జీవిత మధ్యంలో పరిశీలన
(ఇది తాత్త్విక తరంగాల శ్రేణిలో మొదటి వ్యాసం. నేను దీన్ని కేవలం మీతో పంచుకోవాలనే కాదు, మీలోనూ ఇలాంటి తాత్త్వికమైన తరంగాలు కల్పించాలన్న ఉద్దేశ్యంతో రాశాను. ఈ వ్యాసాలు 45 సంవత్సరాలు పై బడిన వారికి మరింత సముచితంగా, ఆసక్తికరంగా ఉండొచ్చు. అయితే యువ పాఠకులకు కూడా స్వాగతమే.)
జీవితం, ముఖ్యంగా మానవ జీవితం అనేది, చుట్టూ ఉన్న ప్రపంచంతో కలిగే సంబంధాలతోనూ, అట్టి సంబంధాల వలన కలిగే అనుభవాలతోనూ కలిపి నేసిన ఒక గొప్ప వస్త్రంలాంటిది .
మనలో ప్రతి ఒక్కరి జీవితంలో, విద్యార్థి దశను దాటి, అటు పై ఆదాయ సంపాదన దశలోకి మారిన తర్వాత, జీవన లక్ష్యం అనేది సాధారణంగా, ఉద్యోగపరమైన లక్ష్యాల చుట్టూ తిరుగుతుంది. ఈ లక్ష్యాలు వ్యక్తిగత అభివృద్ధికి, ఆర్థిక స్థిరత్వానికి, అలాగే కొంతమేర సంతృప్తిని కూడా కలిగిస్తాయని సాధారణంగా భావించవచ్చు. ఈ దశలో కొనసాగుతూనే, మనం కుటుంబంతో, స్నేహితులతో, సహచరులతో, ఇరుగు-పొరుగువారితో, మరియు మన పరిచయాల్లో ఉన్న సామాజిక వర్గాలతో బంధాలను ఏర్పరుచకోవడం, ఆ బంధాలను పోషించడం కూడా మొదలుపెడతాం. ఈ బంధాలు, మన జీవితానికి ఆనందం, అర్థం, అవసరానికి కావలిసిన మద్దతునీ ఇస్తాయని మన ఊహ, ఆశ. జీవితంలో మనం చేయవలసిన కర్తవ్యాలకి, మరియు బాధ్యతలకి కూడా కారణం – ఈ బంధాలని నిలుపుకోవాలన్న కోరికే.
కొంతమంది ఉత్సాహవంతులు, ఇన్ని బాధ్యతల మధ్యలో కూడా, పుస్తక పఠనం, క్రీడలు, సంగీతం, యాత్రలు, లేదా ఇతర సృజనాత్మక కార్యకలాపాల ద్వారా వ్యక్తిగత ఆనందాన్ని పొందగలుగుతారు. ఇటీవల కాలంలో, ఆరోగ్యంపై అవగాహన పెరిగింది. అంచేతనే, శరీర వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారం, మెదడుకి మేత, తరచూ వైద్య పరీక్షలు చేయించుకోవడం – ఇలాంటి వాటి ద్వారా, శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడం కూడా, మన జీవితంలో భాగమైంది.
ప్రతి వ్యక్తి యొక్క జీవన విధానం అతను పెరిగిన వాతావరణం పైన, అతని ఆసక్తుల పైన, అతను నిర్వర్తించే బాధ్యతలపైన, అతని జీవిత ఆశయాల పైన ఆధారపడి తనకంటూ ఒక ప్రత్యేక వ్యక్తిత్వాన్ని సంతరించుకుంటుంది. ఇప్పటివరకు మనమందరం కూడా జీవితం ఎలా ఉందో చూస్తున్నాం, అనుభవించాం. జీవితం ఎన్నో మలుపులతో కూడిన ప్రయాణం. జీవితం మనకు అనుకూలంగా ఉండే విషయాలతో మాత్రమే నిండినది కాదు అని కూడా మనకు తెలియంది కాదు. అందుకే, ఇన్ని మలుపులతో గడిచే మన జీవిత యాత్ర, సరైన దిశలో వెళుతోందో లేదో అనే విషయం పై ఒకోసారి సందేహం కలగడం సహజం. ఈ సందేహం తీరేదెలా ?
ఇదే నేపథ్యంలో, మరి కొన్ని ప్రశ్నలు మీ ముందుంచాలనుకుంటున్నాను: ఇప్పటివరకు జరిగిన మీ జీవిత ప్రస్థానంలో, మీరు తీసుకున్న నిర్ణయాలు, చర్యలు – అన్నీ సరైనవేనా? మీరు మీ పట్ల పూర్తిగా సంతృప్తిగా ఉన్నారా?
ప్రతీవారి యొక్క బాధ్యతలు, కర్తవ్యాలు జీవన గమనంలో మారుతూ ఉంటాయి. 45 – 55 ఏళ్ల వయస్సు వచ్చే వరకు, ఇవి పెరుగుతూ వుంటాయి. అటు తర్వాత వయస్సులో, కొంత కాలం వరకు ఇవి అలాగే స్థిరపడి పోతాయి. ఆ తరువాత, వయస్సు పెరిగే కొద్దీ, ఇవి తగ్గడం ప్రారంభమవుతాయి. ఒకానొక దశలో, మనం నిజంగా చూస్తే, బాధ్యతలు అనేవి ఏమీ లేకుండానే పోతాయి. మొత్తం మీద చూస్తే, బాధ్యతలనేవి ప్రారంభం, పెరుగుదల, గరిష్ట స్థాయి, తగ్గుదల, ముగింపు అనే దశల ద్వారా సాగుతాయి.
ఇప్పుడు మరి కొన్ని ప్రశ్నలు: 45 – 55 వయస్సు వద్ద, బాధ్యతలన్నీ స్థిరంగా ఉంటాయి అనుకున్నాము కదా. ఈ దశలో వున్న మీ ఇప్పటి జీవితం, మీ యువ దశలో మీరే కోరుకున్న ఆశయాలతో సరిపోలుతోందా? ఆ దృష్టితో చూస్తే, మీ జీవితంలో మీరు ఇప్పటివరకు సాధించినదానితో మీరు పూర్తిగా సంతృప్తి చెందారా?
ఇలాంటి ప్రశ్నలన్నిటి దృష్ట్యా, ఇప్పటివరకు మనం ఎటు వెళ్లామో పరిశీలించడం అనేది మనకు చాలా అవసరం. మన వయస్సు 45 దాటినా, ఇంకా జీవితం చాలానే మిగిలి ఉంది కదా. ఈ వయస్సులో, మన బాధ్యతలలో కూడా, కొత్తగా వచ్చే పెద్ద మార్పులు, అవసరాలు వుండకపోవచ్చు. ఇంకా మిగిలి వున్న బాధ్యతలను తీర్చే ప్రణాళిక ఇప్పటికే తయారై వుంటుంది. కాబట్టి, ఇప్పుడు మన జీవిత లక్ష్యం ఏమై ఉండాలి?
కొద్దిగా ఆలోచిస్తే, ఇది డబ్బుతో సంబంధం ఉన్న లక్ష్యం కాదు అని తెలిసిపోతుంది. ఎందుకంటే, ఈ వయస్సులో మన ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది – అంటే, ఒక రకంగా మనం అలవాటు పడిపోయిన ఆర్ధిక స్తితి కాబట్టి. ఇప్పుడు మనం జీవిస్తునే ఉన్నందువల్ల, ఈ వయస్సులో బాధ్యతలు అనేవి మనకు ఉండి తీరుతాయి. కానీ వాటిని నెరవేర్చడం మాత్రమే జీవితం కాదు. ప్రతి మనిషి కూడా తన జీవితంలో ఒక ఉన్నతమైన లక్ష్యాన్ని కూడా కలిగి ఉండాలి. డబ్బు అనేది ఒక తాత్కాలిక లక్ష్యంగా మాత్రమే ఉండొచ్చు. కానీ, ఇక్కడ నేను మాట్లాడేది ఒక ‘మానవ’ జీవన లక్ష్యం గురించి – ఈ విశాలమైన విశ్వంలో మన ప్రయాణం ఎటు ? మనకున్న ఇన్ని అనుభవాల నేపథ్యంలో, మనం ఏమి సాధించాం ? మనం ఈ సమాజానికీ, ఈ దేశానికి, ఈ ప్రపంచానికీ, ఏదైనా తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత మనపై ఉందా? ఇప్పటిదాకా సాగిన మన ప్రయాణంలో, మనకి ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ సహాయం చేసినవారందరికీ, ఇంకా చేస్తూనే వున్న వారికీ, మనం ఏదైనా తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత మనకు ఉందా?
ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలంటే, జీవితంలోని ఈ దశలో, ఒక చిన్న ఆలోచన అవసరం. మన అనుభవాలు, మన నిర్ణయాలు, మన విజయాలు, మన వైఫల్యాలు – వీటన్నిటినీ జాగ్రత్తగా పరిశీలించి, అవి మన మననుని ఎలా మలిచాయో అర్థం చేసుకోవాలి. మన అభిప్రాయాలు, అహంకారాలు, పక్షపాతాలు కలగలిసిపోయి, మన దృష్టిని ఇప్పటికే మసకబార్చి ఉండవచ్చు. దాని పర్యవసానంగా కొన్ని ముఖ్యమైన అవకాశాలని మనం జీవితంలో చేజార్చుకుని ఉండవచ్చు. ఒకసారి మన పరుగు ఆపి, కొన్ని క్షణాలు ఆగి, మన మనస్సులోనే మన వ్యక్తిత్వాన్ని ఒక్కసారి, నిస్పక్షపాతంగా సమీక్ష చేసుకుంటే, రాబోయే మన జీవన ప్రవాహానికి ఒక సరైన దిశ ఇవ్వవచ్చు – తద్వారా మనం మరింత ఆనందంగా, సంతృప్తిగా జీవించవచ్చు. అవసరమైతే, ఇతరులను కూడా ఆనందంగా, సంతృప్తిగా జీవించేందుకు అవసరమైన సహాయం చేయవచ్చు. ఇలాంటి ఆత్మపరిశీలన చేస్కోవాలంటే, నమ్మకమైన స్నేహితులు, గురువులు అవసరం. అలాగే, కొద్దిపాటి ధ్యానం కూడా ఎంతో సహాయపడుతుంది. వీటన్నిటి సహాయంతో, మన పురోగతి, మన తప్పులు, మన మూర్ఖత్వం, జీవితంలో ‘మనం నేర్చుకున్నాం’ అనుకున్న పాఠాలను – వీటన్నిటినీ నిష్పక్షపాతంగా విమర్శ చేసుకోవాలి. అప్పటికీగానీ, ‘మనం ఎక్కడున్నాం’ అనే ప్రశ్నకు కొంతైనా సమాధానం దొరకదు.
మరి, ఈ నేపధ్యంలో, ఇప్పుడు మీకు కొన్ని ప్రశ్నలు .. మీ జీవన ప్రయాణాన్ని ఇప్పటివరకు మీరు పరిశీలించారా? ఇప్పుడు ఎటు వెళ్తున్నారు అనేది గమనిస్తున్నారా ? లేదంటే, ఇప్పుడు ఆలోచించండి…మీ జీవితం గురించి.
మీరు ఏమి చేసారు ? ఇప్పుడు ఏ దశలో ఉన్నారు ? తర్వాత ఏమి చేయాలి ? మీరు ఎందుకు ఆనందంగా ఉన్నారు ? లేదా ఎందుకు ఆనందంగా లేరు ? ఎందుకు సంతృప్తిగా ఉన్నారు లేదా ఎందుకు మీకు అసంతృప్తి ?
– వీటన్నిటికే సమాధానాలు వెతికే క్రియలో, అంటే జీవిత మధ్యంలో ఒక స్వీయ-సమీక్షలో, మీరు నిమగ్నమవుతారని, తద్వారా తదుపరి ప్రయాణాన్ని సుగమం చేసుకుంటారని, మీతో పాటు మరికొందరి మార్గాన్ని కూడా సుగమం చేయిస్తారని ఆశిస్తూ, ఇక్కడ విరామం తీసుకుంటాను.
నమస్తే.
___________________________________________________________________________
తదుపరి వ్యాసం – “చతుర్విధ మార్గం” ; ఈ వ్యాసాన్ని తెలుగులో చదవడానికి, క్రింది లింకను క్లిక్ చేయండి – https://nvsatish.com/2025/10/01/chaturvidha-margam/
To read the English Version of the current article: Click the link below – https://nvsatish.com/2025/01/28/where-are-we-a-mid-life-introspection/
Leave a comment