చతుర్విధ మార్గం

చతుర్విధ మార్గం: “కార్యాచరణ, విచారణ, ప్రశ్న, అన్వేషణ” – తాత్త్విక తరంగాలు

కార్యాచరణ :

ఈ కాలంలో జీవితం వేగంగా సాగుతోంది. పనులు పేరుకుపోతున్నాయి. బాధ్యతలు మన రోజంతటిని ఆక్రమిస్తున్నాయి.  అవసరమైన వాటికే సమయం సరిపోవడం లేదు. సమయానికి పని నెరవేర్చడం; ఉద్యోగ రీత్యా, కుటుంబ రీత్యా, ఎన్నో పాత్రలు పోషించడం; మనకంటూ ఏర్పరుచుకున్న ఒక జీవన దైనందిన వ్యవస్థని నడిపించడం;

అవసరమైనది పూర్తిచేస్తున్నాం. ఆలోచించేందుకు, పునఃపరిశీలించేందుకు మన దగ్గర సమయం లేదు; ఆలోచించాలని మనకు ప్రణాళిక కూడా ఏమీ లేదు. ఇలా, ఇవన్నీ చేస్తున్నప్పుడు, మనం చాలా సార్లు యాంత్రికంగా పని చేస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అయితే, ఇది నిర్లక్ష్యం కాదు; ఇది ఆధునిక జీవనశైలి యొక్క వేగం. కానీ ఈ వేగంలోనే, మనం కోరుకుంటే, మన పనులు చేయడానికి ఒక మంచి  విధానాన్ని అలవరుచుకోవచ్చు : ఓ చిన్న ఆలోచనకు చోటు కల్పించడం; మన పనిలో కొంత స్పష్టత తెచ్చుకోవడం; మన దినచర్యలో కొన్ని తేలికపాటి మార్పులు తెచ్చుకోవడం. ఇలాంటివే .

మన రోజువారీ జీవితంలో, కొన్ని విధులు మరియు బాధ్యతలు తప్పనిసరిగా చేయాల్సినవే అని మనకు తెలిసినదే.ఇవి వృత్తిపరమైన పనులు, కుటుంబ బాధ్యతలు, చిన్న చిన్న మానవతా చర్యలు, ధార్మిక కార్యక్రమాలు – ఏవైనా కావచ్చు లేదా అన్నీ కావచ్చు. ఇదే విషయం పై “మనం ఎక్కడ ఉన్నాం – జీవిత మధ్యంలో పరిశీలన” అనే నా గత వ్యాసంలో చర్చించాను. (https://nvsatish.com/2025/10/02/manam-ekkada-vunnamu)

ఆ విషయాన్నే, ఇప్పుడు మరింత లోతుగా చూద్దాం. ఇంతకుముందు చెప్పిన పనులను కేవలం ‘చేసేశాం’ అని అనిపించుకునే విధంగా చేస్తే సరిపోతుందా? అవి నిజంగా – ఏ విధంగా ఉపయోగ పడుతున్నాయి, ఎంత వరకు పనికి వస్తున్నాయి, ఎంత బాగా చేస్తున్నాము, ఇంకెంత బాగా చేయగలము – ఇవన్నీ  చూడకుండా, ఏదోలా ఆ పనిని పూర్తిచేయడం సరైన పద్ధతేనా?

విచారణ :

ఈ విషయంలో, భగవద్గీత మనకు బోధించేది ఏంటంటే – “కర్తవ్య నిర్వహణ చేయాలి; పైగా కర్మని చేయకుండా వుండలేరు; అంచేత మీ కర్తవ్య  నిర్వహణతోనే , ఈ ప్రపంచానికి కూడా, మీ వంతు సేవ చేయాలి. ” (కర్మయోగం, 3.25). ఈ బోధన ద్వారా, గీత మనకు ఒక బృహత్ లక్ష్యాన్ని చేరుకోవాల్సిన అవసరాన్ని తెలియజేస్తుంది. ఆ లక్ష్యం ఏంటి అంటే – మన పనులు, మన విధి నిర్వహణలను కూడా, మన చుట్టూ ఉన్నవారికి ఉపయోగపడేలా చేయడం, ప్రపంచానికి వీలైనంత సేవ చేయడం. ఇదే మాట మరోలా చెప్పాలంటే, చేసే ప్రతీ పని కూడా కేవలం వ్యక్తిగత లాభం కోసం మాత్రమే కాకూడదు. చేసే ప్రతీ పని వెనక వున్న మన బాధ్యతని ఎప్పటికప్పుడు (వాయిదా వేయకుండా) నిర్వర్తించడమే కాకుండా, అవి పైన చెప్పిన బృహత్ లక్ష్యానికి అనువుగా చేసామా లేదా అనే విషయాన్ని మన గమనించాలి.

మనలో చాలామందికి ఆలోచన లేకుండా యాంత్రికంగా పనులు చేయడం అనేది ఒక అలవాటుగా మారింది. ఆ అలవాటు, మనల్ని అసలు లక్ష్యం నుండి దూరం చేస్తుంది. ఈ దూరాన్ని నివారించాలంటే, పనిని ఎలా చేస్తున్నామో మనమే నిశ్శబ్దంగా పరిశీలించాలి. పనిని నిలిపివేయకుండానే , అది ఏ దిశలో, ఏ ఉద్దేశంతో సాగుతోంది అనే విషయంపై అవగాహన కలిగి ఉండాలి. ఈ రకమైన ఆలోచన, కర్తవ్యానికి అయితే అడ్డు రాదు సరి కదా, పైగా, కర్తవ్యాన్ని దాని బృహత్ లక్ష్యం వైపు నడిపించడంలో ఒక కీలకమైన భాగం అవుతుంది. సరైన సమయంలో చేసే ఈ ఆలోచన, మనకు రెండు విధాలుగా సహాయపడుతుంది:


(i) ఆ పని చేయడం వెనకాల వున్న మన ఉద్దేశంలో వున్న పొరపాట్లను సరిచేసే అవకాశం ఇస్తుంది

(ii) అలాగే, మన విధులను ఎలా నిర్వహించాలో దానికి తగ్గట్టుగా మనల్ని (అంటే, మన మానసిక స్థితిని) మలచుతుంది.


కాలక్రమేణా, ఈ రకమైన అంతరాలోచన, విధులను యాంత్రికంగా కాక, ఆలోచనాత్మకంగా నిర్వర్తించేటట్లు చేస్తుంది. కొద్దిపాటి ఆలోచనతో మన కర్మాచారణ యొక్క వేగాన్ని తగ్గించడం అనేది, బాధ్యత నుండి పారిపోవడం కాదు; అదే బాధ్యతని జ్ఞానంతో, ఒక సరైన అవగాహనతో, సరైన దృక్పధంతో చేయడమే.

ఆ ఆలోచనలో మన చర్యలు, మరియు వాటి లక్ష్యాల మధ్య అంతరం (కొంత తేడా) కనిపించినప్పుడు, ఒక క్రమబద్ధమైన విచారణ అనేది అవసరం అవుతుంది. ఆ ప్రయత్నంలో, “ఉద్ధరేదాత్మనాత్మానం” (గీత 6.5) అని చెప్పినట్టు, మనలోని ఆలోచనల్ని మనమే పైకి తీసుకురావాలి. మనలో మనం చేసుకునే ఈ రకమైన అంతర్విచారణని, ఒక బాధ్యతగా తీసుకోవాలి.

ప్రశ్న:

ఆదిశంకరాచార్యులు, వివేకచూడామణిలో (శ్లోకం 11) విచారణ చేసుకోవాల్సిన ఇలాంటి అవసరానికే, ఒక ఆధ్యాత్మిక మలుపునిస్తారు: “విచార ఏవ జ్ఞానస్య మార్గః” – విచారణే జ్ఞానానికి మార్గం అంటూ. జ్ఞానం, కర్తవ్యానికి మార్గాన్ని తేజోమయం చేస్తుంది; ఈ జ్ఞానార్జన మార్గంలో, ఈ విచారణా మార్గంలో, మనలో వచ్చే ప్రశ్నలు, ధర్మ సందేహాలే ఆ తేజాన్ని, ఆ వెలుగును నిత్యం ప్రజ్వలింప చేస్తూ ఉంటాయి.

అలాంటి ప్రశ్నలు మనలో ఉదయించినపుడు ఏం చేయాలో, మనకి గీత చెప్తుంది: – “తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా” (గీత 4.34) – ఈ బోధ ఒక జీవన విధానాన్ని నేర్పుతుంది. దీని అర్థం : “జ్ఞానుల పంచన చేరి వారి సేవ చేయండి; వారిని  వినయంగా ప్రశ్నించండి”. అలాంటి జ్ఞానుల వద్దకు మనం మన సందేహాలతో వెళ్తే, వారు మన సందేహ నివృత్తి చేస్తారు. మనకు మార్గ దర్శనం చేయిస్తారు.

“కోఽహం?” – “నేను ఎవరు?” – ఇది రమణ మహర్షి గంభీరమైన ప్రశ్న.  మనమే, మనలోపల  ప్రజ్వలింప చేయడానికి రమణ మహర్షి ఇచ్చిన ఒక అంతరంగ జ్వాల; ఒక అత్యంత ప్రాథమికమైన, లోతైన ప్రశ్న.

అన్వేషణ:

 మన మనస్సులో ఇలాంటి ప్రశ్నలు రావటం, వాటిపై విచారణ చేసే ప్రక్రియ మొదలవ్వటం – ఇదంతా కూడా ఒక అంతర్గత స్పష్టతని సంపాదించడానికి ఒక కీలకమైన మెట్టు. ఆయితే, కేవలం స్వీయ అంతర్విచారణ మాత్రమే మానవ జీవితానికి సరిపోదు. ఎందుకంటే, ప్రపంచంలోని ప్రతి వ్యక్తి, తన అనుభవం, స్వభావం ద్వారా ఒక  ప్రత్యేకమైన దృష్టికోణాన్ని కల్పించుకుంటాడు. ఆ మనిషి ఎప్పుడూ కూడా, ఆ దృష్టికోణంలోనే ముందుకు వెళ్తూ వుంటాడు. అలాంటి ఆలోచన ఒకోసారి సంకుచిత స్వభావానికి దారి తీయవచ్చు.

కానీ, అదే లక్ష్యం దిశలో వెళ్ళే మరి కొంతమంది అన్వేషకులను , సాధకులను చేరుకుని వారితో కలిసినప్పుడు, ఆ సమూహంలోని వారి  సాంగత్యం వల్ల అందరి వ్యక్తిగత దృష్టికోణాలు మరింత వికసిస్తాయి, విస్తరిస్తాయి. ఒక వ్యక్తిగత ఒంటరి అన్వేషణగా మొదలయిన ఈ ప్రయాణం, ఒక విశాల జ్ఞాన ప్రవాహంతో సాగే ప్రయాణంగా మారుతుంది. అలాంటి సాంగత్యంలో ముందుకు వెళ్తున్నప్పుడు, మనలో ఉదయించే ప్రశ్నలు మరింత ఉన్నత స్థాయిని చేరతాయి; వాటి సమాధానాలు మరింత స్పష్టతను ఇస్తాయి. తద్వారా వచ్చే అవగాహన లోతుగా మారుతుంది. ఇది ఆ సంగంలోని అందరికీ లాభదాయకమే అవుతుంది. సత్సంగం ద్వారా, ప్రశ్నలు పదునవుతాయి, బలహీనమైన సమాధానాలు తొలగిపోతాయి. యోగవాసిష్ఠం లోని వైరాగ్య ప్రకరణం (2.12) కూడా  సత్సంగానికి గొప్ప ప్రాముఖ్యతను తెలియజేస్తుంది.

సత్సంగంలో వుంటూ, మనకంటూ ఏ ప్రశ్నలు లేకపోయినప్పుడు కూడా, ఇతరుల ప్రశ్నలను సైతం మన ప్రశ్నగా స్వీకరించాలి; తద్వారా, మన మనస్సుకి శ్రద్ధ, వినయము, అలాగే అన్వేషణలలో శిక్షణను కూడా కలిగించినట్టు అవుతుంది. ఇతరుల ప్రశ్నలకు, మనం కూడా  సమాధానాలు సంపాదించడానికి మన సామర్ధ్యనుసారంగా ప్రయత్నించాలి. శంకరాచార్యుల “సత్సంగత్వే నిస్సంగత్వం…” (భజగోవిందం-9) శ్లోకం అలాంటి సత్ సాంగత్యం యొక్క ఫలితాన్ని ప్రామాణికంగా చూపుతుంది.

ఈ రోజుల్లో ..  అంతా పరుగులు తీస్తున్న ఈ సమయంలో..   కేవలం ఆలోచించడానికి మాత్రమే, ఒక బాధ్యత నుంచి తాత్కాలిక విరామం తీసుకోవడం, ఒక నలుగురిని కలవడం కష్టమే. అంచేత శారీరకంగా, భౌతికంగా ఒక సత్సంగంలో పాల్గొనడం అనేది చాలా సార్లు, అసాధ్యంగా అనిపించవచ్చు. అయితే, డిజిటల్ రూపంలో (ఇంటర్నెట్ ద్వారా, కంప్యూటర్ల, మొబైలు ఫోన్ల ద్వారా) సత్సంగంతో వుండే అవకాశం ఈ రోజు మనకుంది. అది కూడా, మన  జీవితానికి ఒక దిశా నిర్దేశం చేయగలదు.

సత్సంగం ఎలాంటిదయినా సరే, (ప్రత్యక్షంగా గానీ లేదా ఇంటర్నెట్ మాధ్యమాల ద్వారా గానీ) మన ఆలోచనలలో ఒక ఖచ్చితమైన స్పష్టతను, స్థిరత్వాన్ని ఇస్తుంది.  ఇదే, కాలక్రమేణా, మన స్వభావంగా మారి, మన వ్యక్తిత్వాన్ని ఒక ఉన్నతమైన స్థాయి లోకి తీసుకువెళ్తుంది. మన సరైన మానసిక మరియు ఆధ్యాత్మిక అభివృద్ధికి, డిజిటల్ సాంకేతికత సైతం ఒక అద్భుతమైన పరికరంగా, ఒక కీలకమైన పాత్ర పోషిస్తుంది.

ఆచరణా విధానం :

ఈ రోజుల్లో అందరికీ ఎంతో అవసరమైన ఈ ఆలోచనా సరళిని, ఆచరణలో పెట్టడం పెద్ద కష్టం ఏం కాదు : అన్ని బాధ్యతలు, యధావిధిగానే నిర్వహించండి. అయితే, మీరు ఆచరించిన ప్రతి చర్యను, ఒకసారి పరిశీలన చేయండి – మీరు చేసిన విధానం సరైనదా కాదా అని, అలాగే, ఆ చర్య వెనుక వున్న మీ ఉద్దేశ్యం సరైనదా కాదా అన్న విషయం పై విచారణ చేయండి. మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి.  అవసరమైతే, మీ సందేహాలతో, ప్రశ్నలతో ఒక మంచి సత్సంగంలో చేరండి – మీ సందేహ నివృత్తి చేసుకోండి. అక్కడ వున్న ఇతరుల ప్రశ్నలకు కూడా వినండి, వాటికి కూడా సమాధానాలు వెతకండి. ప్రతి ప్రశ్నను, దాని సమాధానాన్ని – ఎక్కడ కనిపించినా, ఎవరు అడిగినా – మీ అవగాహనలోకి తెచ్చుకోండి. మీ దృష్టికోణాన్ని విశాలం చేసుకోండి. వీలైతే ఆ జ్ఞానాన్ని మరో నలుగురితో పంచుకోండి.

ముగింపు వాక్యం :

ఈ పాటికి, మీకు స్పష్టం అయ్యేవుంటుంది, కర్తవ్య నిర్వహణలో – విచారణ మరియు ప్రశ్న – ఈ రెండు కూడా సమాన-భాగస్వాములు అవ్వాలి. ఒక కర్తవ్యాన్ని, దాని బృహత్ లక్ష్యానికి అనుగుణంగా నిర్వహించడానికి కావలిసినవి  నాలుగు; (కార్యాచరణ . ఆలోచన. ప్రశ్న. అన్వేషణ.) ఈ నాలుగు కూడా, ఈ చతుర్విధములు కలిసి, ప్రతి కార్యాచరణకి మార్గదర్శకంగా నిలవాలి — అప్పుడు మీరు ఒక కర్మయోగి పధంలో వున్నవారు అవుతారు.  –  ఇదే భగవద్గీత సూచించిన కర్మ యోగ మార్గం.

(ఈ వ్యాసాన్ని ఆంగ్లంలో చూడాలనుకొనేవారు ఇక్కడ క్లిక్ చేయండి – https://nvsatish.com/2025/09/25/the-fourfold-path-act-think-question-seek/)

Comments

3 responses to “చతుర్విధ మార్గం”

  1. మనం ఎక్కడ ఉన్నాం? – Thoughts on Life and its Philosophy avatar

    […] తదుపరి వ్యాసం – “చతుర్విధ మార్గం” ; ఈ వ్యాసాన్ని తెలుగులో చదవడానికి, క్రింది లింకను క్లిక్ చేయండి – https://nvsatish.com/2025/10/01/chaturvidha-margam/ […]

    Like

  2. కర్మ – చతుర్విధ మార్గంలో తొలి మెట్టు – My Thoughts on Life and its Philosophy avatar

    […] వ్యాసం, చతుర్విధ మార్గం — కార్యాచరణ, ఆలోచన, విచారణ, అన్వేషణ — […]

    Like

Leave a reply to మనం ఎక్కడ ఉన్నాం? – Thoughts on Life and its Philosophy Cancel reply