంది. ఈ ప్రపంచంలో భగవంతుని ఉనికి, కర్మఫలం వల్ల వచ్చినది కాదు. ఒక అవతార పురుషుడిగా రావడం అనేది, ఆయా యుగపు అవసరాలకు అనుగుణంగా ఆయనలో కలిగిన ఒక దైవిక స్పందన. ధర్మం క్షీణించి, అధర్మం పెరిగినప్పుడల్లా, ధర్మాన్ని పునరుద్ధరించడానికి భగవానుడు తనను తానే అవతరించుకుంటాడు. (4.7 యదా యదా హి ధర్మస్య …).
భగవంతుని చర్యలు మానవ అనుకరణ కోసం ఉద్దేశించినవి కావు. అయినాసరే, భగవంతుని ఈ అవతార విషయాన్ని మనకు వర్తింప చేయాలనుకుంటే, కర్మఫలాలు అంటని, ఆశించని వారికి ఉండే సంపూర్ణమైన ఆచరణా స్వేచ్ఛకి, ఈ అవతార ప్రక్రియ ఒక వ్యక్తీకరణగా మనం భావించవచ్చు. ఆయన బోధల ద్వారా కూడా ఇదే విషయాన్నిమనకు, మరో విధంగా సూచిస్తాయి. ఎలా అంటే, మానసిక ఒత్తిడులకు లోను కాకుండా, వ్యక్తిగత స్వార్థం లేకుండా, ఫలాపేక్ష లేకుండా చేసే కర్మ ఎవర్నీ బంధించదు. పైగా, అలాంటి కర్మ విముక్తిని కలిగించే గుణాన్ని కలిగి ఉంటుంది. దీనికి భిన్నంగా, పంతాలతోనో, పట్టుదలతోనో లేదా మన స్వార్ధ అవసరాల కొరకు చేసిన కర్మ మనని తప్పకుండా బంధిస్తుందనే విషయం మనం గమనించాలి.
ప్రవృత్తి – ప్రాప్తి
ప్రతి వ్యక్తి సహజంగానే, తన స్వభావరీత్యా కొన్ని కోరికలు మరియు అభిరుచులను కలిగి ఉంటాడు. ఆ వ్యక్తి భగవంతుని పట్ల ఎలా మెలుగుతాడనేది ఈ ప్రవృత్తులే నిర్దేశిస్తాయి. మరి ఆ వ్యక్తి తనను ఏ విధంగా సమీపిస్తాడో, భగవంతుడు కూడా అదే రీతిలో స్పందిస్తాడు (4.11 యే యథా మాం ప్రపద్యంతే …). మనలో కొందరు వ్యక్తులు జ్ఞానాన్ని కోరుకుంటారు; కొందరు భద్రతని, కొందరు సౌకర్యాన్ని, మరికొందరు లక్ష్య సాధనని, ఇంకొందరు నిర్దిష్ట విజయాలను – ఇలా, ఎన్నో విషయాలని కోరుకుంటారు. ఆయా కోరికల గూర్చి, ఆయా సంబంధిత దేవతలను ప్రార్ధిస్తారు. వారు దేనిని కోరుకున్నారో అది వారికి లభిస్తుంది. అటువంటి భౌతిక విజయాలు సాధ్యమే – సాధించవచ్చు కూడా. అయితే అలా తీరిన కోరికలు కేవలం తాత్కాలికమే. (4.12 – కాంక్షంతః కర్మణాం సిద్ధిం…). ఒక విధంగా చెప్పాలంటే, ఒక కోరిక వెనక ఉన్న ఆ వ్యక్తి స్వభావానికి, అతనికి లభించిన ఆ ఫలం ప్రతిబింబిస్తుంది అని చెప్పవచ్చు.
మానవులలో వైవిధ్యం – గుణ కర్మలు
గుణ మరియు కర్మల ఆధారంగా తాను మనుషులను నాలుగు రకాలుగా విభజించానని భగవానుడు ప్రకటించాడు (4.13-చాతుర్వర్ణ్యం మయా సృష్టం …). ఒక వ్యక్తి ఆంతరంగిక ప్రవృత్తికి కారణం అతని గుణాలు అయితే, వాటి నుండి ఉత్పన్నమయ్యే బాహ్య ప్రవర్తనలు అతని కర్మలు అవుతాయి. అందుచేతనే, మానవ ప్రవర్తనలో కనిపించే వ్యత్యాసాలు ఆ మనిషిలోని గుణాల యొక్క ప్రభావాన్ని ప్రతిబింబిస్తాయి తప్ప, బాహ్యమైన వర్గీకరణలను కాదు. ఒక మనిషితో పోలిస్తే, మరొక మనిషి భిన్నంగా ఎందుకు ఆలోచిస్తాడు, వైవిధ్యంతో ఎందుకు స్పందిస్తాడు, తనదైన ఒక ప్రత్యేకమైన శైలిలో ఎందుకు ప్రవర్తిస్తాడు ? – ఈ విషయం అర్థం చేసుకోవడానికి, లోపలుండే ఈ గుణాలలో అంతరాలు, తదనుగుణంగా బయటకు వ్యక్తమయ్యే ఆ కర్మలలో అంతరాలు – ఇవే ప్రాతిపదిక తప్ప వేరేది కాదు అనేది ఇక్కడ స్పష్టం అవుతోంది.
ప్రతి జీవి యొక్క గుణాలలో మరియు కర్మలలో ఇంత వైవిధ్యం ఉన్నప్పుడు, ప్రతి మనిషి ఏకైక పరమ లక్ష్యాన్ని ఎలా చేరుకోగలడు? దీనికి సమాధానం, మన కర్మ ఆచరణా విధానాలు, మరియు ఆ కర్మ ఫలాలు మనని ఎలా బంధిస్తాయి అనే దానిలో ఉంది. అందువల్లనే, అసలు కర్మబంధం అంటే ఏమిటో అర్థం చేసుకోవడంపై ఇప్పుడు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
కర్మ – కర్మ బంధం
కర్మను ‘కర్తృత్వభావం’ (నేనే చేస్తున్నాను అనే భావన) తో చేపట్టినప్పుడు మాత్రమే అది మన పాలిట ఒక బంధంగా మారుతుందని మనం తెలుసుకోవాలి. ఈ కర్తృత్వభావం మనస్సులో ఒక ముద్రను వేస్తుంది, ఈ ముద్రే తరువాతి దశలలో మరిన్ని పర్యవసానాలకు దారి తీస్తుంది. భగవంతుడు స్వయంగా ప్రకటించినట్లుగా, ఆయనకు ఏ కర్మలోనూ కర్తృత్వ భావం లేదు, అందుకే కర్మలు ఆయనను బంధించవు (4.14 – న మాం కర్మాణి లింపంతి …). భగవంతుని ఈ స్వభావాన్ని అర్థం చేసుకున్న అర్జునుడి పూర్వీకులు, కర్మాచరణ చేస్తూనే, కర్మబంధంలో చిక్కుకోకుండా జీవించారని కూడా భగవానుడు ప్రకటించాడు (4.15 – ఏవం జ్ఞాత్వా కృతం కర్మ …).
బంధం లేని కర్మాచారణ
దేనిని కర్మ అని పిలవాలి, దేనిని అకర్మ అని పిలవాలి అనే విషయం తెలుసుకోవడం పండితులకు కూడా సులభతరం కాదు (4.16 కిం కర్మ కిమ్ అకర్మ ఇతి …). ఎందుకంటే కర్మ అనేది ఎల్లప్పుడూ బయటికి కనిపించే విధంగా ఉండదు. శరీరం కదులుతున్నప్పుడు మనస్సు నిశ్చలంగా ఉండవచ్చు. శరీరాన్ని కదల్చకుండానే మనస్సు చురుకుగా ఉండవచ్చు. రెండిటిలోనూ, కర్మ చేస్తున్నట్టే లెక్క. కాబట్టి, ఈ సందిగ్ధావస్థ నుండి మనలను బయటకు తీసుకురావడానికి, ఒక జ్ఞాని అటువంటి కర్మలను ఎలా చూడాలో భగవానుడు స్పష్టం చేశాడు (4.18-కర్మణ్య కర్మ యః పశ్యేద్ అకర్మణి చ కర్మ యః…).
ఆ జ్ఞాని యొక్క దృక్పథాన్ని పొందడానికి మనం కొద్దిగా ఆలోచించాలి. ముందుగా, మనం ఈ శ్లోకంలో ఉపయోగించిన ‘కర్మలో అకర్మ’ , ‘అకర్మలో కర్మ’ అనే ప్రయోగాలని అర్ధం చేసుకునే ప్రయత్నం చేద్దాం – మానవులలో కర్మ రెండు స్థాయిలలో పనిచేస్తుంది : మనస్సులో మరియు బాహ్యంగా (శారీరకంగా).
ఇప్పుడు మానసిక స్థాయిలో, కర్మ అంటే “నేనే చేస్తున్నాను” అనే కర్తృత్వ భావంతో కూడిన మానసిక చర్య. ఇదే బాహ్య స్థాయిలో అయితే, కర్మ అంటే కేవలం శారీరక చర్య.
ఇక అకర్మ విషయంలోకి వస్తే, మానసిక స్థాయిలో అకర్మ అంటే ఆలోచనలు సాగుతున్నప్పటికీ కర్తృత్వ భావం లేకపోవడం. ఇదే బాహ్య స్థాయిలో అయితే, అకర్మ అంటే శారీరక నిశ్చలత.
దీనిని దృష్టిలో ఉంచుకుంటే, ఇప్పుడు మనకు కొంత స్పష్టమవుతుంది: ఒక వ్యక్తి బాహ్యంగా పని చేస్తూ, మానసికంగా కర్తృత్వ భావం నుండి విముక్తుడై ఉన్నప్పుడు, అది ‘కర్మలో అకర్మ’. ఇక, బాహ్యంగా శారీరిక నిశ్చలతతో ఉన్నప్పుడు మనస్సులో కర్మ చేస్తుంటే, – అంటే, కోరికల సంబంధిత ఆలోచన చేయడం, లేదా ప్రతిఘటించడం చేస్తుంటే – అది ‘అకర్మలో కర్మ’.
ఇప్పుడు ఈ రెండిటిలో, అంటే ‘కర్మలో ఆకర్మ’, ‘ఆకర్మలో కర్మ’, వీటిలో మనం ఏది చేయాలో మీకు అర్ధం అయ్యే ఉంటుంది. మొత్తం మీద, ఈ శ్లోకం ఒక సునిశితమైన సత్యాన్ని సూచిస్తుంది: మనస్సు కర్తృత్వభావ రహితంగా ఉండడమే మనకి ముఖ్యమైనది, కావలసినది; బాహ్యమైన కదలిక కాదు.
కర్మలు బంధించని వ్యక్తి
కర్తృత్వభావాన్ని పూర్తిగా కరిగించేసిన వ్యక్తి, కోరికల చేత ఆకర్షింపబడక, ఎటువంటి భయాందోళనలకూ లోనవకుండా కర్మను ఆచరిస్తాడు (4.19 యస్య సర్వే సమారంభాః…). కర్తృత్వభావం లేనందున, కర్మఫలాలు జ్ఞానాగ్నిలో దగ్ధం అయ్యి, అటువంటి వ్యక్తికి అంటుకోవు, కాబట్టి కర్మబంధం ఉండదు. అటువంటి వ్యక్తి ప్రశాంత తృప్తితో వ్యవహరిస్తాడు. అప్పటికే తన వద్ద వున్న వాటితో సంతృప్తి చెందుతూ, మానసిక స్థిరత్వంతో, ఫలాపేక్ష లేకుండా ఉంటాడు (4.20- త్యక్త్వా కర్మ-ఫలాసంగం…). ప్రతిఫలాన్ని ఆశించకపోయినా అవసరమైన ప్రయత్నం మటుకూ విరమించుకోకుండా, ఆ వ్యక్తి, ఏ కలత లేకుండా ప్రపంచంలో వ్యవహరిస్తాడు. హెచ్చు తగ్గులు లేకుండా మానసిక సమతుల్యతను కోల్పోకుండా నిత్యకృత్యాలు చేయడం అనేది ఒక సహజ సరళిత జీవితం గా గీత చిత్రీకరిస్తుంది. (4.21-నిరాశీర్ యత-చిత్తాత్మా…).
ఈ అకర్తృత్వభావంతో చేసే పనులు, ఏ రకమైన అభిప్రాయ ముద్రలని (వాసనలని) మన మనస్సులో నింపవు. కర్మాచరణ ఒక ప్రశాంతచిత్తంతో చేసినప్పుడు, వాటి ఫలాలు మనపై ఎటువంటి బంధాలను కల్పించవు. ఆ విధంగా జ్ఞానులు సాధారణ జీవితపు సవాళ్ళ ఎదుర్కుంటున్నప్పటికీ, మనోబంధకాలలో చిక్కుకోకూడా ఉంటారు (4.22-యదృచ్ఛా-లాభ-సంతుష్టో). కోరికలు లేకుండా, మమకారం లేకుండా, నిరహంకార బాధ్యతతో చేసే కర్మలు పూర్తిగా కరిగిపోయి (4.23 గత-సంగస్య ముక్తస్య …) మనకు ఏ బంధాల్ని మిగల్చవు. ఒక్క మాటలో చెప్పాలంటే, ఇదే కర్మలో ఆకర్మ అంటే !
యజ్ఞ స్ఫూర్తి
కర్తృత్వభావం నశించడమే కర్మబంధ విముక్తికి అవసరమైతే, చేయవలసిన ఆ కర్మలకు స్ఫూర్తి ఏమిటి అనేది ఒక ప్రశ్న. కర్మ చేయకుండా ఒక్క క్షణమైనా ఎవ్వరూ ఉండలేరు అని భాగవానుడి మాటే కాబట్టి, కర్మలు ఆచరించాల్సిందే. అయితే ఆ పనులను, అకర్తృత్వభావంతోనే, భగవంతునికి అర్పించే స్ఫూర్తితో చేయాలి. తదనుసారంగా, చేసే ప్రతీ మానసిక, బాహ్య కర్మలన్నీటినీ – ఉదాహరణకి, మనో నిగ్రహం, భక్తి, ధ్యానం, అధ్యయనం, దానం, కృషి, సేవ మొదలైనవి – ‘యజ్ఞం’గా తలవాలి. ఇలా యజ్ఞ స్ఫూర్తితో చేసే ప్రతీ అర్పణ మనలో భగవత్ తత్త్వాన్ని నింపి, మన అంత:శుద్ధికి విశేషంగా తోడ్పడుతుంది (4.24-బ్రహ్మర్పణం బ్రహ్మ హవిర్ …).
కొందరు భౌతిక సంపదను అర్పిస్తారు; మరికొందరు తమ తపోశక్తిని అర్పిస్తారు (4.25 దైవమేవాపరే యజ్ఞం …). కొందరు ఇంద్రియాలను నిగ్రహిస్తారు; మరికొందరు ఊపిరిని నిగ్రహిస్తారు (4.27 సర్వాణీంద్రియ-కర్మాణి …; 4.29 అపానే జుహ్వతి ప్రాణం …). కొందరు తమ జ్ఞానాన్ని, తమ అధ్యయనాన్ని లేదా తమ మనో నిశ్చలతను అంకితం చేస్తారు. ఇన్ని ఉదాహరణలు ఎందుకంటే, ముఖ్యమైనది బాహ్య రూపం కాదు. ముఖ్యమైనది అటువంటి కర్మను, అటువంటి అర్పణను రూపొందించే మనో భావన. ఈ వైవిధ్యమైన ఉదాహరణల లోని అర్పణలు, ప్రజలు వివిధ మార్గాల నుండి మానసిక పురోగతిని ఎలా సాధిస్తారో వివరిస్తాయి. ప్రతి మార్గం కూడా, తనదైన రీతిలో ఈ పురోగతికి దోహదపడుతుంది.
జ్ఞాన యజ్ఞం
ఇంతకు మునుపు పేర్కొన్న ఎన్నో రకాల అర్పణలు ఉన్నప్పటికీ, అవన్నీ ఒక పరమార్థమైన జ్ఞానం వైపు నడిపించినప్పుడే వాటికి అర్థం ఉంటుందని గీత వివరిస్తుంది (4.30- అపరే నియతాహారాః …). అవసరమైన జ్ఞానం లేకపోతే, బాహ్య కర్మలు ఒక వ్యక్తిని తాత్కాలికంగా సుఖపెట్టవచ్చు లేదా బలోపేతం చేయవచ్చు, కానీ అవి మన లోపల పాతుకుపోయి ఉన్న అజ్ఞానాల, అపార్థాల చిక్కుముడులను విప్పలేవు. అంచేతనే ఈ విషయంలో గీత ఒకే సూత్రాన్ని అందిస్తుంది : జ్ఞానంతో చేసే అర్పణ అన్నింటికంటే గొప్పది (4.33 – శ్రేయాన్ ద్రవ్య-మయాద్ యజ్ఞాత్ జ్ఞాన-యజ్ఞః …). దీనికి మరొక రకంగా అంటే – ఆ పారమార్ధిక జ్ఞానాన్నే ప్రతిఫలాపేక్ష లేకుండా మరొకరితో పంచకోవడం – అని కూడా అనుకోవచ్చు. భౌతిక అర్పణలు బాహ్య జీవితాన్ని శుద్ధి చేస్తాయి; జ్ఞానయజ్ఞం ఆ యజ్ఞం చేసే వ్యక్తినే శుద్ధి చేస్తుంది. జ్ఞానం మనస్సును ప్రకాశింపజేసినప్పుడు, కర్మ మానసిక బాలహీనతల నుండి బయట పడి, యజ్ఞస్ఫూర్తి స్వభావంగా మారుతుంది. తద్వారా, జీవితమే ఒక సుస్పష్టమైన వేదికగా మారుతుంది.
జ్ఞానార్జన
ఇప్పుడు జ్ఞానమే ప్రధాన అంశం కావడంతో, అట్టి జ్ఞానాన్ని ఏ విధంగా పొందవచ్చో కూడా గీత ఈ అధ్యాయంలో వివరిస్తుంది. ఈ జ్ఞాన దృష్టిని కేవలం చదవడం లేదా తర్కించడం ద్వారా మాత్రమే పొందలేము; అనుభవైక జ్ఞానం కలిగిన వారినుంచే ఆ జ్ఞానాన్ని స్వీకరించాలి. అలాంటి జ్ఞానం కలిగి ఉన్న గురువు ఎవరో తెలుసుకుని, అట్టి వారి సామీప్యాన్ని వినయంతో పొందాలని భగవానుడు వక్కాణిస్తాడు. అలా గురువుల దగ్గరకు వెళ్ళినపుడు సత్య విచారణ చేయాలనే తీవ్రమైన కోరిక, నేర్చుకోవాలనే తపన ఉండాలి (4.34 తద్ విద్ధి ప్రణిపాతేన …). ఇవి ఒక వ్యక్తిలో ఉన్నప్పుడే, గురువుద్వారా వారికి ఒక మార్గదర్శనం లభిస్తుంది. ఆ మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడే, వారిలో ఒక పరివర్తనాత్మక మార్పు వస్తుంది. స్వాధ్యాయనంతో అర్ధం చేసుకోలేని కష్టతరమైన అంశాలను గురువులు స్పష్టం చేస్తారు: కర్మ మరియు అకర్మల మధ్య వ్యత్యాసం, ఆత్మ యొక్క స్వభావం మరియు కర్తృత్వభావం యొక్క అల్లిక, ఇలాంటివన్ని కూడా గురుకృప, గురుకటాక్షంతోనే తేటతెల్లమవుతాయి అనే విషయం ఈ శ్లోకంలో భగవానుడు స్పష్టం గా వివరిస్తాడు.
జ్ఞాన శక్తి
జ్ఞానం మోహమూలాల్నితొలగిస్తుందని గీత వివరిస్తుంది. వెలుగు ఒక్క క్షణంలో చీకటిని ఎలా పారద్రోలుతుందో, జ్ఞానం ఒక మనిషిలోని అజ్ఞానాన్ని అలా పారద్రోలి తనలోనూ, ఆ పరమాత్మలోనూ కూడా సమస్త ప్రాణికోటిని దర్శింపచేస్తుంది. (4.35-యజ్ జ్ఞాత్వా న పునర్ మోహం…). ఒక ప్రజ్వరిల్లే అగ్ని సమిధలను ఎలా బూడిద చేస్తుందో, జ్ఞానం కూడా అలానే ఎప్పటినుంచో మన వెంట వస్తున్న సంచితకర్మశేషాలను దహించివేస్తుంది (4.37- యథైధాంసి సమిద్ధో ‘గ్నిః…). తద్వారా మన గత కర్మల బంధం నుంచి మనకి విముక్తి లభిస్తుంది. సంపూర్ణంగా కాకపోయినా, ఈ జ్ఞానార్జన దిశలో కొద్దిపాటి పురోగతి సాధించినా, అట్టి జ్ఞానం వల్ల సాధకుడికి దుష్కార్మఫలాల ప్రభావం నుండి విముక్తి చేస్తుంది (4.36- అపి చేద్ అసి పాపేభ్యః…).
జ్ఞాన అర్హతలు
శ్రద్ధ, ఇంద్రియనిగ్రహం మరియు కార్యదక్షత – ఇవన్నీ కూడినప్పుడు మాత్రమే స్థిరమైన జ్ఞానం లభిస్తుందని గీత ధృవీకరిస్తుంది (4.39- శ్రద్ధావాన్ లభతే జ్ఞానం …). ఇక్కడ శ్రద్ధ అంటే మూఢ నమ్మకం కాదు, ఒక అవగాహన కలిగించుకోవడానికి మనసుకి అవసరమైన సహకారం. ఇంద్రియనిగ్రహం అలాంటి మనస్థితికి స్థిరత్వం చేకూరిస్తుంది. కార్యదక్షత దానిని ముందుకు తీసుకెళ్తుంది. అలాంటప్పుడే జ్ఞానం, ఆ వ్యక్తికి పరమ శాంతిని తప్పక తక్షణమే కలగచేస్తుంది అనేది భగవానుడి వాక్కు. దీనికి విరుద్ధంగా, సందేహించేవాడు, నమ్మకం లేనివాడు భ్రష్టుడే అవుతాడు. (4.40-అజ్ఞశ్చాశ్రద్ధధానశ్చ…). అటువంటి వ్యక్తి, ఇక్కడి లోకాల్లో సుఖాలనూ, అటు పై లోకాల్లో సుఖాలనూ, రెండింటినీ కోల్పోతాడు.
జ్ఞానం – ముక్తి సాధనం
జ్ఞానం వల్ల మొహాలు, సందేహాలు, సంశయాలు తొలగిపోయినప్పుడు, మనస్సు నిశ్చలంగా నిర్భయంగా నిలుస్తుంది. మనిషి మానసికంగా స్థిరపడతాడు. అతడిని ఏ ఆకర్షణ-వికర్షణలు కలవరపరచవు. ఆ స్థితిలో, కర్మలో ఆకర్మ సిద్ధాంతంగా కర్మాచారణ చేస్తూ, యజ్ఞస్ఫూర్తితో కర్మఫలాలను భగవదర్పణం చేసే వారికి కర్మబంధాలు అంటవు. (4.41 యోగ-సన్న్యస్త-కర్మాణం…). ఈ అధ్యాయం అటువంటి జ్ఞానగత మానసిక స్థిరత్వం వైపు పిలుపుతో ముగుస్తుంది. అజ్ఞానం వల్ల కలిగే సందేహాన్ని జ్ఞానంతో ఖండించి తక్షణ కర్తవ్యాన్ని చేపట్టమని అర్జునుడికి ఉద్బోధించబడింది (4.42 – తస్మాద్ అజ్ఞాన-సంభూతం …). ఈ విధంగా, జ్ఞానం అనేది తక్షణ కర్తవ్య నిర్వహణకే కాకుండా ముక్తికి కూడా సాధనం అవుతుంది అనే భాగవానుడి సందేశం అర్జునుడి ద్వారా మనకు లభ్యం అయింది.
ముగింపు
ఈ అధ్యాయం యొక్క బోధన ఒకే క్రమంలో సాగుతుంది: జ్ఞానం కర్మను మారుస్తుంది. ఆ జ్ఞానంతో కర్తృత్వభావం తొలగిపోయినప్పుడు, మనస్సు స్థిరపడి మనం చేస్తున్న కర్మ, మనని కర్మ బంధం లోకి పడనీయదు. జ్ఞానం గత కర్మల అవశేషాలను సైతం దహించివేస్తుంది. సందేహాల నుంచి, సంశయాల నుంచి, చివరకు కర్మబంధం నుంచి కూడా ఈ జ్ఞానమే మనల్ని విముక్తుడ్ని చేస్తుంది.
అయితే సాధకులకు, ఈ అధ్యాయం యొక్క సందేశం అర్ధం చేసుకున్నాక, కొంతమందిలో ఒక ప్రశ్న జనించవచ్చు: లోపల మానసికమైన ముక్తి, అలాగే బాహ్యంగా కర్మబంధం నుంచి రక్షణ – ఈ రెండిటికీ కూడా కారణం జ్ఞానమే అయితే, మరి సన్యాసం యొక్క అవసరం ఏమిటి? ఈ ప్రశ్నకి, అలాగే ఇలాంటి మరి కొన్ని ప్రశ్నలకి సమాధానం కావాలంటే, గీతాబోధలలో సత్యాన్వేషణకై మనం మరికొంత ముందుకు ప్రయాణించాల్సి ఉంది.
ఈ లోపల పాఠకులు తమ వంతు యజ్ఞం చేయవచ్చు – మీకు ఇప్పటిదాకా తెలిసిన గీత సందేశాలను, మరో నలుగురితో (మౌకికంగా కావచ్చు, లిఖిత పూర్వకంగా కావచ్చు, మరోలా కావచ్చు) ఏదో ఒక విధంగా పంచుకోగలిగితే, మీరు కూడా జ్ఞాన యజ్ఞంలో ఒకింత భాగస్వాములే అవుతారు అని తలుస్తాను. మీరు ఏమంటారు ?
