Category: తాత్త్విక తరంగాలు

  • కర్మ – చతుర్విధ మార్గంలో తొలి మెట్టు

    ఈ వ్యాసం, చతుర్విధ మార్గం — కార్యాచరణ, ఆలోచన, విచారణ, అన్వేషణ — వైపు సాగే ప్రయాణానికి తొలి అడుగును ఆవిష్కరిస్తుంది. మనం ముందుగా పరిశీలించిన “మనము ఎక్కడ ఉన్నాము?” అనే వ్యాసంలో, ఆధునిక జీవన స్థితిని, యాంత్రిక దినచర్యల ప్రవాహంలో మనం ఎలా కొట్టుకుపోతున్నామో గమనించాము. మనలో చాలామంది ఈ అనాలోచితమైన స్థితిలోనే జీవిస్తున్నాము. ఉదయం మొబైలు ఫోన్లో నోటిఫికేషన్‌లకు మేల్కొనడం, ఆఖరి నిమిషంలో పనుల కోసం పరుగులు, సామాజిక మాధ్యమాలలో (సోషల్ మీడియా) ఉత్తర–ప్రత్యుత్తరాలకు యాంత్రిక స్పందనలు, సమావేశాలు, బాధ్యతలు, చివరకు రాత్రికి అలసిపోయిన భావనతో రోజును ముగించడం. చివరిగా ఒక రోజుని గడిపేసాం, ఇక ఈ పూటకి చేయవలసినది ఏమి లేదు అనే తృప్తితో (లేదా అసంతృప్తితో అయినా కావచ్చు) నిద్రలోకి జారుకుంటాము.  

    కానీ ఆ రోజు నిజంగా ఏమి సాధించాము ? నిన్నటిదాక లేని ఏ కొత్తదనాన్ని ఈ రోజు మనదిగా చేసుకున్నాం ? ఏ స్ఫూర్తితో ఈ నాటి పనులని చేశాం ? ఈ ప్రశ్నలలో దేనికి సమాధానాలు లేకుండానే, ఒక రోజు ఏ ప్రణాళిక పై గడిచిందన్న స్పష్టత కూడా లేకుండానే గడిచిపోతోంది మన దైనందిన జీవితం. ఇది చైతన్యపూర్వక జీవనం కాదు; కేవలం కొన్ని అచేతన కదలికల సమూహం మాత్రమే. ఈ యాంత్రిక ప్రవాహం నుంచి బయటపడటానికి కేవలం ఎక్కడికో వెళ్ళి తత్వచర్చలోనో , ధ్యాన సాధనలోనో పాల్గొనాలి అని అనుకోవాల్సిన అవసరం లేదు. దానికి సులభమైన తొలి మెట్టు — కార్యాచరణ లేదా కర్తవ్య నిర్వహణ లేదా కర్మ చేయడం; ఇక్కడి నుంచే, సులభతరంగా ఉండే ఒక సాధనాయానం మొదలుపెట్టొచ్చు. ఇదే ఇంతకు ముందు మనము అనుకున్న చతుర్విధ మార్గాలలో మొట్ట మొదటిది .

    కర్మ అంటే ఏమిటి?

    శ్రీమద్భగవద్గీత మూడవ అధ్యాయం (కర్మయోగం), ఒక ప్రాథమిక సత్యాన్ని స్పష్టంగా ప్రతిపాదిస్తుంది: ఎవ్వరూ ఒక్క క్షణం కూడా కర్మ చేయకుండా ఉండలేరు (గీత 3.5 — “న హి కశ్చిత్ క్షణమపి…”). ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మనం గమనించాలి. “నేను రోజంతా ఏదో ఒక పనిలోనే ఉంటాను” అని అనుకోవచ్చు; కానీ పనుల్లో మునిగి ఉండే క్రియ ఒకటైతే , కర్మ మరొకటి  – ఈ రెండూ ఒకటే అని అనలేం. పనుల్లో మునిగి ఉండే క్రియ ఒక అగమ్య ప్రవాహంలో కొట్టుకుపోవడం అయితే, కర్మ (లేదా కార్యాచరణ) అనేది నిర్దిష్టంగా స్వీకరించిన ఒక బాధ్యత.

    సరిగ్గా గమనిస్తే, మనం బాధ్యతల బరువుల వల్ల అలసి పోవడం లేదు; మనకు వచ్చే అలుపు, అసంఖ్యాక అనాలోచిత స్పందనల వల్ల. కర్మను, ఒక బాధ్యతగా స్వీకరించడం అంటే, ఆ యాంత్రిక ప్రవాహం విడిచి,  ఒక క్షణకాలం వెచ్చించి, “ఇది నా కర్తవ్యం” అని మనస్సులో ఒక్క దృఢమైన నిశ్చయం చేసుకుని ఆ కార్యాన్ని మొదలుపెట్టడమే.

    మనం కర్మను ఎందుకు ఆచరించాలి?

    జీవితంలో మన పాత్ర మనం సక్రమంగా పోషించాలంటే, బాధ్యతాయుతమైన కర్మ (కర్మ /  కార్యాచరణ / కర్తవ్య నిర్వహణ – ఏ పదం వాడినా) తప్పనిసరి.

    గీత రెండవ, మూడవ అధ్యాయాలలో మనకు స్పష్టంగా కనిపించే విషయం ఏమిటంటే — మనకు కర్మ చేయడంలోనే అధికారం ఉంది; ఫలితాలపై కాదు, అలాగే కర్మ చేయకుండా ఉండడం అసాధ్యం (గీత 2.47; 3.5). ఈ రెండు ఉపదేశాలు ఒకే దిశగా సూచిస్తాయి — ఫలితాల పట్ల ఆసక్తిని వదిలి, స్పృహతో కర్మ చేయాలి. అంచేత, మన సంకల్పాలు కార్యరూపం దాల్చాలంటే, కర్మ చేయడం అనేది అనివార్యం.

    కర్మ ఏ పరిస్థితులలో చేయాలి?

    కర్తవ్యం లేదా బాధ్యత మన ముందుకు స్పష్టంగా వచ్చినప్పుడు, కర్మ చేయక తప్పదు. మన వంతుగా చేయాల్సిన పని ఏదో తెలిసినప్పటికీ దాన్ని వాయిదా వేస్తూ ఉంటే, మనశ్శాంతి ఉండదు. అదే పని సరైన సమయంలో చేసేస్తే, అంతకుముందు ఉన్న కంగారు తగ్గి, మనసు కాస్త తేలిక పడుతుంది.

    మనం సులభతరమైన పనులనే తీసుకుందాం — ఎప్పటినుంచో అసంపూర్ణంగా మిగిలి ఉన్న ఒక చిన్న పని పూర్తిచేయడం, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం, లేదా ఎంతోకాలంగా మనం తప్పించుకుంటూ వచ్చిన ఒక బాధ్యతను ఒక్కసారి నిలబడి ఎదుర్కోవడం — ఇవి చాలు కర్మగా చేయడానికి. ఇలాంటి పనులు చేసిన తరువాత మనకు కలిగే ఒక చిన్న తృప్తి; మనమేంటో మనకు తెలిసే వచ్చే ఒక చిన్న స్పష్టత; ఇవే మనల్ని మరింత సచేతనంగా జీవితాన్ని సాగించడానికి ప్రోత్సాహం ఇస్తాయి.ఇక ఇదే రీతిలో నిజంగా కష్టతరమైన పనులు చేస్తే, అప్పుడు కలిగే ఆ తృప్తి గురించి, పెరిగే ఆనాటి ఆత్మ విశ్వాసం గురించి, మన సామర్ధ్యం పై మనకొచ్చే స్పష్టత గురించి ఇక చెప్పనే అక్కరలేదు.

    కర్మ : క్రియ vs ప్రతిక్రియ

    మన జీవితంలో జరిగే ప్రతి సంఘటనకి మనం స్పందించడం సహజం. అయితే, మనలో పుట్టే ప్రతి భావానికి క్రియాశీలంగా స్పందించాల్సిన అవసరం లేదు. కోపం, చిరాకు, భయాందోళనలు, ఉద్వేగాలు — ఇవన్నీ చాలాసార్లు మన ప్రమేయం లేకుండానే మన ఆచరణ ద్వారా బయటకు వ్యక్తం అవుతూ ఉంటాయి. ఈ విధమైన వ్యక్తీకరణ వల్ల మన మనసు తేలిక పడుతుందని అనుకోవడం తప్పు. ఎందుకంటే, కోపంతో కమ్ముకున్న కోరిక మన ఆలోచనా శక్తిని అస్థిరం చేస్తుందని గీత కూడా సూటిగా చెబుతుంది (గీత 3.36–37, కర్మయోగం).

    అంచేతనే, మనం ఆలోచించి, ఆ ఆలోచనలో ఒక స్పష్టత వచ్చాక, దాన్ని ఒక నిర్ణయంగా మార్చి, ఆ నిర్ణయాన్ని అమలు చేస్తే, ఆ క్రియని కర్మ అనగలము. దీనికి విరుద్ధంగా, ప్రతిక్రియను మాత్రమే ఆచరిస్తే, దాన్ని మనం చేసిన ఒక కర్మగా లెక్క కట్టలేం. కర్మగా మారిన ఒక క్రియకి – ఒక ప్రతిక్రియకి మధ్య ఉన్న ఈ వ్యత్యాసమే మనం తెలుసుకోవలిసినది. ఇది దృష్టిలో ఉంచుకుని మనం క్రియ ఆచరిస్తే, మన చేసే క్రియ సకర్మ అవుతుంది. అంతే కాకుండా, ఈ స్పృహతో చేసిన ప్రతి కర్మ, ఎంత చిన్నదైనా సరే, మనల్ని యాంత్రికంగా స్పందించే అలవాట్ల నుంచి కొంతైనా బయటకు తీసుకెళ్తుంది; మరో పక్క, మన వల్ల జరిగే ప్రతి ప్రతిక్రియ, మన శక్తిని కరిగిస్తూ, మునుపటి మానసిక అస్థిరత వైపే తిరిగి తోసేస్తుంది.

    కర్మ ఏ పరిస్థితులలో చేయకూడదు?

    ఇంతకు మునుపు అనుకున్నట్టు, మనం ఒకోసారి ప్రతిక్రియ దశలోకి జారిపోతూ ఉంటాము. అలాంటి పరిస్థితుల్లో, అంటే మనలో భావోద్వేగాలు అస్థిరంగా ఉన్నప్పుడు, లేదా పరిస్థితి ఇంకా స్పష్టంగా అర్థం కాకముందే ఏదో ఒకటి చేసేయాలి అనే తపన కలిగినపుడు, కొద్దిగా ఆగి ఆలోచించడం అవసరం.

    మరి కర్మ చేయకుండా ఒక్క క్షణం కూడా ఉండలేము అని గీత స్పష్టం చేసింది కదా ? మౌనం, సహనం, కొద్దిసేపు వేచి ఉండటం — ఇవి బాహ్య క్రియలు కాకపోయినా, సరిగ్గా చూస్తే, ఇవి కూడా కర్మలే. కాకపోతే బాహ్య కర్మలు కావు – సరైన మానసిక కర్మలు. మానసిక అస్థిర స్థితిలో ఉన్నప్పుడు, ఒక ప్రతిక్రియను సకర్మగా మార్చే సరయిన సాధనాలు ఇలాంటి మానసిక కర్మలే అని మనం గుర్తించాలి.

    ఉదాహరణకి, భగవద్గీతలో అర్జునుడి మానసిక స్థితిని గమనిస్తే, అది అతని బలహీనతని మాత్రమే సూచించదు; తానే ఆలోచన చేసి, తనలోని మానసిక సందిగ్ధతని ముందుగా తానే గుర్తించి, తద్వారా భగవద్గీత బోధకు అర్హుడు అవ్వగలిగాడనే విషయం కూడా మనం ఖచ్చితంగా గమనించాలి. రెండవ అధ్యాయం మనకు స్పష్టంగా చెబుతుంది — సరైన కర్మకు ముందు స్పష్టత అవసరం. ఇప్పటికి కూడా, అంటే ఈనాటి ఆధునిక జీవితానికి కూడా ఈ సిద్ధాంతం వర్తిస్తుంది. “కోపం, భయం, లేదా ఆందోళనలో ఉన్నప్పుడు వెంటనే స్పందించడం తరచుగా మరింత గందరగోళానికే దారి తీస్తుంది” అనే సంగతి తెలియని వాళ్ళమేమి కాదు మనం; అయినాసరే, మరో మారు మనని మనం హెచ్చరించుకుందాము. గమనించవలసినది ఏంటంటే, సరైన సమయంలో కొన్ని క్షణాలు ఆగి ఉండటం, మనసు కుదుటపడేందుకు అవకాశం ఇస్తుంది; ఆ తరువాత చేపట్టే కర్మకు స్థిరత్వం ఇస్తుంది.

    కర్మ నుండి ఆలోచన వైపు

    మన జీవితంలో చేసే పనులలో కొన్ని ఎలాంటివి అంటే, ఆ పనిని ఎన్నో సార్లు చేసి ఉంటాము; ఇంకా ఎన్నో సార్లు చేయాల్సి ఉంటుంది. ప్రతీ రోజూ విధిగా చేసే పనులను నిత్య కర్మలు అంటారు. రోజూ కాకపోయినా, అడపా దడపా వచ్చే అవసరాల నిమిత్తం చేసే వాటిని నైమిత్తిక కర్మలు అంటారు. ఇలాంటి కర్మలు మళ్లీ మళ్లీ చేస్తున్నప్పుడు, ఏదో ఒక దశలో మనకు ఆ పని మీద, ఆ కర్మ మీద ఒక స్థిరత్వం వస్తుంది.

    ఎందుకంటే, చేయాల్సినది ఏమిటో స్పష్టంగా తెలుసు; అనేక పర్యాయాలు దాన్ని అదే విధంగా, సునాయాసంగా ఆచరణలో పెట్టాము. అంచేత, మళ్లీ అవే పనులు చేస్తున్నప్పుడు, మనసు ఇక నిర్ణయాల గందరగోళంలో ఉండదు; స్థిరంగా ఉంటుంది. అలా కర్మ తన దారిలో తాను సాగుతున్నప్పుడు, మనం ఆ కార్యాన్ని కేవలం చేస్తూనే ఉండి పోకుండా, దాన్ని గమనించే స్థితిలోకి వస్తాము.

    ఈ గమనికే ఒక ఆలోచన పుట్టేలా చేస్తుంది. ఇప్పుడేమి చేస్తున్నామన్నది మాత్రమే కాక, ఎందుకు చేస్తున్నాం, దాని లక్ష్యం ఏమిటి, ఆ లక్ష్యానికి మనం ఆచరించే విధానం అనుగుణంగా ఉందా, ఈ విధానంలో మార్పు అవసరమా, ఇదే కర్మను ఇంతకంటే మరింత ఉపయోగకరంగా చేయవచ్చా అనే ప్రశ్నలు సహజంగా మనలో ఉత్పన్నమవుతాయి.

    అలా పుట్టిన ఆలోచన కర్మకు విరుద్ధమైనది కాదు; కర్మలోని సహజమైన తదుపరి దశ. ఈ దశలో పుట్టే ఆలోచన, ఒక నిరాశతో గానీ, సందిగ్ధతతో గానీ వచ్చినది కాదు; సచేతనంగా సాగుతున్న కర్మ నుంచే పుట్టిన ఒక మానసిక కర్మ. ఇదే ‘ఆలోచన’; తదుపరి దశ అయిన విచారణకు మనల్ని సిద్ధం చేసే రెండో మెట్టు. మరి, కర్మని గూర్చి ఇప్పటిదాకా అర్థం చేసుకున్న విధంగా ఆచరించడం మొదలుపెడితే, మనం మొదటి మెట్టును విజయవంతంగా ఎక్కినట్టే కదా.

    ముక్తాయింపు

    కర్మపై మనకు కలిగే అవగాహన, మన జీవితాన్ని మనమే గమనించే స్థాయికి తీసుకువెళ్తుంది. మనం చేయాల్సిన పనిని ప్రతిక్రియగా కాకుండా, ఆలోచించి, బాధ్యతగా చేయడం మొదలుపెట్టినప్పుడు, జీవనయానం స్థిరపడుతుంది. ఆ స్థితిలో మనం పనులను కేవలం చేస్తూనే ఉండకుండా, వాటి లక్ష్యాన్ని కూడ మన దృష్టిలోకి తెచ్చుకుంటాము; ఆ దృష్టే ఆలోచనకీ, తరువాత విచారణకీ దారి తీస్తుంది.

    ఇలా చూస్తే, కర్మ, ఆలోచన, విచారణ, చివరిగా నిరంతర సాధనగా ఒక అన్వేషణ — ఈ చతుర్విధ మార్గాలు వేర్వేరు కాదు; జీవన ప్రయాణంలో ఒకదాని వెంట మరొకటి ఒక క్రమంలో ముందుకు తీసుకెళ్లే సోపానాలు. జీవన సరళిలో చిన్న చిన్న మార్పులతో, కొద్దిపాటి అవగాహనతో, ఈ సోపానాలు మన జీవితానికి ఒక స్థిరత్వాన్ని, అదే విధంగా మన లక్ష్య సాధనకి ఒక అర్హతను కూడా అందిస్తాయి.

  • మనం ఎక్కడ ఉన్నాం?

    జీవిత మధ్యంలో పరిశీలన

    (ఇది తాత్త్విక తరంగాల శ్రేణిలో మొదటి వ్యాసం. నేను దీన్ని కేవలం మీతో పంచుకోవాలనే కాదు, మీలోనూ ఇలాంటి తాత్త్వికమైన తరంగాలు కల్పించాలన్న ఉద్దేశ్యంతో రాశాను. ఈ వ్యాసాలు 45 సంవత్సరాలు పై బడిన వారికి మరింత సముచితంగా, ఆసక్తికరంగా ఉండొచ్చు. అయితే యువ పాఠకులకు కూడా స్వాగతమే.)

    జీవితం, ముఖ్యంగా మానవ జీవితం అనేది, చుట్టూ ఉన్న ప్రపంచంతో కలిగే సంబంధాలతోనూ, అట్టి సంబంధాల వలన కలిగే అనుభవాలతోనూ కలిపి నేసిన ఒక గొప్ప వస్త్రంలాంటిది .

    మనలో ప్రతి ఒక్కరి జీవితంలో, విద్యార్థి దశను దాటి, అటు పై  ఆదాయ సంపాదన దశలోకి మారిన తర్వాత, జీవన లక్ష్యం అనేది సాధారణంగా, ఉద్యోగపరమైన లక్ష్యాల చుట్టూ తిరుగుతుంది. ఈ లక్ష్యాలు వ్యక్తిగత అభివృద్ధికి, ఆర్థిక స్థిరత్వానికి, అలాగే కొంతమేర సంతృప్తిని కూడా కలిగిస్తాయని సాధారణంగా భావించవచ్చు. ఈ దశలో కొనసాగుతూనే, మనం కుటుంబంతో, స్నేహితులతో, సహచరులతో, ఇరుగు-పొరుగువారితో, మరియు మన పరిచయాల్లో ఉన్న సామాజిక వర్గాలతో బంధాలను ఏర్పరుచకోవడం, ఆ బంధాలను పోషించడం కూడా మొదలుపెడతాం. ఈ బంధాలు, మన జీవితానికి ఆనందం, అర్థం, అవసరానికి కావలిసిన మద్దతునీ ఇస్తాయని మన ఊహ, ఆశ. జీవితంలో మనం చేయవలసిన కర్తవ్యాలకి, మరియు బాధ్యతలకి కూడా కారణం – ఈ బంధాలని నిలుపుకోవాలన్న కోరికే.

    కొంతమంది త్సాహవంతులు, ఇన్ని బాధ్యతల మధ్యలో కూడా, పుస్తక పఠనం, క్రీడలు, సంగీతం, యాత్రలు, లేదా ఇతర సృజనాత్మక కార్యకలాపాల ద్వారా వ్యక్తిగత ఆనందాన్ని పొందగలుగుతారు. ఇటీవల కాలంలో, ఆరోగ్యంపై అవగాహన పెరిగింది. అంచేతనే, శరీర వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారం, మెదడుకి మేత, తరచూ వైద్య పరీక్షలు చేయించుకోవడం – ఇలాంటి వాటి ద్వారా, శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడం కూడా, మన జీవితంలో భాగమైంది.

    ప్రతి వ్యక్తి యొక్క జీవన విధానం అతను పెరిగిన వాతావరణం పైన, అతని ఆసక్తుల పైన, అతను నిర్వర్తించే బాధ్యతలపైన, అతని జీవిత ఆశయాల పైన ఆధారపడి తనకంటూ ఒక ప్రత్యేక వ్యక్తిత్వాన్ని సంతరించుకుంటుంది. ఇప్పటివరకు మనమందరం కూడా జీవితం ఎలా ఉందో చూస్తున్నాం, అనుభవించాం. జీవితం ఎన్నో మలుపులతో కూడిన ప్రయాణం. జీవితం మనకు అనుకూలంగా ఉండే విషయాలతో మాత్రమే నిండినది కాదు అని కూడా మనకు తెలియంది కాదు. అందుకే, ఇన్ని  మలుపులతో గడిచే మన జీవిత యాత్ర, సరైన దిశలో వెళుతోందో లేదో అనే విషయం పై ఒకోసారి సందేహం కలగడం సహజం. ఈ సందేహం తీరేదెలా ?

    ఇదే నేపథ్యంలో, మరి కొన్ని ప్రశ్నలు మీ ముందుంచాలనుకుంటున్నాను: ఇప్పటివరకు జరిగిన మీ జీవిత ప్రస్థానంలో, మీరు తీసుకున్న నిర్ణయాలు, చర్యలు – అన్నీ సరైనవేనా? మీరు మీ పట్ల పూర్తిగా సంతృప్తిగా ఉన్నారా?

    ప్రతీవారి యొక్క బాధ్యతలు, కర్తవ్యాలు జీవన గమనంలో మారుతూ ఉంటాయి. 45 – 55 ఏళ్ల వయస్సు వచ్చే వరకు, ఇవి పెరుగుతూ వుంటాయి. అటు తర్వాత వయస్సులో, కొంత కాలం వరకు ఇవి అలాగే స్థిరపడి పోతాయి. ఆ తరువాత, వయస్సు పెరిగే కొద్దీ, ఇవి తగ్గడం ప్రారంభమవుతాయి. ఒకానొక దశలో, మనం నిజంగా చూస్తే, బాధ్యతలు అనేవి ఏమీ లేకుండానే పోతాయి. మొత్తం మీద చూస్తే, బాధ్యతలనేవి ప్రారంభం, పెరుగుదల, గరిష్ట స్థాయి, తగ్గుదల, ముగింపు అనే దశల ద్వారా సాగుతాయి.

    ఇప్పుడు మరి కొన్ని ప్రశ్నలు: 45 – 55 వయస్సు వద్ద, బాధ్యతలన్నీ స్థిరంగా ఉంటాయి అనుకున్నాము కదా. ఈ దశలో వున్న మీ ఇప్పటి జీవితం, మీ యువ దశలో మీరే కోరుకున్న ఆశయాలతో సరిపోలుతోందా? ఆ దృష్టితో చూస్తే, మీ జీవితంలో మీరు ఇప్పటివరకు సాధించినదానితో మీరు పూర్తిగా సంతృప్తి చెందారా?

    ఇలాంటి ప్రశ్నలన్నిటి దృష్ట్యా, ఇప్పటివరకు మనం ఎటు వెళ్లామో పరిశీలించడం అనేది మనకు చాలా అవసరం. మన వయస్సు 45 దాటినా, ఇంకా జీవితం చాలానే మిగిలి ఉంది కదా. ఈ వయస్సులో, మన బాధ్యతలలో కూడా, కొత్తగా వచ్చే పెద్ద మార్పులు, అవసరాలు వుండకపోవచ్చు. ఇంకా మిగిలి వున్న బాధ్యతలను తీర్చే ప్రణాళిక ఇప్పటికే తయారై వుంటుంది. కాబట్టి, ఇప్పుడు మన జీవిత లక్ష్యం ఏమై ఉండాలి?

    కొద్దిగా ఆలోచిస్తే, ఇది డబ్బుతో సంబంధం ఉన్న లక్ష్యం కాదు అని తెలిసిపోతుంది. ఎందుకంటే, ఈ వయస్సులో మన ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది – అంటే, ఒక రకంగా మనం అలవాటు పడిపోయిన ఆర్ధిక స్తితి కాబట్టి.  ఇప్పుడు మనం జీవిస్తునే ఉన్నందువల్ల, ఈ వయస్సులో బాధ్యతలు అనేవి మనకు ఉండి  తీరుతాయి. కానీ వాటిని నెరవేర్చడం మాత్రమే జీవితం కాదు. ప్రతి మనిషి కూడా తన జీవితంలో ఒక ఉన్నతమైన లక్ష్యాన్ని కూడా కలిగి ఉండాలి. డబ్బు అనేది ఒక తాత్కాలిక లక్ష్యంగా మాత్రమే ఉండొచ్చు. కానీ, ఇక్కడ నేను మాట్లాడేది ఒక ‘మానవ’ జీవన లక్ష్యం గురించి – ఈ విశాలమైన విశ్వంలో మన ప్రయాణం ఎటు ? మనకున్న ఇన్ని అనుభవాల నేపథ్యంలో, మనం ఏమి సాధించాం ?  మనం ఈ సమాజానికీ, ఈ దేశానికి, ఈ ప్రపంచానికీ, ఏదైనా తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత మనపై ఉందా? ఇప్పటిదాకా సాగిన మన ప్రయాణంలో, మనకి ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ సహాయం చేసినవారందరికీ, ఇంకా చేస్తూనే వున్న వారికీ, మనం ఏదైనా తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత మనకు ఉందా?

    ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలంటే, జీవితంలోని ఈ దశలో, ఒక చిన్న ఆలోచన అవసరం. మన అనుభవాలు, మన నిర్ణయాలు, మన విజయాలు, మన వైఫల్యాలు – వీటన్నిటినీ జాగ్రత్తగా పరిశీలించి, అవి మన మననుని ఎలా మలిచాయో అర్థం చేసుకోవాలి. మన అభిప్రాయాలు, అహంకారాలు, పక్షపాతాలు కలగలిసిపోయి, మన దృష్టిని ఇప్పటికే మసకబార్చి ఉండవచ్చు. దాని పర్యవసానంగా కొన్ని ముఖ్యమైన అవకాశాలని మనం జీవితంలో చేజార్చుకుని ఉండవచ్చు. ఒకసారి మన పరుగు ఆపి, కొన్ని క్షణాలు ఆగి, మన మనస్సులోనే మన వ్యక్తిత్వాన్ని ఒక్కసారి, నిస్పక్షపాతంగా  సమీక్ష చేసుకుంటే, రాబోయే మన జీవన ప్రవాహానికి ఒక సరైన దిశ ఇవ్వవచ్చు – తద్వారా మనం మరింత ఆనందంగా, సంతృప్తిగా జీవించవచ్చు. అవసరమైతే, ఇతరులను కూడా ఆనందంగా, సంతృప్తిగా జీవించేందుకు అవసరమైన సహాయం చేయవచ్చు. ఇలాంటి ఆత్మపరిశీలన చేస్కోవాలంటే, నమ్మకమైన స్నేహితులు, గురువులు అవసరం. అలాగే,  కొద్దిపాటి ధ్యానం కూడా ఎంతో సహాయపడుతుంది. వీటన్నిటి సహాయంతో, మన పురోగతి, మన తప్పులు, మన మూర్ఖత్వం, జీవితంలో ‘మనం నేర్చుకున్నాం’ అనుకున్న పాఠాలను – వీటన్నిటినీ నిష్పక్షపాతంగా విమర్శ చేసుకోవాలి. అప్పటికీగానీ, ‘మనం ఎక్కడున్నాం’ అనే ప్రశ్నకు కొంతైనా సమాధానం దొరకదు.

    మరి, ఈ నేపధ్యంలో, ఇప్పుడు మీకు కొన్ని ప్రశ్నలు .. మీ జీవన ప్రయాణాన్ని ఇప్పటివరకు మీరు పరిశీలించారా? ఇప్పుడు ఎటు వెళ్తున్నారు అనేది గమనిస్తున్నారా ? లేదంటే, ఇప్పుడు ఆలోచించండి…మీ జీవితం గురించి.  

    మీరు ఏమి చేసారు ? ఇప్పుడు ఏ దశలో ఉన్నారు ? తర్వాత ఏమి చేయాలి ? మీరు ఎందుకు ఆనందంగా ఉన్నారు ? లేదా ఎందుకు ఆనందంగా లేరు ? ఎందుకు సంతృప్తిగా ఉన్నారు లేదా ఎందుకు మీకు అసంతృప్తి ?

      – వీటన్నిటికే సమాధానాలు వెతికే క్రియలో, అంటే జీవిత మధ్యంలో ఒక స్వీయ-సమీక్షలో, మీరు నిమగ్నమవుతారని, తద్వారా తదుపరి ప్రయాణాన్ని సుగమం చేసుకుంటారని, మీతో పాటు మరికొందరి మార్గాన్ని కూడా సుగమం చేయిస్తారని ఆశిస్తూ, ఇక్కడ విరామం తీసుకుంటాను.

    నమస్తే.

    ___________________________________________________________________________

    తదుపరి వ్యాసం  – “చతుర్విధ మార్గం” ; ఈ వ్యాసాన్ని తెలుగులో చదవడానికి, క్రింది లింకను క్లిక్ చేయండి – https://nvsatish.com/2025/10/01/chaturvidha-margam/

    To read the English Version of the current article: Click the link below –  https://nvsatish.com/2025/01/28/where-are-we-a-mid-life-introspection/

  • చతుర్విధ మార్గం

    చతుర్విధ మార్గం: “కార్యాచరణ, విచారణ, ప్రశ్న, అన్వేషణ” – తాత్త్విక తరంగాలు

    కార్యాచరణ :

    ఈ కాలంలో జీవితం వేగంగా సాగుతోంది. పనులు పేరుకుపోతున్నాయి. బాధ్యతలు మన రోజంతటిని ఆక్రమిస్తున్నాయి.  అవసరమైన వాటికే సమయం సరిపోవడం లేదు. సమయానికి పని నెరవేర్చడం; ఉద్యోగ రీత్యా, కుటుంబ రీత్యా, ఎన్నో పాత్రలు పోషించడం; మనకంటూ ఏర్పరుచుకున్న ఒక జీవన దైనందిన వ్యవస్థని నడిపించడం;

    అవసరమైనది పూర్తిచేస్తున్నాం. ఆలోచించేందుకు, పునఃపరిశీలించేందుకు మన దగ్గర సమయం లేదు; ఆలోచించాలని మనకు ప్రణాళిక కూడా ఏమీ లేదు. ఇలా, ఇవన్నీ చేస్తున్నప్పుడు, మనం చాలా సార్లు యాంత్రికంగా పని చేస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అయితే, ఇది నిర్లక్ష్యం కాదు; ఇది ఆధునిక జీవనశైలి యొక్క వేగం. కానీ ఈ వేగంలోనే, మనం కోరుకుంటే, మన పనులు చేయడానికి ఒక మంచి  విధానాన్ని అలవరుచుకోవచ్చు : ఓ చిన్న ఆలోచనకు చోటు కల్పించడం; మన పనిలో కొంత స్పష్టత తెచ్చుకోవడం; మన దినచర్యలో కొన్ని తేలికపాటి మార్పులు తెచ్చుకోవడం. ఇలాంటివే .

    మన రోజువారీ జీవితంలో, కొన్ని విధులు మరియు బాధ్యతలు తప్పనిసరిగా చేయాల్సినవే అని మనకు తెలిసినదే.ఇవి వృత్తిపరమైన పనులు, కుటుంబ బాధ్యతలు, చిన్న చిన్న మానవతా చర్యలు, ధార్మిక కార్యక్రమాలు – ఏవైనా కావచ్చు లేదా అన్నీ కావచ్చు. ఇదే విషయం పై “మనం ఎక్కడ ఉన్నాం – జీవిత మధ్యంలో పరిశీలన” అనే నా గత వ్యాసంలో చర్చించాను. (https://nvsatish.com/2025/10/02/manam-ekkada-vunnamu)

    ఆ విషయాన్నే, ఇప్పుడు మరింత లోతుగా చూద్దాం. ఇంతకుముందు చెప్పిన పనులను కేవలం ‘చేసేశాం’ అని అనిపించుకునే విధంగా చేస్తే సరిపోతుందా? అవి నిజంగా – ఏ విధంగా ఉపయోగ పడుతున్నాయి, ఎంత వరకు పనికి వస్తున్నాయి, ఎంత బాగా చేస్తున్నాము, ఇంకెంత బాగా చేయగలము – ఇవన్నీ  చూడకుండా, ఏదోలా ఆ పనిని పూర్తిచేయడం సరైన పద్ధతేనా?

    విచారణ :

    ఈ విషయంలో, భగవద్గీత మనకు బోధించేది ఏంటంటే – “కర్తవ్య నిర్వహణ చేయాలి; పైగా కర్మని చేయకుండా వుండలేరు; అంచేత మీ కర్తవ్య  నిర్వహణతోనే , ఈ ప్రపంచానికి కూడా, మీ వంతు సేవ చేయాలి. ” (కర్మయోగం, 3.25). ఈ బోధన ద్వారా, గీత మనకు ఒక బృహత్ లక్ష్యాన్ని చేరుకోవాల్సిన అవసరాన్ని తెలియజేస్తుంది. ఆ లక్ష్యం ఏంటి అంటే – మన పనులు, మన విధి నిర్వహణలను కూడా, మన చుట్టూ ఉన్నవారికి ఉపయోగపడేలా చేయడం, ప్రపంచానికి వీలైనంత సేవ చేయడం. ఇదే మాట మరోలా చెప్పాలంటే, చేసే ప్రతీ పని కూడా కేవలం వ్యక్తిగత లాభం కోసం మాత్రమే కాకూడదు. చేసే ప్రతీ పని వెనక వున్న మన బాధ్యతని ఎప్పటికప్పుడు (వాయిదా వేయకుండా) నిర్వర్తించడమే కాకుండా, అవి పైన చెప్పిన బృహత్ లక్ష్యానికి అనువుగా చేసామా లేదా అనే విషయాన్ని మన గమనించాలి.

    మనలో చాలామందికి ఆలోచన లేకుండా యాంత్రికంగా పనులు చేయడం అనేది ఒక అలవాటుగా మారింది. ఆ అలవాటు, మనల్ని అసలు లక్ష్యం నుండి దూరం చేస్తుంది. ఈ దూరాన్ని నివారించాలంటే, పనిని ఎలా చేస్తున్నామో మనమే నిశ్శబ్దంగా పరిశీలించాలి. పనిని నిలిపివేయకుండానే , అది ఏ దిశలో, ఏ ఉద్దేశంతో సాగుతోంది అనే విషయంపై అవగాహన కలిగి ఉండాలి. ఈ రకమైన ఆలోచన, కర్తవ్యానికి అయితే అడ్డు రాదు సరి కదా, పైగా, కర్తవ్యాన్ని దాని బృహత్ లక్ష్యం వైపు నడిపించడంలో ఒక కీలకమైన భాగం అవుతుంది. సరైన సమయంలో చేసే ఈ ఆలోచన, మనకు రెండు విధాలుగా సహాయపడుతుంది:


    (i) ఆ పని చేయడం వెనకాల వున్న మన ఉద్దేశంలో వున్న పొరపాట్లను సరిచేసే అవకాశం ఇస్తుంది

    (ii) అలాగే, మన విధులను ఎలా నిర్వహించాలో దానికి తగ్గట్టుగా మనల్ని (అంటే, మన మానసిక స్థితిని) మలచుతుంది.


    కాలక్రమేణా, ఈ రకమైన అంతరాలోచన, విధులను యాంత్రికంగా కాక, ఆలోచనాత్మకంగా నిర్వర్తించేటట్లు చేస్తుంది. కొద్దిపాటి ఆలోచనతో మన కర్మాచారణ యొక్క వేగాన్ని తగ్గించడం అనేది, బాధ్యత నుండి పారిపోవడం కాదు; అదే బాధ్యతని జ్ఞానంతో, ఒక సరైన అవగాహనతో, సరైన దృక్పధంతో చేయడమే.

    ఆ ఆలోచనలో మన చర్యలు, మరియు వాటి లక్ష్యాల మధ్య అంతరం (కొంత తేడా) కనిపించినప్పుడు, ఒక క్రమబద్ధమైన విచారణ అనేది అవసరం అవుతుంది. ఆ ప్రయత్నంలో, “ఉద్ధరేదాత్మనాత్మానం” (గీత 6.5) అని చెప్పినట్టు, మనలోని ఆలోచనల్ని మనమే పైకి తీసుకురావాలి. మనలో మనం చేసుకునే ఈ రకమైన అంతర్విచారణని, ఒక బాధ్యతగా తీసుకోవాలి.

    ప్రశ్న:

    ఆదిశంకరాచార్యులు, వివేకచూడామణిలో (శ్లోకం 11) విచారణ చేసుకోవాల్సిన ఇలాంటి అవసరానికే, ఒక ఆధ్యాత్మిక మలుపునిస్తారు: “విచార ఏవ జ్ఞానస్య మార్గః” – విచారణే జ్ఞానానికి మార్గం అంటూ. జ్ఞానం, కర్తవ్యానికి మార్గాన్ని తేజోమయం చేస్తుంది; ఈ జ్ఞానార్జన మార్గంలో, ఈ విచారణా మార్గంలో, మనలో వచ్చే ప్రశ్నలు, ధర్మ సందేహాలే ఆ తేజాన్ని, ఆ వెలుగును నిత్యం ప్రజ్వలింప చేస్తూ ఉంటాయి.

    అలాంటి ప్రశ్నలు మనలో ఉదయించినపుడు ఏం చేయాలో, మనకి గీత చెప్తుంది: – “తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా” (గీత 4.34) – ఈ బోధ ఒక జీవన విధానాన్ని నేర్పుతుంది. దీని అర్థం : “జ్ఞానుల పంచన చేరి వారి సేవ చేయండి; వారిని  వినయంగా ప్రశ్నించండి”. అలాంటి జ్ఞానుల వద్దకు మనం మన సందేహాలతో వెళ్తే, వారు మన సందేహ నివృత్తి చేస్తారు. మనకు మార్గ దర్శనం చేయిస్తారు.

    “కోఽహం?” – “నేను ఎవరు?” – ఇది రమణ మహర్షి గంభీరమైన ప్రశ్న.  మనమే, మనలోపల  ప్రజ్వలింప చేయడానికి రమణ మహర్షి ఇచ్చిన ఒక అంతరంగ జ్వాల; ఒక అత్యంత ప్రాథమికమైన, లోతైన ప్రశ్న.

    అన్వేషణ:

     మన మనస్సులో ఇలాంటి ప్రశ్నలు రావటం, వాటిపై విచారణ చేసే ప్రక్రియ మొదలవ్వటం – ఇదంతా కూడా ఒక అంతర్గత స్పష్టతని సంపాదించడానికి ఒక కీలకమైన మెట్టు. ఆయితే, కేవలం స్వీయ అంతర్విచారణ మాత్రమే మానవ జీవితానికి సరిపోదు. ఎందుకంటే, ప్రపంచంలోని ప్రతి వ్యక్తి, తన అనుభవం, స్వభావం ద్వారా ఒక  ప్రత్యేకమైన దృష్టికోణాన్ని కల్పించుకుంటాడు. ఆ మనిషి ఎప్పుడూ కూడా, ఆ దృష్టికోణంలోనే ముందుకు వెళ్తూ వుంటాడు. అలాంటి ఆలోచన ఒకోసారి సంకుచిత స్వభావానికి దారి తీయవచ్చు.

    కానీ, అదే లక్ష్యం దిశలో వెళ్ళే మరి కొంతమంది అన్వేషకులను , సాధకులను చేరుకుని వారితో కలిసినప్పుడు, ఆ సమూహంలోని వారి  సాంగత్యం వల్ల అందరి వ్యక్తిగత దృష్టికోణాలు మరింత వికసిస్తాయి, విస్తరిస్తాయి. ఒక వ్యక్తిగత ఒంటరి అన్వేషణగా మొదలయిన ఈ ప్రయాణం, ఒక విశాల జ్ఞాన ప్రవాహంతో సాగే ప్రయాణంగా మారుతుంది. అలాంటి సాంగత్యంలో ముందుకు వెళ్తున్నప్పుడు, మనలో ఉదయించే ప్రశ్నలు మరింత ఉన్నత స్థాయిని చేరతాయి; వాటి సమాధానాలు మరింత స్పష్టతను ఇస్తాయి. తద్వారా వచ్చే అవగాహన లోతుగా మారుతుంది. ఇది ఆ సంగంలోని అందరికీ లాభదాయకమే అవుతుంది. సత్సంగం ద్వారా, ప్రశ్నలు పదునవుతాయి, బలహీనమైన సమాధానాలు తొలగిపోతాయి. యోగవాసిష్ఠం లోని వైరాగ్య ప్రకరణం (2.12) కూడా  సత్సంగానికి గొప్ప ప్రాముఖ్యతను తెలియజేస్తుంది.

    సత్సంగంలో వుంటూ, మనకంటూ ఏ ప్రశ్నలు లేకపోయినప్పుడు కూడా, ఇతరుల ప్రశ్నలను సైతం మన ప్రశ్నగా స్వీకరించాలి; తద్వారా, మన మనస్సుకి శ్రద్ధ, వినయము, అలాగే అన్వేషణలలో శిక్షణను కూడా కలిగించినట్టు అవుతుంది. ఇతరుల ప్రశ్నలకు, మనం కూడా  సమాధానాలు సంపాదించడానికి మన సామర్ధ్యనుసారంగా ప్రయత్నించాలి. శంకరాచార్యుల “సత్సంగత్వే నిస్సంగత్వం…” (భజగోవిందం-9) శ్లోకం అలాంటి సత్ సాంగత్యం యొక్క ఫలితాన్ని ప్రామాణికంగా చూపుతుంది.

    ఈ రోజుల్లో ..  అంతా పరుగులు తీస్తున్న ఈ సమయంలో..   కేవలం ఆలోచించడానికి మాత్రమే, ఒక బాధ్యత నుంచి తాత్కాలిక విరామం తీసుకోవడం, ఒక నలుగురిని కలవడం కష్టమే. అంచేత శారీరకంగా, భౌతికంగా ఒక సత్సంగంలో పాల్గొనడం అనేది చాలా సార్లు, అసాధ్యంగా అనిపించవచ్చు. అయితే, డిజిటల్ రూపంలో (ఇంటర్నెట్ ద్వారా, కంప్యూటర్ల, మొబైలు ఫోన్ల ద్వారా) సత్సంగంతో వుండే అవకాశం ఈ రోజు మనకుంది. అది కూడా, మన  జీవితానికి ఒక దిశా నిర్దేశం చేయగలదు.

    సత్సంగం ఎలాంటిదయినా సరే, (ప్రత్యక్షంగా గానీ లేదా ఇంటర్నెట్ మాధ్యమాల ద్వారా గానీ) మన ఆలోచనలలో ఒక ఖచ్చితమైన స్పష్టతను, స్థిరత్వాన్ని ఇస్తుంది.  ఇదే, కాలక్రమేణా, మన స్వభావంగా మారి, మన వ్యక్తిత్వాన్ని ఒక ఉన్నతమైన స్థాయి లోకి తీసుకువెళ్తుంది. మన సరైన మానసిక మరియు ఆధ్యాత్మిక అభివృద్ధికి, డిజిటల్ సాంకేతికత సైతం ఒక అద్భుతమైన పరికరంగా, ఒక కీలకమైన పాత్ర పోషిస్తుంది.

    ఆచరణా విధానం :

    ఈ రోజుల్లో అందరికీ ఎంతో అవసరమైన ఈ ఆలోచనా సరళిని, ఆచరణలో పెట్టడం పెద్ద కష్టం ఏం కాదు : అన్ని బాధ్యతలు, యధావిధిగానే నిర్వహించండి. అయితే, మీరు ఆచరించిన ప్రతి చర్యను, ఒకసారి పరిశీలన చేయండి – మీరు చేసిన విధానం సరైనదా కాదా అని, అలాగే, ఆ చర్య వెనుక వున్న మీ ఉద్దేశ్యం సరైనదా కాదా అన్న విషయం పై విచారణ చేయండి. మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి.  అవసరమైతే, మీ సందేహాలతో, ప్రశ్నలతో ఒక మంచి సత్సంగంలో చేరండి – మీ సందేహ నివృత్తి చేసుకోండి. అక్కడ వున్న ఇతరుల ప్రశ్నలకు కూడా వినండి, వాటికి కూడా సమాధానాలు వెతకండి. ప్రతి ప్రశ్నను, దాని సమాధానాన్ని – ఎక్కడ కనిపించినా, ఎవరు అడిగినా – మీ అవగాహనలోకి తెచ్చుకోండి. మీ దృష్టికోణాన్ని విశాలం చేసుకోండి. వీలైతే ఆ జ్ఞానాన్ని మరో నలుగురితో పంచుకోండి.

    ముగింపు వాక్యం :

    ఈ పాటికి, మీకు స్పష్టం అయ్యేవుంటుంది, కర్తవ్య నిర్వహణలో – విచారణ మరియు ప్రశ్న – ఈ రెండు కూడా సమాన-భాగస్వాములు అవ్వాలి. ఒక కర్తవ్యాన్ని, దాని బృహత్ లక్ష్యానికి అనుగుణంగా నిర్వహించడానికి కావలిసినవి  నాలుగు; (కార్యాచరణ . ఆలోచన. ప్రశ్న. అన్వేషణ.) ఈ నాలుగు కూడా, ఈ చతుర్విధములు కలిసి, ప్రతి కార్యాచరణకి మార్గదర్శకంగా నిలవాలి — అప్పుడు మీరు ఒక కర్మయోగి పధంలో వున్నవారు అవుతారు.  –  ఇదే భగవద్గీత సూచించిన కర్మ యోగ మార్గం.

    (ఈ వ్యాసాన్ని ఆంగ్లంలో చూడాలనుకొనేవారు ఇక్కడ క్లిక్ చేయండి – https://nvsatish.com/2025/09/25/the-fourfold-path-act-think-question-seek/)