భగవద్గీత, అర్జునుడు మరియు భగవాన్ శ్రీకృష్ణుని మధ్య జరిగిన అద్భుత సంవాదం. ఇది అందరికి తెలిసిన విషయమే. ఈ భగవద్గీత, మన జీవితాన్ని, మన జీవనవిధానాన్ని, అలాగే మనలోని మానసిక సంక్షోభాలని ఉద్దేశించి ఒక గంభీరమైన, అద్భుతమైన సందేశాన్ని ఇస్తుంది. గీతలో మొత్తం పద్ధెనిమిది అధ్యాయాలు ఉన్నప్పటికీ, రెండవ అధ్యాయం ఒక ప్రత్యేకం స్థానంలో నిలుస్తుంది. ఈ అధ్యాయం, అష్టాదశ అధ్యాయాల గీతా బోధలన్నిటికీ ఒక అంకురంగా, ఒక విత్తనంగా నిలుస్తుంది. ఈ అధ్యాయమే సాంఖ్యయోగం; సంపూర్ణగీత ప్రబోధించే ప్రతి పరిష్కార మార్గానికి – అంటే జ్ఞాన మార్గం, కర్మ మార్గం, భక్తి మార్గం – ఈ మూడిటికి కూడా, ఒక బలమైన పునాది మనకు ఈ అధ్యాయంలోనే పరిచయమవుతుంది.
గీతలో భగవానుడైనటువంటి శ్రీకృష్ణుని బోధ ప్రారంభమయ్యే ముందు, అర్జునుని మానసిక దుఃస్థితి మొదటి అధ్యాయం ద్వారా, మన ముందుకొస్తుంది. అర్జునుడు యుద్ధభూమిపై నిలుస్తాడు, కానీ అతని శరీరంలో బలం క్షీణిస్తుంది; ఆలోచనలు అస్తవ్యస్తం అవుతాయి; మనస్సు భారం అవుతుంది; యుద్ధం చేయాలంటూ కలిగిన దృఢమైన సంకల్పం పతనమై కూలిపోతుంది. అయితే, తెలుసుకోవలిసినది ఏంటంటే ఈ పతనం అంతము కాదు – ఇది అర్జునుడి మనస్సులో ఓ లోతైన ఆలోచనకి, అంతరంగ అన్వేషణకు ఆరంభం. మునుపటి అజ్ఞాన విశ్వాసాల పునాది కూలిపోయినప్పుడు, భగవానుడి సన్నిధిలో లోతైన ప్రశ్నలు మనకు అంతర్గతంగా ఉద్భవిస్తాయి – అదే అర్జునుడిలో మొదలైంది.
భగవద్గీతలో రెండవదయిన ఈ అధ్యాయాన్ని, సాంఖ్యయోగం అంటారు అని ముందే అనుకున్నాం. అయితే, ఈ అధ్యాయమే, మరి కొన్ని పేర్లతో కూడా ప్రసిద్ధి చెందింది. ఇదే బీజాధ్యాయము అని పిలవబడుతుంది – ఎందుకంటే ఈ అధ్యాయం, తరువాతి బోధల మూలాల్ని కలిగి ఉంటుంది. ఈ అధ్యాయాన్నే, ఉపక్రమాధ్యాయము అని కూడా అంటారు – ఎందుకంటే ఇందులోనే ముఖ్యమైన జీవన మార్గాలన్నీ మొదటిసారిగా పరిచయమవుతాయి. అలాగే ఇది గీతాసారాధ్యాయము అని కూడా పిలవబడుతుంది – ఎందుకంటే ఇది తరువాతి పదహారు అధ్యాయాలలో విస్తరించబడే విషయాలన్నిటి యొక్క సారం కూడా కలిగి ఉంటుంది.
గీతలోని ప్రధాన అంశాలైనటువంటి ఆత్మ, కర్మ, భక్తి, శరణాగతి, సమతుల్యత – ఇలాంటి పదాలన్నీ కూడా ఈ అధ్యాయంలోనే మనకు మొదట పరిచయమవుతాయి. ఇవన్నీ కూడా గీత ప్రతిపాదించిన జ్ఞానయోగం, కర్మయోగం, భక్తియోగం అనే మూడు మార్గాలకు పునాది వేస్తూ ఈ అధ్యాయంలోనే మనకు పరిచయమవుతాయి. ఈ మార్గాలన్నీ పూర్తిగా వివరించబడవు కానీ, వాటి మూల భావనలు మాత్రం ఇక్కడే ఒక విత్తనంగా నాటబడతాయి. గీతలోని మిగతా అధ్యాయాలు అన్నీదాదాపుగా, ఈ విత్తనాల్నే వికసింపజేస్తూ ముందుకు సాగుతాయి.
గీత ఆత్మను గురించి బోధిస్తుంది. ప్రతి జీవిలో ఉన్న జీవశక్తిగా ఆత్మని సంక్షిప్తంగా నిర్వచించవచ్చు. ఈ ఆత్మపై విశ్లేషణ, అన్వేషణే తరువాత జ్ఞానయోగంగా విస్తరిస్తుంది. ఆత్మ అనేది శరీరం కంటే వేరైనది. (ఎందుకంటే, శరీరం మారుతుంది, ఆత్మ మారనిది). ఆత్మ అంటే మనస్సు కాదు (ఎందుకంటే మనసు స్పందిస్తుంది. ఆత్మకు స్పందన అంటదు). ఆత్మ అంటే బుద్ధి కాదు (ఎందుకంటే, బుద్ధి నిర్ణయిస్తుంది, ఆత్మకు నిర్ణయాలతో పని లేదు). ఆత్మ అనేది ఒక భావన, లేదా భావోద్వేగం, లేదా ఓ వ్యక్తిత్వం కాదు — ఇది జీవిలో జీవాన్ని సూచించే ఒక మూలశక్తి.
గీత ఈ అధ్యాయంలో ఆత్మ లక్షణాలను విస్తృతంగా వివరిస్తుంది. ఈ అధ్యాయం ఆత్మను, అనుభవాల వెనుక వుండే నిశ్శబ్ద సాక్షిగా, జ్ఞానప్రవాహానికి మూలంగా, జరామరణాలు లేనిదిగా – వృద్ధాప్యం చెందనిదిగా, సుఖదుఃఖాలకు, విజయాపజయాలకు అతీతమైనదిగా చిత్రిస్తుంది. గీతా దృష్టిలో ఆత్మ అమరమైనది, తేజోవంతమయినది, స్వతంత్రమైనది.
శరీరం మారుతుంది, కానీ ఆత్మ మారదు అని ఇంతకు మునుపు చూసాము. ఈ విషయాన్ని వివరించేందుకు భగవానుడు ఒక సాధారణ ఉపమానాన్ని అందిస్తాడు. ఈ అధ్యాయంలోని ప్రారంభ శ్లోకాల్లో ఒకటి (2.13): “దేహినోఽస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా“; దీని అర్థం: ఈ జీవితం లో బాల్యం, యౌవనం, వృద్ధాప్యం అనే దశలు శరీరానికి ఎలాగయితే సంభవిస్తాయో, అలాగే మరణం తరువాత జరిగే శరీర మార్పిడి కూడా మరొక దశగా సంభవిస్తుంది. అంచేతనే, జ్ఞానులు ఈ మరణాన్ని తలుచుకుని ఆందోళన చెందరు. ఇక్కడ ఆత్మ (దేహి) అనేది శరీర మార్పుల మధ్య కూడా తాను మారకుండా వుండేది. శరీరం యొక్క జననం, వృద్ధి, వృద్ధాప్యం, మరణం, మరొక జననం, మరలా వృద్ధి – ఇలా మార్పులు చెందుతూనే వుంటుంది. కానీ ఈ శరీరం వెనుక వున్న ఆత్మ మటుకూ ఎప్పుడూ మారదు. ఈ శ్లోకం ఆత్మను ఒక నిర్బంధించలేని-నిరంతర-సత్యంగా చూపిస్తుంది. ఆత్మ ఒక క్షణికమైన నిప్పురవ్వ కాదు. ఇది జీవితంలో జరిగే మార్పులన్నిటి మధ్య అచలంగా, స్పష్టంగా, మార్పులేని ఒక స్థిరత్వంలా నిలుస్తుంది. ఆత్మ అనేది జ్ఞానమయమైన ఒక నిశ్శబ్ద సాక్షి.
కర్మయోగం గూర్చి భగవద్గీతలోని మరో ప్రత్యేక అధ్యాయంలో విస్తరించబడినప్పటికీ, దాని ప్రస్తావన ఈ సాంఖ్య యోగ అధ్యాయం లోనే మొదలవుతుంది. శ్లోకం 2.47 లో ఒక గొప్ప సత్యం ఉంది: “కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన” అంటే – నీకు కర్మ చేయడంలో హక్కు ఉంది, ఫలితాలపై కాదు. ఈ వాక్యం మనకున్న ఆచరణా స్వేచ్ఛకు ఒక శంఖానాదం వంటిది. ఇది మనల్ని ఫలితాలపై దృష్టి పెట్టకుండా, లక్ష్యంపై ఒక స్పష్టతతో కర్మ చేయమని ఉద్బోధిస్తుంది. కర్మయోగం ఇక్కడ ఓ పద్ధతిగా కాక, మన జీవన శైలిలో రావలిసిన ఒక కీలకమైన మార్పుగా మన ముందుకి వస్తుంది. ఫలితాలపై ఆసక్తి లేకుండా కర్మ చేయడం ఒక ముక్తి మార్గం అవుతుంది. ఇదే అధ్యాయంలో శ్లోకం 2.50 ఈ భావన పై మరొక మాట చెప్తుంది : “బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృతదుష్కృతే“; అంటే – జ్ఞానంతో కూడినవాడు మంచి, చెడు – ఈ రెండిటి ఫలితాలను విడిచిపెడతాడు.” అలాగే, “యోగః కర్మసు కౌశలమ్“ : అంటే – చేసే ప్రతీ కర్మలో నైపుణ్యం వుంటే (ఫలాపేక్ష లేకుండా), అదే కర్మ యోగం అవుతుంది. ఈ నైపుణ్యం అనేది సామర్థ్యం కాదు, సమతుల్యత. ఇది మానసికమైన ఒత్తిడి లేకుండా కర్మ చేయగల మెళకువ. ఇది లక్ష్యాన్ని కోల్పోకుండా ముందుకు సాగడానికి అవసరమైన ఒక విధానం. గీత చెప్పే ఈ నైపుణ్యం ఒక నిరంతర జాగురూకతతో చేసే కర్మ.
భక్తియోగం అనేది ఈ రెండవ అధ్యాయంలోనే సునిశితంగా ప్రారంభమవుతుంది. భక్తి అనే పదం ప్రత్యక్షంగా వాడక పోయినా, భక్తి యొక్క స్పూర్తి ఇక్కడే కనిపిస్తుంది. శ్రీకృష్ణుడు ఒక ఆచార్యుడిగా మాత్రమే కాకుండా, మనమంతా తనపైనే సంపూర్ణ ఆత్మవిశ్వాసం నిలపగలిగిన ఒక పరమాత్మగా మాట్లాడతాడు. ఈ విశ్వాసం జ్ఞానగతమైనదిగా మాత్రమే కాక, భావోద్వేగపూరితమైనది, ఆధ్యాత్మికమైనది కూడా. ఇదే సంపూర్ణ శరణాగతికి ఆరంభం. అంటే మన హృదయం పూర్తిగా అర్పించాలనిపిస్తుంది. మన విశ్వాసం పరమాత్మపై స్థిరపడుతుంది. శ్లోకం 2.61, భక్తికి ఒక సున్నితమైన ఆధారాన్ని అందిస్తుంది: “తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్-పరః” అంటే – ఇంద్రియాలను నియంత్రించి, నన్ను కేంద్రంగా చేసుకుని ఉండే వాడు ఎవరో అతని జ్ఞానం స్థిరంగా ఉంటుంది. ఇక్కడ ‘మత్-పరః’ అనే పదం, భక్తి యొక్క ఆరంభాన్ని సూచిస్తుంది. ఇది కేవలం ఒక భావన మాత్రమే కాదు — భగవంతుడితో వున్న సంబంధంలో వుండవలిసిన ఒక సుస్థిరత. గీత బోధలలో భక్తి అనేది స్థిరమైన ఒక విశ్వాసానికి ప్రతీకగా ఉంటుంది. భక్తియోగం ఒక ఆచారంగా కాకుండా, భగవంతునితో ఒక బలమైన సంబంధంగా ప్రారంభమవుతుంది. భక్తి అనేది భగవంతుడిపై ఒక ఆచంచలమైన విశ్వాసం; ఈ భక్తే సాధకుని మనస్సును, ప్రపంచంలోని ఆకర్షణలకు లొంగకుండా, కేవలం భగవంతుడుపైనే స్థిరపరుస్తుంది.
ఈ అధ్యాయంలోని మరో ప్రత్యేకత ఏంటంటే, స్థితప్రజ్ఞుడు అనే పదం గీతలో మొదటిసారిగా ఈ అధ్యాయంలోనే మనకి కనిపిస్తుంది. ఇది స్థిరమైన జ్ఞానం కల ఒక వ్యక్తిని సూచిస్తుంది. గీతా బోధనల లక్ష్యాన్ని సజీవంగా ప్రతిబింబించే వ్యక్తిగా శ్రీకృష్ణుడు స్థితప్రజ్ఞుని లక్షణాలను శ్లోకాల శ్రేణిలో (2.55–72) వివరిస్తాడు: “ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్“ అంటే – మనస్సులో కలిగే అన్ని కోరికలను విడిచిపెట్టి, ఆత్మలోనే తృప్తి పొందే వాడు ఎవరో అతడే స్థితప్రజ్ఞుడు. ఈ స్థితప్రజ్ఞుడు ప్రశంసకు – నిందకు, కోరికకు – భయానికి ఒకే స్తిరమైన స్పందన కలిగి వుంటాడు. అతడు జీవిత లక్ష్యంపై, జీవన విధానంపై ఒక స్పష్టమైన అవగాహనతో జీవిస్తాడు, సమతా భావంతో మెదలుతాడు, ఆత్మలోనే చలిస్తూ విశ్రమిస్తాడు. అతడు అంతర్గతంగా పూర్ణంగా ఉంటాడు; “ఆపూర్యమాణం అచల-ప్రతిష్ఠం సముద్రం ఆపః ప్రవిశంతి యద్వత్ (2.70) “ అంటే – అన్ని నదులు సముద్రంలో కలుస్తున్నా, సముద్రం స్థిరంగా, కదలకుండా ఉంటుంది – అలాగే కోరికలు కలుగుతున్నా, స్థితప్రజ్ఞుడు అంతర్గతంగా పూర్ణంగా, అశాంతికి లోబడకుండా ఉంటాడు.
స్థితప్రజ్ఞుడు ఈ అధ్యాయ దృష్టికోణానికి ఒక సజీవ ఉదాహరణగా నిలుస్తాడు. ఈ ప్రపంచంలో, లోకంతో సంబంధం వుంటూనే, అంతర్గతంగా స్వేచ్ఛతో జీవించడం అంటే ఏమిటి అనే ప్రశ్నకి ఇది ఒక జ్ఞానమయమైన సమాధానం.
గీతా బోధలు కాలాతీతమైనవి. ఇవి ఈ రోజుకి కూడా మన జీవితాన్ని నేరుగా నిర్దేశిస్తాయి. అర్జునుని విషాదం, మానసిక స్థితి, ఈనాడు మనం ఎదుర్కొనే సందర్భాలను, అలాగే, మన అంతర్గత విచారణ ప్రారంభమయ్యే క్షణాలను ప్రతిబింబిస్తుంది. ఈ సాంఖ్యయోగ అధ్యాయం మనకు ఒత్తిడులు, మార్పుల మధ్య ఆత్మ విశ్వాసంతో, మానసిక స్పష్టతతో జీవించేందుకు కీలకమైన సాధనాలను అందిస్తుంది. జ్ఞానయోగం మన భౌతికత వెనుక ఉన్న స్థిరమైన ఆత్మను చూపిస్తుంది. కర్మయోగం ఉద్దేశ్యపూర్వకమైన వైరాగ్యదృష్టితో కర్మని ఆచరించమని నేర్పుతుంది. భక్తియోగం భగవంతుని పట్ల ఒక సంపూర్ణ విశ్వాసంతో, ఒక సంపూర్ణ సమర్పణా భావంతో జీవించమని బోధిస్తుంది. ఈ భావాలన్నిటికీ కూడా, ఈ అధ్యాయమే ఒక అంకురార్పణ లాంటిది.
భగవద్గీత, రెండవ అధ్యాయం తరువాత కూడా మరో పదహారు అధ్యాయాల్లో కొనసాగుతుంది. కానీ ఈ రెండవ అధ్యాయమైన సాంఖ్య యోగం, మనకు తరువాత వచ్చే సంపూర్ణ గీతాబోధకి ఒక అద్దం పడుతుంది. ఆ అద్దంలో మనం మనల్ని చూస్తాం – మరోలా చెప్పాలంటే, ఈ అద్దంలో మనం మన ఆత్మను చూస్తాం !
To read this article in English, Click here:
Leave a reply to జ్ఞానాగ్ని – దగ్ధ కర్మ – My Thoughts on Life and its Philosophy Cancel reply