Category: భగవద్గీత

  • జ్ఞానాగ్ని – దగ్ధ కర్మ

    (జ్ఞాన కర్మ సన్యాస యోగము – భగవద్గీత 4వ అధ్యాయం)

    ఉపోద్ఘాతం

    గీతలోని రెండవ, మూడవ అధ్యాయాలలో, భగవానుడు ఆత్మ యొక్క స్వభావాన్ని సాంఖ్య యోగం ద్వారా, అలాగే, ఈ ప్రపంచంలో కర్మ ఫలాల పట్ల ఆసక్తి లేకుండా స్థిరంగా, లక్ష్యాన్ని ఏలా సాధించాలో కర్మ యోగం ద్వారా అర్జునుడికి మార్గనిర్దేశం చేస్తాడు. నిష్కామ కర్మ చిత్త-శుద్ధికి తోడ్పడుతుందని, ఈ చిత్త శుద్ధే అటు పిమ్మట చేసే సత్య శోధనకి అవసరమైన సాధనం అవుతుందని గీత ప్రబోధిస్తుంది.

    గీత ముందుకు సాగుతున్న కొద్దీ, అర్జునుడి పరిజ్ఞానం పెరుగుతూ వస్తుంది. ఇలా పెరుగుతున్న అవగాహనకు అనుగుణంగా మరిన్ని బోధనలు వెల్లడవుతూ ఉంటాయి. ప్రతి కొత్త విషయం కూడ అప్పటిగే సుస్థిరమైన అవగాహనపై నిర్మితం అవుతుంది. అలా అవుతున్న బోధలపై స్పష్టత పెరిగే కొద్దీ, అర్జునుడి దృక్పథం మరింత విశాలమై, మరింత సంస్కరింపబడుతూ ఉంటుంది.

    ఇలాటి స్థితిలో ఉన్న అర్జునుడికి, భగవానుడు నాలుగవ అధ్యాయం ద్వారా, సూక్ష్మమైన, సునిశితమైన మరొక సత్యాన్ని వెలువరిస్తాడు. మన లోపల ఉన్న జ్ఞానం, బాహ్యంగా చేసే కర్మలను సరిదిద్ది, సరైన దిశలోకి ఎలా మలుస్తుంది, మళ్ళీ వాటిని పటిష్టంగా ఎలా పునర్నిర్మిస్తుంది అనేదే ఈ అధ్యాయంలో భగవానుడి ఉద్దేశ్యం.

    అనాదిగా జ్ఞాన పరంపర

    ఈ అధ్యాయంలో భగవానుడు ముందుగా, గీతాబోధలు నిత్య సత్యాలు అనే విషయం ఒక ప్రాచీనమైన వంశ పరంపర ద్వారా పరిచేయం చేస్తాడు. ఈ యోగం మొదట సూర్య భగవానుడైన వివస్వానుడికి అప్పగించబడిందని, అదే జ్ఞానం గురు-శిష్య పరంపర ద్వారా మరికొంత మంది రాజర్షులకి అందించబడింది అని, కాలక్రమేణా ఈ జ్ఞానం మానవ మేధస్సు నుండి కనుమరుగైంది అని భగవానుడు వివరిస్తాడు. (4.1-ఇమం వివస్వానే యోగం …: 4.2 ఏవం పరంపరా-ప్రాప్తం…). ఈ జ్ఞానాన్ని అర్జునుడికి చెప్పడం వెనక ఉన్న ఉద్దేశ్యం, కేవలం వాటిని గుర్తు చేసుకోవడం మాత్రమే కాదు; ఒక అర్హత గలిగిన వ్యక్తి ద్వారా ఆ జ్ఞానాన్ని మళ్ళీ సజీవం చేసి, మానవ జాతితో పునః అనుసంధానం చేయడమే భగవానుడి ఉద్దేశ్యం. అప్పటిదాకా చేసిన బోధనల ద్వారా మానసికంగా సిద్ధపడిన అర్జునుడు, కేవలం విషాదంలో ఉన్న ఒక సగటు మానవుడిగా మాత్రమే కాకుండా, ఒక భక్తుడిగా మరియు ఒక స్నేహితుడిగా కూడా ఈ జ్ఞానాన్ని పొందడానికి అర్హత సంపాదించాడు (4.3- స ఏవాయం మయా తే అద్య …).

    అవతారం – ఆచరణా స్వేచ్ఛ

    చాలా కాలం క్రితమే తన బోధనలను అందించిన అటువంటి జగద్గురువు, మానవుడైన అర్జునుడి పక్కన ఉండి, అతనితో జీవితాన్ని గడపడం ఏమిటి ? అర్జునుడికి మళ్ళీ స్వయంగా ఇదంతా బోధించాల్సిన అవసరం భగవంతుడికి ఎందుకు కలిగింది? అసలు అర్జునుడికే ఎందుకు? ఇటువంటి అన్ని ప్రశ్నలకు సమాధానం కావాలంటే, మనం గమనించి అర్ధం చేసుకోవలసిన విషయం ఒకటి ఉంది. ఈ ప్రపంచంలో భగవంతుని ఉనికి, కర్మఫలం వల్ల వచ్చినది కాదు. ఒక అవతార పురుషుడిగా రావడం అనేది, ఆయా యుగపు అవసరాలకు అనుగుణంగా ఆయనలో కలిగిన ఒక దైవిక స్పందన. ధర్మం క్షీణించి, అధర్మం పెరిగినప్పుడల్లా, ధర్మాన్ని  పునరుద్ధరించడానికి భగవానుడు తనను తానే అవతరించుకుంటాడు. (4.7 యదా యదా హి ధర్మస్య …).

    భగవంతుని చర్యలు మానవ అనుకరణ కోసం ఉద్దేశించినవి కావు. అయినాసరే, భగవంతుని ఈ అవతార విషయాన్ని మనకు వర్తింప చేయాలనుకుంటే, కర్మఫలాలు అంటని, ఆశించని వారికి ఉండే సంపూర్ణమైన ఆచరణా స్వేచ్ఛకి, ఈ అవతార ప్రక్రియ ఒక వ్యక్తీకరణగా మనం భావించవచ్చు. ఆయన బోధల ద్వారా కూడా ఇదే విషయాన్నిమనకు, మరో విధంగా సూచిస్తాయి. ఎలా అంటే,  మానసిక ఒత్తిడులకు లోను కాకుండా, వ్యక్తిగత స్వార్థం లేకుండా, ఫలాపేక్ష లేకుండా చేసే కర్మ ఎవర్నీ బంధించదు. పైగా, అలాంటి కర్మ విముక్తిని కలిగించే గుణాన్ని కలిగి ఉంటుంది. దీనికి భిన్నంగా, పంతాలతోనో, పట్టుదలతోనో లేదా మన స్వార్ధ అవసరాల కొరకు చేసిన కర్మ మనని తప్పకుండా బంధిస్తుందనే విషయం  మనం గమనించాలి.

    ప్రవృత్తి – ప్రాప్తి

    ప్రతి వ్యక్తి సహజంగానే, తన స్వభావరీత్యా కొన్ని కోరికలు మరియు అభిరుచులను కలిగి ఉంటాడు. ఆ వ్యక్తి భగవంతుని పట్ల ఎలా మెలుగుతాడనేది ఈ ప్రవృత్తులే నిర్దేశిస్తాయి. మరి ఆ వ్యక్తి తనను ఏ విధంగా సమీపిస్తాడో, భగవంతుడు కూడా అదే రీతిలో స్పందిస్తాడు (4.11 యే యథా మాం ప్రపద్యంతే …). మనలో కొందరు వ్యక్తులు జ్ఞానాన్ని కోరుకుంటారు; కొందరు భద్రతని, కొందరు సౌకర్యాన్ని, మరికొందరు లక్ష్య సాధనని, ఇంకొందరు నిర్దిష్ట విజయాలను – ఇలా, ఎన్నో విషయాలని కోరుకుంటారు. ఆయా కోరికల గూర్చి, ఆయా సంబంధిత దేవతలను ప్రార్ధిస్తారు. వారు దేనిని కోరుకున్నారో అది వారికి లభిస్తుంది. అటువంటి భౌతిక విజయాలు సాధ్యమే – సాధించవచ్చు కూడా. అయితే అలా తీరిన కోరికలు కేవలం తాత్కాలికమే. (4.12 – కాంక్షంతః కర్మణాం సిద్ధిం…). ఒక విధంగా చెప్పాలంటే, ఒక కోరిక వెనక ఉన్న ఆ వ్యక్తి స్వభావానికి, అతనికి లభించిన ఆ ఫలం ప్రతిబింబిస్తుంది అని చెప్పవచ్చు.

    మానవులలో వైవిధ్యం  – గుణ కర్మలు

    గుణ మరియు కర్మల ఆధారంగా తాను మనుషులను నాలుగు రకాలుగా విభజించానని భగవానుడు ప్రకటించాడు (4.13-చాతుర్వర్ణ్యం మయా సృష్టం …). ఒక వ్యక్తి ఆంతరంగిక ప్రవృత్తికి కారణం అతని గుణాలు అయితే, వాటి నుండి ఉత్పన్నమయ్యే బాహ్య ప్రవర్తనలు అతని కర్మలు అవుతాయి. అందుచేతనే, మానవ ప్రవర్తనలో కనిపించే వ్యత్యాసాలు ఆ మనిషిలోని గుణాల యొక్క ప్రభావాన్ని ప్రతిబింబిస్తాయి తప్ప, బాహ్యమైన వర్గీకరణలను కాదు. ఒక మనిషితో పోలిస్తే, మరొక మనిషి భిన్నంగా ఎందుకు ఆలోచిస్తాడు, వైవిధ్యంతో ఎందుకు స్పందిస్తాడు, తనదైన ఒక ప్రత్యేకమైన శైలిలో ఎందుకు ప్రవర్తిస్తాడు ? – ఈ విషయం అర్థం చేసుకోవడానికి, లోపలుండే ఈ గుణాలలో అంతరాలు, తదనుగుణంగా బయటకు వ్యక్తమయ్యే ఆ కర్మలలో అంతరాలు – ఇవే ప్రాతిపదిక తప్ప వేరేది కాదు అనేది ఇక్కడ స్పష్టం అవుతోంది.

    ప్రతి జీవి యొక్క గుణాలలో మరియు కర్మలలో ఇంత వైవిధ్యం ఉన్నప్పుడు, ప్రతి మనిషి ఏకైక పరమ లక్ష్యాన్ని ఎలా చేరుకోగలడు? దీనికి సమాధానం, మన  కర్మ ఆచరణా విధానాలు, మరియు ఆ కర్మ ఫలాలు మనని ఎలా బంధిస్తాయి అనే దానిలో ఉంది. అందువల్లనే, అసలు కర్మబంధం అంటే ఏమిటో అర్థం చేసుకోవడంపై ఇప్పుడు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

    కర్మ – కర్మ బంధం

    కర్మను ‘కర్తృత్వభావం’ (నేనే చేస్తున్నాను అనే భావన) తో చేపట్టినప్పుడు మాత్రమే అది మన పాలిట ఒక బంధంగా మారుతుందని మనం తెలుసుకోవాలి. ఈ కర్తృత్వభావం మనస్సులో ఒక ముద్రను వేస్తుంది, ఈ ముద్రే తరువాతి దశలలో మరిన్ని పర్యవసానాలకు దారి తీస్తుంది. భగవంతుడు స్వయంగా ప్రకటించినట్లుగా, ఆయనకు ఏ కర్మలోనూ కర్తృత్వ భావం లేదు, అందుకే కర్మలు ఆయనను బంధించవు (4.14 – న మాం కర్మాణి లింపంతి …). భగవంతుని ఈ స్వభావాన్ని అర్థం చేసుకున్న అర్జునుడి పూర్వీకులు, కర్మాచరణ చేస్తూనే, కర్మబంధంలో చిక్కుకోకుండా జీవించారని కూడా భగవానుడు ప్రకటించాడు (4.15 – ఏవం జ్ఞాత్వా కృతం కర్మ …).

    బంధం లేని కర్మాచారణ

    దేనిని కర్మ అని పిలవాలి, దేనిని అకర్మ అని పిలవాలి అనే విషయం తెలుసుకోవడం పండితులకు కూడా సులభతరం కాదు (4.16 కిం కర్మ కిమ్ అకర్మ ఇతి …). ఎందుకంటే కర్మ అనేది ఎల్లప్పుడూ బయటికి కనిపించే విధంగా ఉండదు. శరీరం కదులుతున్నప్పుడు మనస్సు నిశ్చలంగా ఉండవచ్చు. శరీరాన్ని కదల్చకుండానే మనస్సు చురుకుగా ఉండవచ్చు. రెండిటిలోనూ, కర్మ చేస్తున్నట్టే లెక్క. కాబట్టి, ఈ సందిగ్ధావస్థ నుండి మనలను బయటకు తీసుకురావడానికి, ఒక జ్ఞాని అటువంటి కర్మలను ఎలా చూడాలో భగవానుడు స్పష్టం చేశాడు (4.18-కర్మణ్య కర్మ యః పశ్యేద్ అకర్మణి చ కర్మ యః…).

    ఆ జ్ఞాని యొక్క దృక్పథాన్ని పొందడానికి మనం కొద్దిగా ఆలోచించాలి. ముందుగా, మనం ఈ శ్లోకంలో ఉపయోగించిన ‘కర్మలో అకర్మ’ , ‘అకర్మలో కర్మ’ అనే ప్రయోగాలని అర్ధం చేసుకునే ప్రయత్నం చేద్దాం – మానవులలో కర్మ రెండు స్థాయిలలో పనిచేస్తుంది : మనస్సులో మరియు బాహ్యంగా (శారీరకంగా).

    ఇప్పుడు మానసిక స్థాయిలో, కర్మ అంటే “నేనే చేస్తున్నాను” అనే కర్తృత్వ భావంతో కూడిన మానసిక చర్య. ఇదే బాహ్య స్థాయిలో అయితే, కర్మ అంటే కేవలం శారీరక చర్య.

    ఇక అకర్మ విషయంలోకి వస్తే, మానసిక స్థాయిలో అకర్మ అంటే ఆలోచనలు సాగుతున్నప్పటికీ కర్తృత్వ భావం లేకపోవడం. ఇదే బాహ్య స్థాయిలో అయితే, అకర్మ అంటే శారీరక నిశ్చలత.

    దీనిని దృష్టిలో ఉంచుకుంటే, ఇప్పుడు మనకు కొంత స్పష్టమవుతుంది: ఒక వ్యక్తి బాహ్యంగా పని చేస్తూ, మానసికంగా కర్తృత్వ భావం నుండి విముక్తుడై ఉన్నప్పుడు, అది ‘కర్మలో అకర్మ’. ఇక, బాహ్యంగా శారీరిక నిశ్చలతతో ఉన్నప్పుడు మనస్సులో కర్మ చేస్తుంటే, – అంటే, కోరికల సంబంధిత ఆలోచన చేయడం, లేదా ప్రతిఘటించడం చేస్తుంటే –  అది ‘అకర్మలో కర్మ’.

    ఇప్పుడు ఈ రెండిటిలో, అంటే ‘కర్మలో ఆకర్మ’, ‘ఆకర్మలో కర్మ’, వీటిలో మనం ఏది చేయాలో మీకు అర్ధం అయ్యే ఉంటుంది. మొత్తం మీద, ఈ శ్లోకం ఒక సునిశితమైన సత్యాన్ని సూచిస్తుంది: మనస్సు కర్తృత్వభావ రహితంగా ఉండడమే మనకి ముఖ్యమైనది, కావలసినది; బాహ్యమైన కదలిక కాదు.

    కర్మలు బంధించని వ్యక్తి

    కర్తృత్వభావాన్ని పూర్తిగా కరిగించేసిన వ్యక్తి, కోరికల చేత ఆకర్షింపబడక, ఎటువంటి భయాందోళనలకూ లోనవకుండా కర్మను ఆచరిస్తాడు (4.19 యస్య సర్వే సమారంభాః…). కర్తృత్వభావం లేనందున, కర్మఫలాలు జ్ఞానాగ్నిలో దగ్ధం అయ్యి, అటువంటి వ్యక్తికి అంటుకోవు, కాబట్టి కర్మబంధం ఉండదు. అటువంటి వ్యక్తి ప్రశాంత తృప్తితో వ్యవహరిస్తాడు. అప్పటికే తన వద్ద వున్న వాటితో సంతృప్తి చెందుతూ, మానసిక స్థిరత్వంతో, ఫలాపేక్ష లేకుండా ఉంటాడు (4.20- త్యక్త్వా కర్మ-ఫలాసంగం…). ప్రతిఫలాన్ని ఆశించకపోయినా అవసరమైన ప్రయత్నం మటుకూ విరమించుకోకుండా, ఆ వ్యక్తి, ఏ కలత లేకుండా  ప్రపంచంలో వ్యవహరిస్తాడు. హెచ్చు తగ్గులు లేకుండా మానసిక సమతుల్యతను కోల్పోకుండా నిత్యకృత్యాలు చేయడం అనేది ఒక సహజ సరళిత జీవితం గా గీత చిత్రీకరిస్తుంది. (4.21-నిరాశీర్ యత-చిత్తాత్మా…).

    ఈ అకర్తృత్వభావంతో చేసే పనులు, ఏ రకమైన అభిప్రాయ ముద్రలని (వాసనలని) మన మనస్సులో నింపవు. కర్మాచరణ ఒక ప్రశాంతచిత్తంతో చేసినప్పుడు, వాటి ఫలాలు మనపై ఎటువంటి బంధాలను కల్పించవు. ఆ విధంగా జ్ఞానులు సాధారణ జీవితపు సవాళ్ళ ఎదుర్కుంటున్నప్పటికీ, మనోబంధకాలలో చిక్కుకోకూడా ఉంటారు (4.22-యదృచ్ఛా-లాభ-సంతుష్టో). కోరికలు లేకుండా, మమకారం లేకుండా, నిరహంకార బాధ్యతతో చేసే కర్మలు పూర్తిగా కరిగిపోయి (4.23 గత-సంగస్య ముక్తస్య …) మనకు ఏ బంధాల్ని మిగల్చవు. ఒక్క మాటలో చెప్పాలంటే, ఇదే కర్మలో ఆకర్మ అంటే !

    యజ్ఞ స్ఫూర్తి

    కర్తృత్వభావం నశించడమే కర్మబంధ విముక్తికి అవసరమైతే, చేయవలసిన ఆ కర్మలకు స్ఫూర్తి ఏమిటి అనేది ఒక ప్రశ్న.  కర్మ చేయకుండా ఒక్క క్షణమైనా ఎవ్వరూ ఉండలేరు అని భాగవానుడి మాటే కాబట్టి, కర్మలు ఆచరించాల్సిందే. అయితే ఆ పనులను, అకర్తృత్వభావంతోనే, భగవంతునికి అర్పించే స్ఫూర్తితో చేయాలి. తదనుసారంగా, చేసే ప్రతీ మానసిక, బాహ్య కర్మలన్నీటినీ – ఉదాహరణకి, మనో నిగ్రహం, భక్తి, ధ్యానం, అధ్యయనం, దానం, కృషి, సేవ మొదలైనవి –  ‘యజ్ఞం’గా తలవాలి. ఇలా యజ్ఞ స్ఫూర్తితో చేసే ప్రతీ అర్పణ మనలో భగవత్ తత్త్వాన్ని నింపి, మన అంత:శుద్ధికి విశేషంగా తోడ్పడుతుంది (4.24-బ్రహ్మర్పణం బ్రహ్మ హవిర్ …).

    కొందరు భౌతిక సంపదను అర్పిస్తారు; మరికొందరు తమ తపోశక్తిని  అర్పిస్తారు (4.25 దైవమేవాపరే యజ్ఞం …). కొందరు ఇంద్రియాలను నిగ్రహిస్తారు; మరికొందరు ఊపిరిని నిగ్రహిస్తారు (4.27 సర్వాణీంద్రియ-కర్మాణి …; 4.29 అపానే జుహ్వతి ప్రాణం …). కొందరు తమ జ్ఞానాన్ని, తమ అధ్యయనాన్ని లేదా తమ మనో నిశ్చలతను అంకితం చేస్తారు. ఇన్ని ఉదాహరణలు ఎందుకంటే, ముఖ్యమైనది బాహ్య రూపం కాదు. ముఖ్యమైనది అటువంటి కర్మను, అటువంటి అర్పణను రూపొందించే మనో భావన. ఈ వైవిధ్యమైన ఉదాహరణల లోని  అర్పణలు, ప్రజలు వివిధ మార్గాల నుండి మానసిక పురోగతిని ఎలా సాధిస్తారో వివరిస్తాయి. ప్రతి మార్గం కూడా, తనదైన రీతిలో ఈ పురోగతికి దోహదపడుతుంది.

    జ్ఞాన యజ్ఞం

    ఇంతకు మునుపు పేర్కొన్న ఎన్నో రకాల అర్పణలు ఉన్నప్పటికీ, అవన్నీ ఒక పరమార్థమైన జ్ఞానం వైపు నడిపించినప్పుడే వాటికి అర్థం ఉంటుందని గీత వివరిస్తుంది (4.30- అపరే నియతాహారాః …). అవసరమైన జ్ఞానం లేకపోతే, బాహ్య కర్మలు ఒక వ్యక్తిని తాత్కాలికంగా సుఖపెట్టవచ్చు లేదా బలోపేతం చేయవచ్చు, కానీ అవి మన లోపల పాతుకుపోయి ఉన్న అజ్ఞానాల, అపార్థాల చిక్కుముడులను విప్పలేవు. అంచేతనే ఈ విషయంలో గీత ఒకే సూత్రాన్ని అందిస్తుంది : జ్ఞానంతో చేసే అర్పణ అన్నింటికంటే గొప్పది (4.33 – శ్రేయాన్ ద్రవ్య-మయాద్ యజ్ఞాత్ జ్ఞాన-యజ్ఞః …). దీనికి మరొక రకంగా అంటే – ఆ పారమార్ధిక జ్ఞానాన్నే ప్రతిఫలాపేక్ష లేకుండా మరొకరితో పంచకోవడం – అని కూడా అనుకోవచ్చు.  భౌతిక అర్పణలు బాహ్య జీవితాన్ని శుద్ధి చేస్తాయి; జ్ఞానయజ్ఞం ఆ యజ్ఞం చేసే వ్యక్తినే శుద్ధి చేస్తుంది. జ్ఞానం మనస్సును ప్రకాశింపజేసినప్పుడు, కర్మ మానసిక బాలహీనతల నుండి బయట పడి, యజ్ఞస్ఫూర్తి స్వభావంగా  మారుతుంది. తద్వారా, జీవితమే ఒక సుస్పష్టమైన వేదికగా మారుతుంది.

    జ్ఞానార్జన

    ఇప్పుడు జ్ఞానమే ప్రధాన అంశం కావడంతో, అట్టి జ్ఞానాన్ని ఏ విధంగా పొందవచ్చో కూడా గీత ఈ అధ్యాయంలో వివరిస్తుంది. ఈ జ్ఞాన దృష్టిని కేవలం చదవడం లేదా తర్కించడం ద్వారా మాత్రమే పొందలేము; అనుభవైక జ్ఞానం కలిగిన వారినుంచే ఆ జ్ఞానాన్ని స్వీకరించాలి. అలాంటి జ్ఞానం కలిగి ఉన్న గురువు ఎవరో తెలుసుకుని, అట్టి వారి సామీప్యాన్ని వినయంతో పొందాలని భగవానుడు వక్కాణిస్తాడు. అలా గురువుల దగ్గరకు వెళ్ళినపుడు సత్య విచారణ చేయాలనే తీవ్రమైన కోరిక, నేర్చుకోవాలనే తపన ఉండాలి (4.34 తద్ విద్ధి ప్రణిపాతేన …). ఇవి ఒక వ్యక్తిలో ఉన్నప్పుడే, గురువుద్వారా వారికి ఒక మార్గదర్శనం లభిస్తుంది. ఆ మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడే, వారిలో ఒక పరివర్తనాత్మక మార్పు వస్తుంది. స్వాధ్యాయనంతో అర్ధం చేసుకోలేని కష్టతరమైన అంశాలను గురువులు స్పష్టం చేస్తారు: కర్మ మరియు అకర్మల మధ్య వ్యత్యాసం, ఆత్మ యొక్క స్వభావం మరియు కర్తృత్వభావం యొక్క అల్లిక, ఇలాంటివన్ని  కూడా గురుకృప, గురుకటాక్షంతోనే తేటతెల్లమవుతాయి అనే విషయం ఈ శ్లోకంలో భగవానుడు స్పష్టం గా వివరిస్తాడు.

    జ్ఞాన శక్తి

    జ్ఞానం మోహమూలాల్నితొలగిస్తుందని గీత వివరిస్తుంది. వెలుగు ఒక్క క్షణంలో చీకటిని ఎలా పారద్రోలుతుందో, జ్ఞానం ఒక మనిషిలోని అజ్ఞానాన్ని అలా పారద్రోలి తనలోనూ, ఆ పరమాత్మలోనూ కూడా  సమస్త ప్రాణికోటిని దర్శింపచేస్తుంది. (4.35-యజ్ జ్ఞాత్వా న పునర్ మోహం…). ఒక ప్రజ్వరిల్లే అగ్ని సమిధలను ఎలా బూడిద చేస్తుందో, జ్ఞానం కూడా అలానే ఎప్పటినుంచో మన వెంట వస్తున్న సంచితకర్మశేషాలను దహించివేస్తుంది (4.37- యథైధాంసి సమిద్ధో ‘గ్నిః…). తద్వారా మన గత కర్మల బంధం నుంచి మనకి విముక్తి  లభిస్తుంది. సంపూర్ణంగా కాకపోయినా, ఈ జ్ఞానార్జన దిశలో కొద్దిపాటి పురోగతి సాధించినా, అట్టి జ్ఞానం వల్ల సాధకుడికి దుష్కార్మఫలాల ప్రభావం నుండి విముక్తి చేస్తుంది (4.36- అపి చేద్ అసి పాపేభ్యః…).

    జ్ఞాన అర్హతలు

    శ్రద్ధ, ఇంద్రియనిగ్రహం మరియు కార్యదక్షత – ఇవన్నీ కూడినప్పుడు మాత్రమే స్థిరమైన జ్ఞానం లభిస్తుందని గీత ధృవీకరిస్తుంది (4.39- శ్రద్ధావాన్ లభతే జ్ఞానం …). ఇక్కడ శ్రద్ధ అంటే మూఢ నమ్మకం కాదు, ఒక అవగాహన కలిగించుకోవడానికి మనసుకి  అవసరమైన సహకారం. ఇంద్రియనిగ్రహం అలాంటి మనస్థితికి స్థిరత్వం చేకూరిస్తుంది. కార్యదక్షత దానిని ముందుకు తీసుకెళ్తుంది. అలాంటప్పుడే జ్ఞానం, ఆ వ్యక్తికి పరమ శాంతిని తప్పక తక్షణమే కలగచేస్తుంది అనేది భగవానుడి వాక్కు.  దీనికి విరుద్ధంగా, సందేహించేవాడు, నమ్మకం లేనివాడు భ్రష్టుడే అవుతాడు. (4.40-అజ్ఞశ్చాశ్రద్ధధానశ్చ…). అటువంటి వ్యక్తి, ఇక్కడి లోకాల్లో సుఖాలనూ, అటు పై లోకాల్లో సుఖాలనూ, రెండింటినీ కోల్పోతాడు.

    జ్ఞానం – ముక్తి సాధనం

    జ్ఞానం వల్ల మొహాలు, సందేహాలు, సంశయాలు  తొలగిపోయినప్పుడు, మనస్సు నిశ్చలంగా నిర్భయంగా నిలుస్తుంది. మనిషి మానసికంగా స్థిరపడతాడు. అతడిని ఏ ఆకర్షణ-వికర్షణలు కలవరపరచవు.  ఆ స్థితిలో, కర్మలో ఆకర్మ సిద్ధాంతంగా కర్మాచారణ చేస్తూ, యజ్ఞస్ఫూర్తితో కర్మఫలాలను భగవదర్పణం చేసే వారికి కర్మబంధాలు అంటవు. (4.41 యోగ-సన్న్యస్త-కర్మాణం…). ఈ అధ్యాయం అటువంటి జ్ఞానగత మానసిక స్థిరత్వం వైపు పిలుపుతో ముగుస్తుంది. అజ్ఞానం వల్ల కలిగే సందేహాన్ని జ్ఞానంతో ఖండించి తక్షణ కర్తవ్యాన్ని చేపట్టమని అర్జునుడికి ఉద్బోధించబడింది (4.42 – తస్మాద్ అజ్ఞాన-సంభూతం …). ఈ విధంగా, జ్ఞానం అనేది తక్షణ కర్తవ్య నిర్వహణకే కాకుండా ముక్తికి కూడా సాధనం అవుతుంది అనే భాగవానుడి సందేశం అర్జునుడి ద్వారా మనకు లభ్యం అయింది.

    ముగింపు

    ఈ అధ్యాయం యొక్క బోధన ఒకే క్రమంలో సాగుతుంది: జ్ఞానం కర్మను మారుస్తుంది. ఆ జ్ఞానంతో కర్తృత్వభావం తొలగిపోయినప్పుడు, మనస్సు స్థిరపడి మనం చేస్తున్న కర్మ, మనని కర్మ బంధం లోకి పడనీయదు. జ్ఞానం గత కర్మల అవశేషాలను సైతం దహించివేస్తుంది. సందేహాల నుంచి, సంశయాల నుంచి, చివరకు కర్మబంధం నుంచి కూడా ఈ జ్ఞానమే మనల్ని విముక్తుడ్ని చేస్తుంది.  

    అయితే సాధకులకు, ఈ అధ్యాయం యొక్క సందేశం అర్ధం చేసుకున్నాక, కొంతమందిలో ఒక ప్రశ్న జనించవచ్చు:  లోపల మానసికమైన ముక్తి, అలాగే బాహ్యంగా కర్మబంధం నుంచి రక్షణ – ఈ రెండిటికీ కూడా కారణం జ్ఞానమే అయితే, మరి సన్యాసం యొక్క అవసరం ఏమిటి? ఈ ప్రశ్నకి, అలాగే ఇలాంటి మరి కొన్ని ప్రశ్నలకి సమాధానం కావాలంటే, గీతాబోధలలో సత్యాన్వేషణకై మనం మరికొంత ముందుకు ప్రయాణించాల్సి ఉంది.

  • కర్మయోగం – ఆచరణలో సరైన దృక్పథం

    భగవద్గీత

    మహాభారతంలో భగవద్గీత ఒక నిశ్శబ్ద జ్వాల వంటిది. యుద్ధభూమి నడిమధ్యలో సంభవించిన ఒక నిశ్చలమైన సందర్భం అది. బాహ్య సంఘర్షణను అంతర్విచారణగా, ఆ అంతర్విచారణను అనుభవైక-జ్ఞానంగా (ఆత్మజ్ఞానంగా), అటుపై ఆ జ్ఞానాన్ని పరిపూర్ణమైన మోక్షం దిశగా మార్చే సంవాదం ఇది. మొత్తం పద్దెనిమిది అధ్యాయాలలో, విషాదం నుండి స్పష్టత వైపుకు, భయం నుండి స్వేచ్ఛ వైపుకు, గీత మనకి ఒక మార్గాన్ని నిర్దేశిస్తుంది.

    మనం గమనిస్తే, భగవద్గీత ఒక ప్రశాంతమైన వాతావరణంలో కాకుండా, జీవితంలోని అత్యంత కఠినమైన పరిస్తితిలో వెలువడినవది. అందువల్లనే గీత కేవలం అర్జునుడికే కాక, మన దైనందిన జీవితానికి కూడా ఒక అద్భుతమైన ఔషధం లాంటిది.

    మొదటి అధ్యాయం: విషాదం నుండి విముక్తి దిశగా

    గీతలోని మొదటి అధ్యాయం ‘అర్జున విషాద యోగం’. ఇక్కడ అర్జునుడు మన లాంటి ఒక సామాన్య మానవునికి ప్రతీక. బాహ్య పరిస్థితులు అతని అంతరంగాన్ని తీవ్రంగా కలవరపెట్టి, అతని విచక్షణను దెబ్బతీసి, శోకంతో ముంచెత్తుతాయి. ఈ పతనానికి చిహ్నంగా, అర్జునుడు తనకు విజయం అక్కర్లేదని ప్రకటిస్తాడు (న కాంక్షే విజయం కృష్ణ – 1.32). దుఃఖంతో కృంగిపోయి, అతడు తన ధనస్సును జారవిడుస్తాడు (ఏవ ముక్త్వాజునః సంఖ్యే – 1.47). మనల్ని మనం అర్జునుడి స్థానంలో ఊహించుకుంటే, గీతాచార్యుడు అర్జునుడితో మాత్రమే కాకుండా, మనతోనే ప్రత్యక్షంగా మాట్లాడినట్టు అనిపిస్తుంది. జీవితంలో కొన్ని సందర్భాలలో మనకు కూడా, మనసు కలత చెంది, అశాంతితో, భవిష్యత్తు కూడా ఆగమ్యగోచరం అవుతుంది. మన ఈ  మానసిక స్థితి, మొదటి అధ్యాయంలోని అర్జునుడి యొక్క స్థితి – రెండూ ఒకటే. అందుకే గీత మనకి కూడా చాలా అవసరం.

    రెండవ అధ్యాయం: సాంఖ్య యోగం — ద్వివిధ మార్గం

    ఈ అధ్యాయంలో బోధలు అర్జునుడిని, అతని ద్వారా మనల్ని, అంతరంగికంగా మరియు బాహ్యంగా సంస్కరించడం ప్రారంభిస్తాయి. దీనిని సాధారణంగా ద్వివిధ మార్గంగా (రెండు రకాలైన మార్గాలుగా) మనం అర్థం చేసుకోవచ్చు. మొదటి మార్గం అంతరంగానికి, అంటే ‘ఆత్మ’కు సంబంధించినది. ‘ఆత్మ’ యొక్క నిజస్వరూపం నిత్యమైనది. ఆత్మ ఎప్పుడు పుట్టదు, మరణించదు. (న జాయతే మ్రియతే వా – 2.20). ఆత్మ పంచ భూతాలకీ అతీతమైనది. (నైనం ఛిందంతి శస్త్రాణి – 2.23). ఇక్కడ మనకు కనిపించే ఆత్మ జ్ఞానం మనకు లోతైనదిగా అనిపించినా, దాని ముఖ్యార్థం స్పష్టంగానే ఉంటుంది : మార్పు చెందే వాటిని మాత్రమే చూసి మన మనసు కలవరపడుతుంది; మారని మన స్వరూపాన్ని (ఆత్మ) గురించి కూడా మనం తెలుసుకున్నప్పుడు, మనలో ఒక మానసిక స్థైర్యం ఏర్పడుతుంది. ఇక రెండవ మార్గం, బాహ్య కర్మలను, అంటే జీవుని కర్మలను, కర్తవ్యాలను నిర్దేశిస్తుంది (కర్మణ్యేవాధికారస్తే – 2.47).

    కోరికలను పరిత్యజించినప్పుడు కలిగే స్థిరమైన జ్ఞానస్థితిని స్థితప్రజ్ఞత’ అంటారు. ఈ స్థితప్రజ్ఞత (స్థిరమైన జ్ఞానం) అనే గమ్యం వద్ద మునుపు చెప్పిన రెండు మార్గాలు కలుస్తాయి (ప్రజహాతి యదా కామాన్ – 2.55). మరోలా చెప్పాలంటే, ఒక మనిషి లోపలి స్థిరత్వం, ఆతని బయట బాధ్యత – ఈ రెండూ కూడా ఒక దానితో మరొకటి పెన వేసుకుని ఉంటాయి. అంచేత రెండూ అవసరమే.

    ( రెండవ అధ్యాయంపై ప్రత్యేక అవలోకనం కోసం: ఇక్కడ క్లిక్ చేయండి: https://nvsatish.com/2025/10/17/bg-sankhya-yoga-02/ )

    మూడవ అధ్యాయం: కర్మయోగ ఆరంభం — కర్మ చేయవలసిన ఆవశ్యకత

    మూడవ అధ్యాయంలో గీత కర్మయోగం ద్వారా మనకు ఏమి చెప్తుంది అనేది చూద్దాం. జ్ఞాన మార్గం మరియు కర్మ మార్గం రెండూ శ్రేయస్కరమైనవే అనేది ఈ అధ్యాయంలో మరోసారి స్ఫష్టం అవుతుంది. ఆయితే, లౌకిక వ్యవహారాలలో ఉన్నవారికి, కర్మ చేయడమే సరైన మార్గం అని గీత మనకి చెప్తుంది. ఎక్కడా కూడా మనల్ని కర్మలను వదిలివేయమని చెప్పదు. ఒక్క మాటలో చెప్పాలంటే, కర్మ నుండి తప్పించుకోవాలనే ఆలోచనను గీత సంపూర్ణంగా ఖండిస్తుంది. ఎందుకంటే ఒక్క క్షణం కూడా ఎవరూ కర్మ చేయకుండా ఉండలేరు. ఆ ఉద్దేశ్యంతోనే, కర్మలను సన్యసించడం (వదిలేయటం) కంటే వాటిని ఆచరించడమే మేలని బోధిస్తుంది (నియతం కురు కర్మ త్వం – 3.8). మరో మాటలో చెప్పాలంటే, సరైన దృక్పథంతో కర్మలు చేయమనే ఒక నిర్దేశం మనకు ఇక్కడ కనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ ప్రకృతి గుణాల ప్రభావంతో కర్మ చేయక తప్పదు (న హి కశ్చిత్ క్షణమపి – 3.5). జ్ఞానులైన వారు కూడా కర్మలను ఆచరిస్తూ ప్రపంచానికి మార్గదర్శకంగా ఉంటారు (యద్యదాచరతి శ్రేష్ఠః – 3.23). గమనిస్తే, ఈ అధ్యాయంలో గీత మన జీవితాన్ని ఎలా గడపాలో, జ్ఞాన-కర్మలను ఎలా సమన్వయం చేసుకోవాలో, అలాంటి కర్మాచరణకి సరైన దృక్పథం ఏదో మనకు చాలా స్పష్టంగా చెప్తుంది.

    కర్మలో సరైన దృక్పథం: యజ్ఞభావన

    స్వార్థం లేకుండా, యజ్ఞభావంతో (నిస్వార్థ సేవాభావంతో) చేసే కర్మ మనిషిని కర్మబంధం నుండి విముక్తుడిని చేస్తుంది (3.9). అటువంటి నిష్కామ కర్మ (ఫలితంపై ఆసక్తి లేని కర్మ) చిత్తశుద్ధిని కలిగించి, జ్ఞానానికి అర్హతను ఇస్తుందని ప్రతీతి. ఈ తత్వాన్ని యజ్ఞం ద్వారా, అంటే ‘జీవరాశిని పోషించే పరస్పర సహకార విధానం’ ద్వారా వివరించడం జరిగింది. ఇంకొంచెం వివరంగా చెప్పాలంటే, వర్షం ఆహారాన్ని ఇస్తుంది; ఆహారం ప్రాణులను పోషిస్తుంది; ప్రాణులు సరైన విధానంలో కర్మ చేయడం ద్వారా (యజ్ఞం ద్వారా) వర్షం వస్తుంది – ఇలా ఈ చక్రం కొనసాగుతుంది. (సహయజ్ఞాః ప్రజాః సృష్ట్వా – 3.10–3.15). ప్రకృతి లోని ఈ పరస్పర-సామరస్య-అవసరాన్ని మనుష్యులు విస్మరించినప్పుడు లేదా భంగపరిచినప్పుడు, సృష్టి చక్రం అసంపూర్ణంగా, అస్తవ్యస్తంగా మారుతుంది. ఆధునిక జీవనంలో పర్యావరణ పరిరక్షణ లేదా నిజాయితీతో కూడిన వృత్తి ధర్మం వంటి పనులు దీనిని గౌరవించినప్పుడు, వ్యక్తులు స్వేచ్ఛను పొందుతారు. అంతే కాక, వారిలో ఒక వైశ్వానిక బాధ్యతా భావం (విశ్వం పట్ల బాధ్యత) నెలకొంటుంది. విశ్వ సామరస్యం నిలబడుతుంది.

    గుణాలు మరియు అకర్తృత్వం

    వ్యక్తి చేసే కర్మలన్నీ ప్రకృతి యొక్క త్రిగుణాల (సత్త్వ, రజో, తమో గుణాల) మధ్య జరుగుతాయని గీత చెప్తుంది (ప్రకృతేః క్రియమాణాని – 3.27). కర్మ అనేది గుణాల పరస్పర చర్య మాత్రమే; జీవుడు అసలు కర్త కాదు. ఈ విషయాన్ని ఎరిగినవారిలో అహంకారం తగ్గుతుంది. భయం మాయమవుతుంది. కర్మాచరణ జరగుతూనే ఉంటుంది కానీ “నేను చేస్తున్నాను” అనే భారముండదు.

    మనం సరిగ్గా గమనిస్తే, మనలో కలిగే అనేక స్పందనలు వ్యక్తిగత దోషాలు కావు; కేవలం ప్రకృతి గుణాల యొక్క ప్రభావం. ఉదాహరణకు, నిస్సహాయ స్థితి  లేదా అధిక ఆత్రుత వంటి మనోభావాలను రజో-తమో గుణాల ప్రభావంగా భావించవచ్చు. ఈ అవగాహనతో మనలోని ప్రకృతిని అర్థం చేసుకుని, తద్వారా మన జీవితంలో మనం చేపట్టవలసిన సరైన సాధనా విధానంపై ఒక మంచి స్పష్టతని తెచ్చుకోవచ్చు.

    శరణాగతి మరియు స్వధర్మం

    సరైన కర్మకు మరో సంకేతం, సకల కర్మలను ఈశ్వరునికి అర్పించడం (శరణాగతి). అప్పుడు భయం మరియు ఫలితాపేక్ష నశిస్తాయి (మయి సర్వాణి కర్మాణి – 3.30). ప్రతి వ్యక్తీ తన స్వభావానికి అనుగుణంగానే ప్రవర్తిస్తాడు (సదృశం చేష్టతే స్వస్యాః – 3.33). అందుకే గీత మన స్వధర్మాన్ని (మనదైన విధిని) ఆచరించమని బోధిస్తుంది. స్వధర్మానికి అనుగుణంగా చేసే కర్మ మాత్రమే క్షేమకరమైనది (శ్రేయాన్ స్వధర్మో విగుణః – 3.35). పరధర్మాన్ని ఆచరించడం ప్రమాదకరమైనది. ఈ విషయంలో మనం గమనించ వలసిన విషయం — ఒక మనిషి తన స్వభావానికి అనుగుణంగా పని చేసినప్పుడు ఆ మనిషిలో మానసిక స్థిరత్వం ఉంటుంది; మరి ఇతరుల మార్గాన్ని/ధర్మాన్ని అనుకరించడం చేస్తే, ఆ కర్మ వారిని అస్థిరం చేస్తుంది. అయితే, స్వధర్మ నిర్వహణ ఎలాంటివారు చేయగలరు ? ధర్మ విచక్షణా జ్ఞానం కలిగిన వారికి, మనసు మీద, మనసు లోని కోరికల మీద నియంత్రణ ఉన్నవారికి మాత్రమే ఇది సాధ్యం అవుతుంది.

    కోరిక మరియు దాని ఆవరణలు

    కోరిక, లేదా కామం, విచక్షణను కప్పివేసి, అంతర్గత జ్ఞాన ప్రకాశాన్ని మరుగున పడేస్తుంది (కామ ఏష క్రోధ ఏషః – 3.36–3.37). దీనికి భగవానుడు ఇచ్చిన ఉదాహరణ : నిప్పును పొగ, అద్దాన్ని దుమ్ము, లేదా పిండాన్ని తల్లి గర్భం కప్పివేసినట్లుగా (ధూమేనావ్రియతే వహ్నిర్ – 3.38), కోరిక జ్ఞానాన్ని (స్పష్టతను) కప్పుతూ దాని చుట్టూ ఆవరించి ఉంటుంది. ఇంద్రియాలు, మనస్సు మరియు బుద్ధి – వీటన్నిటికంటే కంటే ఆత్మ ఉన్నతమైనదని తెలుసుకోవడమే కోరికను జయించే మార్గం. బుద్ధి ద్వారా ఆత్మను తెలుసుకుని, ఆ బుద్ధిలోని విచక్షణతో కోరికల నుండి మనస్సును నిగ్రహించుకోవాలి (ఏవం బుద్ధేః పరం బుద్ధ్వా – 3.43).

    ముగింపు మాట

    కర్మయోగం సందర్భంలో సన్యాసం అంటే కర్మ నుండి తప్పించుకోమని కాదని మనం అర్థం చేసుకోవాలి. ప్రతి పనిలో ఏకాగ్రత మరియు నైపుణ్యంతో వ్యవహరిస్తూనే, ఫలితంపై ఆసక్తిని (సంగత్వాన్ని) వదిలివేయడమే నిజమైన సన్యాసం. ఈ అధ్యాయం ‘కర్మ చేయవలసిన ఆవశ్యకత’తో మొదలై, ‘పని చేస్తూనే పొందే స్వేచ్ఛ’కి ఒక మార్గనిర్దేశంతో ముగుస్తుంది. ఈ దృక్పథమే, తరువాత మోక్షానికి దోహదకారి అవుతుంది. చివరిగా, ఈ అధ్యాయం నుంచి మనం గుర్తుంచుకోవలసిన అంశాలు: (i) కర్మను వదిలివేయడం కాదు; కర్మలోని ఫలాపేక్షను మాత్రమే వదిలివేయడం స్వేచ్ఛకు మార్గం. (ii) సమతుల్యమైన దృక్పథంతో చేసిన పని మనసుకి శాంతిని ఇస్తుంది. (iii) ప్రకృతి మనకిచ్చే సహకారానికి, మనం కూడా ప్రకృతి పట్ల సహకార భావంతో ప్రవర్తించినప్పుడే సృష్టి క్రమం సజావుగా సాగుతుంది. (iv) సరైన దృక్పథంతో ఆచరించే కర్మలోని నిబద్ధత, మన తరువాతి జీవితంలో జ్ఞానానికి, అటు పిమ్మట విముక్తికి, దారితీస్తుంది.

    ( To read this article in English, click here:   https://nvsatish.com/2025/11/14/bg-karma-yoga-03/ )

  • భగవద్గీత బోధకు అంకురం : సాంఖ్యయోగం (రెండవ అధ్యాయం)

    భగవద్గీత,  అర్జునుడు మరియు భగవాన్ శ్రీకృష్ణుని మధ్య జరిగిన అద్భుత సంవాదం. ఇది అందరికి తెలిసిన విషయమే. ఈ భగవద్గీత, మన జీవితాన్ని, మన జీవనవిధానాన్ని, అలాగే మనలోని మానసిక సంక్షోభాలని ఉద్దేశించి ఒక గంభీరమైన, అద్భుతమైన సందేశాన్ని ఇస్తుంది.  గీతలో మొత్తం పద్ధెనిమిది అధ్యాయాలు ఉన్నప్పటికీ, రెండవ అధ్యాయం ఒక ప్రత్యేకం స్థానంలో నిలుస్తుంది. ఈ అధ్యాయం, అష్టాదశ అధ్యాయాల గీతా బోధలన్నిటికీ ఒక అంకురంగా, ఒక విత్తనంగా నిలుస్తుంది. ఈ అధ్యాయమే సాంఖ్యయోగం; సంపూర్ణగీత ప్రబోధించే ప్రతి పరిష్కార మార్గానికి – అంటే జ్ఞాన మార్గం, కర్మ మార్గం, భక్తి మార్గం – ఈ మూడిటికి కూడా, ఒక బలమైన పునాది మనకు ఈ అధ్యాయంలోనే పరిచయమవుతుంది.

    గీతలో భగవానుడైనటువంటి శ్రీకృష్ణుని బోధ ప్రారంభమయ్యే ముందు, అర్జునుని మానసిక దుఃస్థితి మొదటి అధ్యాయం ద్వారా, మన ముందుకొస్తుంది. అర్జునుడు యుద్ధభూమిపై నిలుస్తాడు, కానీ అతని శరీరంలో బలం క్షీణిస్తుంది; ఆలోచనలు అస్తవ్యస్తం అవుతాయి; మనస్సు భారం అవుతుంది; యుద్ధం చేయాలంటూ కలిగిన దృఢమైన సంకల్పం పతనమై కూలిపోతుంది. అయితే, తెలుసుకోవలిసినది ఏంటంటే ఈ పతనం అంతము కాదు – ఇది అర్జునుడి మనస్సులో ఓ లోతైన ఆలోచనకి, అంతరంగ అన్వేషణకు ఆరంభం. మునుపటి అజ్ఞాన విశ్వాసాల పునాది కూలిపోయినప్పుడు, భగవానుడి సన్నిధిలో లోతైన ప్రశ్నలు మనకు అంతర్గతంగా ఉద్భవిస్తాయి – అదే అర్జునుడిలో మొదలైంది.

    భగవద్గీతలో రెండవదయిన ఈ అధ్యాయాన్ని, సాంఖ్యయోగం అంటారు అని ముందే అనుకున్నాం. అయితే, ఈ అధ్యాయమే, మరి కొన్ని పేర్లతో కూడా ప్రసిద్ధి చెందింది. ఇదే బీజాధ్యాయము అని పిలవబడుతుంది – ఎందుకంటే ఈ అధ్యాయం, తరువాతి బోధల మూలాల్ని కలిగి ఉంటుంది. ఈ అధ్యాయాన్నే, ఉపక్రమాధ్యాయము అని కూడా అంటారు – ఎందుకంటే ఇందులోనే ముఖ్యమైన జీవన మార్గాలన్నీ మొదటిసారిగా పరిచయమవుతాయి. అలాగే ఇది గీతాసారాధ్యాయము అని కూడా పిలవబడుతుంది – ఎందుకంటే ఇది తరువాతి పదహారు అధ్యాయాలలో విస్తరించబడే విషయాలన్నిటి యొక్క సారం కూడా కలిగి ఉంటుంది.

    గీతలోని ప్రధాన అంశాలైనటువంటి ఆత్మ, కర్మ, భక్తి, శరణాగతి, సమతుల్యత – ఇలాంటి పదాలన్నీ కూడా ఈ అధ్యాయంలోనే మనకు మొదట పరిచయమవుతాయి. ఇవన్నీ కూడా గీత ప్రతిపాదించిన జ్ఞానయోగం, కర్మయోగం, భక్తియోగం అనే మూడు మార్గాలకు పునాది వేస్తూ ఈ అధ్యాయంలోనే మనకు పరిచయమవుతాయి. ఈ మార్గాలన్నీ పూర్తిగా వివరించబడవు కానీ, వాటి మూల భావనలు మాత్రం ఇక్కడే ఒక విత్తనంగా నాటబడతాయి. గీతలోని మిగతా అధ్యాయాలు అన్నీదాదాపుగా, ఈ విత్తనాల్నే వికసింపజేస్తూ ముందుకు సాగుతాయి.

    గీత ఆత్మను గురించి బోధిస్తుంది. ప్రతి జీవిలో ఉన్న జీవశక్తిగా ఆత్మని సంక్షిప్తంగా నిర్వచించవచ్చు. ఈ ఆత్మపై విశ్లేషణ, అన్వేషణే తరువాత జ్ఞానయోగంగా విస్తరిస్తుంది. ఆత్మ అనేది శరీరం కంటే వేరైనది. (ఎందుకంటే, శరీరం మారుతుంది, ఆత్మ మారనిది). ఆత్మ అంటే మనస్సు కాదు (ఎందుకంటే మనసు స్పందిస్తుంది. ఆత్మకు స్పందన అంటదు). ఆత్మ అంటే బుద్ధి కాదు (ఎందుకంటే, బుద్ధి నిర్ణయిస్తుంది, ఆత్మకు నిర్ణయాలతో పని లేదు). ఆత్మ అనేది ఒక భావన, లేదా భావోద్వేగం, లేదా ఓ వ్యక్తిత్వం కాదు — ఇది జీవిలో జీవాన్ని సూచించే ఒక మూలశక్తి.

    గీత ఈ అధ్యాయంలో ఆత్మ లక్షణాలను విస్తృతంగా వివరిస్తుంది. ఈ అధ్యాయం ఆత్మను, అనుభవాల వెనుక వుండే నిశ్శబ్ద సాక్షిగా, జ్ఞానప్రవాహానికి మూలంగా, జరామరణాలు లేనిదిగా – వృద్ధాప్యం చెందనిదిగా, సుఖదుఃఖాలకు, విజయాపజయాలకు అతీతమైనదిగా చిత్రిస్తుంది. గీతా దృష్టిలో ఆత్మ అమరమైనది, తేజోవంతమయినది, స్వతంత్రమైనది.

    శరీరం మారుతుంది, కానీ ఆత్మ మారదు అని ఇంతకు మునుపు చూసాము. ఈ విషయాన్ని వివరించేందుకు భగవానుడు ఒక సాధారణ ఉపమానాన్ని అందిస్తాడు. ఈ అధ్యాయంలోని ప్రారంభ శ్లోకాల్లో ఒకటి (2.13): “దేహినోఽస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా“; దీని అర్థం: ఈ జీవితం లో బాల్యం, యౌవనం, వృద్ధాప్యం అనే దశలు శరీరానికి ఎలాగయితే సంభవిస్తాయో, అలాగే మరణం తరువాత జరిగే శరీర మార్పిడి కూడా మరొక దశగా సంభవిస్తుంది. అంచేతనే, జ్ఞానులు ఈ మరణాన్ని తలుచుకుని ఆందోళన చెందరు. ఇక్కడ ఆత్మ (దేహి) అనేది శరీర మార్పుల మధ్య కూడా తాను మారకుండా వుండేది. శరీరం యొక్క జననం, వృద్ధి, వృద్ధాప్యం, మరణం, మరొక జననం, మరలా వృద్ధి – ఇలా మార్పులు చెందుతూనే వుంటుంది. కానీ ఈ శరీరం వెనుక వున్న ఆత్మ మటుకూ ఎప్పుడూ మారదు. ఈ శ్లోకం ఆత్మను ఒక నిర్బంధించలేని-నిరంతర-సత్యంగా చూపిస్తుంది. ఆత్మ ఒక క్షణికమైన నిప్పురవ్వ కాదు. ఇది జీవితంలో జరిగే  మార్పులన్నిటి మధ్య అచలంగా, స్పష్టంగా, మార్పులేని ఒక స్థిరత్వంలా నిలుస్తుంది. ఆత్మ అనేది జ్ఞానమయమైన ఒక నిశ్శబ్ద సాక్షి.

    కర్మయోగం గూర్చి భగవద్గీతలోని మరో  ప్రత్యేక అధ్యాయంలో విస్తరించబడినప్పటికీ, దాని ప్రస్తావన ఈ సాంఖ్య యోగ అధ్యాయం లోనే మొదలవుతుంది. శ్లోకం 2.47 లో ఒక గొప్ప సత్యం ఉంది: “కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన” అంటే – నీకు కర్మ చేయడంలో హక్కు ఉంది, ఫలితాలపై కాదు. ఈ వాక్యం మనకున్న ఆచరణా స్వేచ్ఛకు ఒక శంఖానాదం వంటిది. ఇది మనల్ని ఫలితాలపై దృష్టి పెట్టకుండా, లక్ష్యంపై ఒక స్పష్టతతో కర్మ చేయమని ఉద్బోధిస్తుంది. కర్మయోగం ఇక్కడ ఓ పద్ధతిగా కాక, మన జీవన శైలిలో రావలిసిన ఒక కీలకమైన మార్పుగా మన ముందుకి వస్తుంది. ఫలితాలపై ఆసక్తి లేకుండా కర్మ చేయడం ఒక ముక్తి మార్గం అవుతుంది. ఇదే అధ్యాయంలో శ్లోకం 2.50 ఈ భావన పై మరొక మాట చెప్తుంది : “బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృతదుష్కృతే“; అంటే – జ్ఞానంతో కూడినవాడు మంచి, చెడు – ఈ రెండిటి ఫలితాలను విడిచిపెడతాడు.” అలాగే, “యోగః కర్మసు కౌశలమ్“ : అంటే – చేసే ప్రతీ కర్మలో నైపుణ్యం వుంటే (ఫలాపేక్ష లేకుండా), అదే కర్మ యోగం అవుతుంది. ఈ నైపుణ్యం అనేది సామర్థ్యం కాదు, సమతుల్యత. ఇది మానసికమైన ఒత్తిడి లేకుండా కర్మ చేయగల మెళకువ. ఇది లక్ష్యాన్ని కోల్పోకుండా ముందుకు సాగడానికి అవసరమైన ఒక విధానం. గీత చెప్పే ఈ నైపుణ్యం ఒక నిరంతర జాగురూకతతో చేసే కర్మ.

    భక్తియోగం అనేది ఈ రెండవ అధ్యాయంలోనే సునిశితంగా ప్రారంభమవుతుంది. భక్తి అనే పదం ప్రత్యక్షంగా వాడక పోయినా, భక్తి యొక్క స్పూర్తి ఇక్కడే కనిపిస్తుంది. శ్రీకృష్ణుడు ఒక ఆచార్యుడిగా మాత్రమే కాకుండా, మనమంతా తనపైనే సంపూర్ణ ఆత్మవిశ్వాసం నిలపగలిగిన ఒక పరమాత్మగా మాట్లాడతాడు. ఈ విశ్వాసం జ్ఞానగతమైనదిగా మాత్రమే కాక, భావోద్వేగపూరితమైనది, ఆధ్యాత్మికమైనది కూడా. ఇదే సంపూర్ణ శరణాగతికి ఆరంభం. అంటే మన హృదయం పూర్తిగా అర్పించాలనిపిస్తుంది. మన విశ్వాసం పరమాత్మపై స్థిరపడుతుంది. శ్లోకం 2.61, భక్తికి ఒక సున్నితమైన ఆధారాన్ని అందిస్తుంది: “తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్-పరః” అంటే – ఇంద్రియాలను నియంత్రించి, నన్ను కేంద్రంగా చేసుకుని ఉండే వాడు ఎవరో అతని జ్ఞానం స్థిరంగా ఉంటుంది. ఇక్కడ ‘మత్-పరః’ అనే పదం, భక్తి యొక్క ఆరంభాన్ని సూచిస్తుంది. ఇది కేవలం ఒక భావన మాత్రమే కాదు — భగవంతుడితో వున్న సంబంధంలో వుండవలిసిన ఒక సుస్థిరత. గీత బోధలలో భక్తి అనేది స్థిరమైన ఒక విశ్వాసానికి ప్రతీకగా ఉంటుంది. భక్తియోగం ఒక ఆచారంగా కాకుండా, భగవంతునితో ఒక బలమైన సంబంధంగా ప్రారంభమవుతుంది. భక్తి అనేది భగవంతుడిపై ఒక ఆచంచలమైన విశ్వాసం; ఈ భక్తే సాధకుని మనస్సును, ప్రపంచంలోని ఆకర్షణలకు లొంగకుండా, కేవలం భగవంతుడుపైనే  స్థిరపరుస్తుంది.

    ఈ అధ్యాయంలోని మరో ప్రత్యేకత ఏంటంటే, స్థితప్రజ్ఞుడు అనే పదం గీతలో మొదటిసారిగా ఈ అధ్యాయంలోనే మనకి కనిపిస్తుంది. ఇది స్థిరమైన జ్ఞానం కల ఒక వ్యక్తిని సూచిస్తుంది. గీతా బోధనల లక్ష్యాన్ని సజీవంగా ప్రతిబింబించే వ్యక్తిగా శ్రీకృష్ణుడు స్థితప్రజ్ఞుని లక్షణాలను శ్లోకాల శ్రేణిలో (2.55–72) వివరిస్తాడు: “ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్“ అంటే – మనస్సులో కలిగే అన్ని కోరికలను విడిచిపెట్టి, ఆత్మలోనే తృప్తి పొందే వాడు ఎవరో అతడే స్థితప్రజ్ఞుడు. ఈ స్థితప్రజ్ఞుడు  ప్రశంసకు – నిందకు, కోరికకు – భయానికి ఒకే స్తిరమైన స్పందన కలిగి వుంటాడు.  అతడు జీవిత లక్ష్యంపై, జీవన విధానంపై ఒక స్పష్టమైన అవగాహనతో జీవిస్తాడు, సమతా భావంతో మెదలుతాడు, ఆత్మలోనే చలిస్తూ విశ్రమిస్తాడు. అతడు అంతర్గతంగా పూర్ణంగా ఉంటాడు; “ఆపూర్యమాణం అచల-ప్రతిష్ఠం సముద్రం ఆపః ప్రవిశంతి యద్వత్ (2.70) “ అంటే – అన్ని నదులు సముద్రంలో కలుస్తున్నా, సముద్రం స్థిరంగా, కదలకుండా ఉంటుంది – అలాగే కోరికలు కలుగుతున్నా, స్థితప్రజ్ఞుడు అంతర్గతంగా పూర్ణంగా, అశాంతికి లోబడకుండా ఉంటాడు.
    స్థితప్రజ్ఞుడు ఈ అధ్యాయ దృష్టికోణానికి ఒక సజీవ ఉదాహరణగా నిలుస్తాడు. ఈ ప్రపంచంలో, లోకంతో సంబంధం వుంటూనే, అంతర్గతంగా స్వేచ్ఛతో జీవించడం అంటే ఏమిటి అనే ప్రశ్నకి ఇది ఒక జ్ఞానమయమైన సమాధానం.

    గీతా బోధలు కాలాతీతమైనవి. ఇవి ఈ రోజుకి కూడా మన జీవితాన్ని నేరుగా నిర్దేశిస్తాయి. అర్జునుని విషాదం, మానసిక స్థితి, ఈనాడు మనం ఎదుర్కొనే సందర్భాలను, అలాగే, మన అంతర్గత విచారణ ప్రారంభమయ్యే క్షణాలను ప్రతిబింబిస్తుంది. ఈ సాంఖ్యయోగ అధ్యాయం మనకు ఒత్తిడులు, మార్పుల మధ్య ఆత్మ విశ్వాసంతో, మానసిక స్పష్టతతో జీవించేందుకు కీలకమైన సాధనాలను అందిస్తుంది. జ్ఞానయోగం మన భౌతికత వెనుక ఉన్న స్థిరమైన ఆత్మను చూపిస్తుంది. కర్మయోగం ఉద్దేశ్యపూర్వకమైన వైరాగ్యదృష్టితో కర్మని ఆచరించమని నేర్పుతుంది. భక్తియోగం భగవంతుని పట్ల ఒక సంపూర్ణ విశ్వాసంతో, ఒక సంపూర్ణ సమర్పణా భావంతో జీవించమని బోధిస్తుంది. ఈ భావాలన్నిటికీ కూడా, ఈ అధ్యాయమే ఒక అంకురార్పణ లాంటిది.

    భగవద్గీత, రెండవ అధ్యాయం తరువాత కూడా మరో పదహారు అధ్యాయాల్లో కొనసాగుతుంది. కానీ ఈ రెండవ అధ్యాయమైన సాంఖ్య యోగం, మనకు తరువాత వచ్చే సంపూర్ణ గీతాబోధకి ఒక అద్దం పడుతుంది. ఆ అద్దంలో మనం మనల్ని చూస్తాం – మరోలా చెప్పాలంటే, ఈ అద్దంలో మనం మన ఆత్మను చూస్తాం !

    To read this article in English, Click here: