భగవద్గీత
మహాభారతంలో భగవద్గీత ఒక నిశ్శబ్ద జ్వాల వంటిది. యుద్ధభూమి నడిమధ్యలో సంభవించిన ఒక నిశ్చలమైన సందర్భం అది. బాహ్య సంఘర్షణను అంతర్విచారణగా, ఆ అంతర్విచారణను అనుభవైక-జ్ఞానంగా (ఆత్మజ్ఞానంగా), అటుపై ఆ జ్ఞానాన్ని పరిపూర్ణమైన మోక్షం దిశగా మార్చే సంవాదం ఇది. మొత్తం పద్దెనిమిది అధ్యాయాలలో, విషాదం నుండి స్పష్టత వైపుకు, భయం నుండి స్వేచ్ఛ వైపుకు, గీత మనకి ఒక మార్గాన్ని నిర్దేశిస్తుంది.
మనం గమనిస్తే, భగవద్గీత ఒక ప్రశాంతమైన వాతావరణంలో కాకుండా, జీవితంలోని అత్యంత కఠినమైన పరిస్తితిలో వెలువడినవది. అందువల్లనే గీత కేవలం అర్జునుడికే కాక, మన దైనందిన జీవితానికి కూడా ఒక అద్భుతమైన ఔషధం లాంటిది.
మొదటి అధ్యాయం: విషాదం నుండి విముక్తి దిశగా
గీతలోని మొదటి అధ్యాయం ‘అర్జున విషాద యోగం’. ఇక్కడ అర్జునుడు మన లాంటి ఒక సామాన్య మానవునికి ప్రతీక. బాహ్య పరిస్థితులు అతని అంతరంగాన్ని తీవ్రంగా కలవరపెట్టి, అతని విచక్షణను దెబ్బతీసి, శోకంతో ముంచెత్తుతాయి. ఈ పతనానికి చిహ్నంగా, అర్జునుడు తనకు విజయం అక్కర్లేదని ప్రకటిస్తాడు (న కాంక్షే విజయం కృష్ణ – 1.32). దుఃఖంతో కృంగిపోయి, అతడు తన ధనస్సును జారవిడుస్తాడు (ఏవ ముక్త్వాజునః సంఖ్యే – 1.47). మనల్ని మనం అర్జునుడి స్థానంలో ఊహించుకుంటే, గీతాచార్యుడు అర్జునుడితో మాత్రమే కాకుండా, మనతోనే ప్రత్యక్షంగా మాట్లాడినట్టు అనిపిస్తుంది. జీవితంలో కొన్ని సందర్భాలలో మనకు కూడా, మనసు కలత చెంది, అశాంతితో, భవిష్యత్తు కూడా ఆగమ్యగోచరం అవుతుంది. మన ఈ మానసిక స్థితి, మొదటి అధ్యాయంలోని అర్జునుడి యొక్క స్థితి – రెండూ ఒకటే. అందుకే గీత మనకి కూడా చాలా అవసరం.
రెండవ అధ్యాయం: సాంఖ్య యోగం — ద్వివిధ మార్గం
ఈ అధ్యాయంలో బోధలు అర్జునుడిని, అతని ద్వారా మనల్ని, అంతరంగికంగా మరియు బాహ్యంగా సంస్కరించడం ప్రారంభిస్తాయి. దీనిని సాధారణంగా ద్వివిధ మార్గంగా (రెండు రకాలైన మార్గాలుగా) మనం అర్థం చేసుకోవచ్చు. మొదటి మార్గం అంతరంగానికి, అంటే ‘ఆత్మ’కు సంబంధించినది. ‘ఆత్మ’ యొక్క నిజస్వరూపం నిత్యమైనది. ఆత్మ ఎప్పుడు పుట్టదు, మరణించదు. (న జాయతే మ్రియతే వా – 2.20). ఆత్మ పంచ భూతాలకీ అతీతమైనది. (నైనం ఛిందంతి శస్త్రాణి – 2.23). ఇక్కడ మనకు కనిపించే ఆత్మ జ్ఞానం మనకు లోతైనదిగా అనిపించినా, దాని ముఖ్యార్థం స్పష్టంగానే ఉంటుంది : మార్పు చెందే వాటిని మాత్రమే చూసి మన మనసు కలవరపడుతుంది; మారని మన స్వరూపాన్ని (ఆత్మ) గురించి కూడా మనం తెలుసుకున్నప్పుడు, మనలో ఒక మానసిక స్థైర్యం ఏర్పడుతుంది. ఇక రెండవ మార్గం, బాహ్య కర్మలను, అంటే జీవుని కర్మలను, కర్తవ్యాలను నిర్దేశిస్తుంది (కర్మణ్యేవాధికారస్తే – 2.47).
కోరికలను పరిత్యజించినప్పుడు కలిగే స్థిరమైన జ్ఞానస్థితిని ‘స్థితప్రజ్ఞత’ అంటారు. ఈ స్థితప్రజ్ఞత (స్థిరమైన జ్ఞానం) అనే గమ్యం వద్ద మునుపు చెప్పిన రెండు మార్గాలు కలుస్తాయి (ప్రజహాతి యదా కామాన్ – 2.55). మరోలా చెప్పాలంటే, ఒక మనిషి లోపలి స్థిరత్వం, ఆతని బయట బాధ్యత – ఈ రెండూ కూడా ఒక దానితో మరొకటి పెన వేసుకుని ఉంటాయి. అంచేత రెండూ అవసరమే.
( రెండవ అధ్యాయంపై ప్రత్యేక అవలోకనం కోసం: ఇక్కడ క్లిక్ చేయండి: https://nvsatish.com/2025/10/17/bg-sankhya-yoga-02/ )
మూడవ అధ్యాయం: కర్మయోగ ఆరంభం — కర్మ చేయవలసిన ఆవశ్యకత
మూడవ అధ్యాయంలో గీత కర్మయోగం ద్వారా మనకు ఏమి చెప్తుంది అనేది చూద్దాం. జ్ఞాన మార్గం మరియు కర్మ మార్గం రెండూ శ్రేయస్కరమైనవే అనేది ఈ అధ్యాయంలో మరోసారి స్ఫష్టం అవుతుంది. ఆయితే, లౌకిక వ్యవహారాలలో ఉన్నవారికి, కర్మ చేయడమే సరైన మార్గం అని గీత మనకి చెప్తుంది. ఎక్కడా కూడా మనల్ని కర్మలను వదిలివేయమని చెప్పదు. ఒక్క మాటలో చెప్పాలంటే, కర్మ నుండి తప్పించుకోవాలనే ఆలోచనను గీత సంపూర్ణంగా ఖండిస్తుంది. ఎందుకంటే ఒక్క క్షణం కూడా ఎవరూ కర్మ చేయకుండా ఉండలేరు. ఆ ఉద్దేశ్యంతోనే, కర్మలను సన్యసించడం (వదిలేయటం) కంటే వాటిని ఆచరించడమే మేలని బోధిస్తుంది (నియతం కురు కర్మ త్వం – 3.8). మరో మాటలో చెప్పాలంటే, సరైన దృక్పథంతో కర్మలు చేయమనే ఒక నిర్దేశం మనకు ఇక్కడ కనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ ప్రకృతి గుణాల ప్రభావంతో కర్మ చేయక తప్పదు (న హి కశ్చిత్ క్షణమపి – 3.5). జ్ఞానులైన వారు కూడా కర్మలను ఆచరిస్తూ ప్రపంచానికి మార్గదర్శకంగా ఉంటారు (యద్యదాచరతి శ్రేష్ఠః – 3.23). గమనిస్తే, ఈ అధ్యాయంలో గీత మన జీవితాన్ని ఎలా గడపాలో, జ్ఞాన-కర్మలను ఎలా సమన్వయం చేసుకోవాలో, అలాంటి కర్మాచరణకి సరైన దృక్పథం ఏదో మనకు చాలా స్పష్టంగా చెప్తుంది.
కర్మలో సరైన దృక్పథం: యజ్ఞభావన
స్వార్థం లేకుండా, యజ్ఞభావంతో (నిస్వార్థ సేవాభావంతో) చేసే కర్మ మనిషిని కర్మబంధం నుండి విముక్తుడిని చేస్తుంది (3.9). అటువంటి నిష్కామ కర్మ (ఫలితంపై ఆసక్తి లేని కర్మ) చిత్తశుద్ధిని కలిగించి, జ్ఞానానికి అర్హతను ఇస్తుందని ప్రతీతి. ఈ తత్వాన్ని యజ్ఞం ద్వారా, అంటే ‘జీవరాశిని పోషించే పరస్పర సహకార విధానం’ ద్వారా వివరించడం జరిగింది. ఇంకొంచెం వివరంగా చెప్పాలంటే, వర్షం ఆహారాన్ని ఇస్తుంది; ఆహారం ప్రాణులను పోషిస్తుంది; ప్రాణులు సరైన విధానంలో కర్మ చేయడం ద్వారా (యజ్ఞం ద్వారా) వర్షం వస్తుంది – ఇలా ఈ చక్రం కొనసాగుతుంది. (సహయజ్ఞాః ప్రజాః సృష్ట్వా – 3.10–3.15). ప్రకృతి లోని ఈ పరస్పర-సామరస్య-అవసరాన్ని మనుష్యులు విస్మరించినప్పుడు లేదా భంగపరిచినప్పుడు, సృష్టి చక్రం అసంపూర్ణంగా, అస్తవ్యస్తంగా మారుతుంది. ఆధునిక జీవనంలో పర్యావరణ పరిరక్షణ లేదా నిజాయితీతో కూడిన వృత్తి ధర్మం వంటి పనులు దీనిని గౌరవించినప్పుడు, వ్యక్తులు స్వేచ్ఛను పొందుతారు. అంతే కాక, వారిలో ఒక వైశ్వానిక బాధ్యతా భావం (విశ్వం పట్ల బాధ్యత) నెలకొంటుంది. విశ్వ సామరస్యం నిలబడుతుంది.
గుణాలు మరియు అకర్తృత్వం
వ్యక్తి చేసే కర్మలన్నీ ప్రకృతి యొక్క త్రిగుణాల (సత్త్వ, రజో, తమో గుణాల) మధ్య జరుగుతాయని గీత చెప్తుంది (ప్రకృతేః క్రియమాణాని – 3.27). కర్మ అనేది గుణాల పరస్పర చర్య మాత్రమే; జీవుడు అసలు కర్త కాదు. ఈ విషయాన్ని ఎరిగినవారిలో అహంకారం తగ్గుతుంది. భయం మాయమవుతుంది. కర్మాచరణ జరగుతూనే ఉంటుంది కానీ “నేను చేస్తున్నాను” అనే భారముండదు.
మనం సరిగ్గా గమనిస్తే, మనలో కలిగే అనేక స్పందనలు వ్యక్తిగత దోషాలు కావు; కేవలం ప్రకృతి గుణాల యొక్క ప్రభావం. ఉదాహరణకు, నిస్సహాయ స్థితి లేదా అధిక ఆత్రుత వంటి మనోభావాలను రజో-తమో గుణాల ప్రభావంగా భావించవచ్చు. ఈ అవగాహనతో మనలోని ప్రకృతిని అర్థం చేసుకుని, తద్వారా మన జీవితంలో మనం చేపట్టవలసిన సరైన సాధనా విధానంపై ఒక మంచి స్పష్టతని తెచ్చుకోవచ్చు.
శరణాగతి మరియు స్వధర్మం
సరైన కర్మకు మరో సంకేతం, సకల కర్మలను ఈశ్వరునికి అర్పించడం (శరణాగతి). అప్పుడు భయం మరియు ఫలితాపేక్ష నశిస్తాయి (మయి సర్వాణి కర్మాణి – 3.30). ప్రతి వ్యక్తీ తన స్వభావానికి అనుగుణంగానే ప్రవర్తిస్తాడు (సదృశం చేష్టతే స్వస్యాః – 3.33). అందుకే గీత మన స్వధర్మాన్ని (మనదైన విధిని) ఆచరించమని బోధిస్తుంది. స్వధర్మానికి అనుగుణంగా చేసే కర్మ మాత్రమే క్షేమకరమైనది (శ్రేయాన్ స్వధర్మో విగుణః – 3.35). పరధర్మాన్ని ఆచరించడం ప్రమాదకరమైనది. ఈ విషయంలో మనం గమనించ వలసిన విషయం — ఒక మనిషి తన స్వభావానికి అనుగుణంగా పని చేసినప్పుడు ఆ మనిషిలో మానసిక స్థిరత్వం ఉంటుంది; మరి ఇతరుల మార్గాన్ని/ధర్మాన్ని అనుకరించడం చేస్తే, ఆ కర్మ వారిని అస్థిరం చేస్తుంది. అయితే, స్వధర్మ నిర్వహణ ఎలాంటివారు చేయగలరు ? ధర్మ విచక్షణా జ్ఞానం కలిగిన వారికి, మనసు మీద, మనసు లోని కోరికల మీద నియంత్రణ ఉన్నవారికి మాత్రమే ఇది సాధ్యం అవుతుంది.
కోరిక మరియు దాని ఆవరణలు
కోరిక, లేదా కామం, విచక్షణను కప్పివేసి, అంతర్గత జ్ఞాన ప్రకాశాన్ని మరుగున పడేస్తుంది (కామ ఏష క్రోధ ఏషః – 3.36–3.37). దీనికి భగవానుడు ఇచ్చిన ఉదాహరణ : నిప్పును పొగ, అద్దాన్ని దుమ్ము, లేదా పిండాన్ని తల్లి గర్భం కప్పివేసినట్లుగా (ధూమేనావ్రియతే వహ్నిర్ – 3.38), కోరిక జ్ఞానాన్ని (స్పష్టతను) కప్పుతూ దాని చుట్టూ ఆవరించి ఉంటుంది. ఇంద్రియాలు, మనస్సు మరియు బుద్ధి – వీటన్నిటికంటే కంటే ఆత్మ ఉన్నతమైనదని తెలుసుకోవడమే కోరికను జయించే మార్గం. బుద్ధి ద్వారా ఆత్మను తెలుసుకుని, ఆ బుద్ధిలోని విచక్షణతో కోరికల నుండి మనస్సును నిగ్రహించుకోవాలి (ఏవం బుద్ధేః పరం బుద్ధ్వా – 3.43).
ముగింపు మాట
కర్మయోగం సందర్భంలో సన్యాసం అంటే కర్మ నుండి తప్పించుకోమని కాదని మనం అర్థం చేసుకోవాలి. ప్రతి పనిలో ఏకాగ్రత మరియు నైపుణ్యంతో వ్యవహరిస్తూనే, ఫలితంపై ఆసక్తిని (సంగత్వాన్ని) వదిలివేయడమే నిజమైన సన్యాసం. ఈ అధ్యాయం ‘కర్మ చేయవలసిన ఆవశ్యకత’తో మొదలై, ‘పని చేస్తూనే పొందే స్వేచ్ఛ’కి ఒక మార్గనిర్దేశంతో ముగుస్తుంది. ఈ దృక్పథమే, తరువాత మోక్షానికి దోహదకారి అవుతుంది. చివరిగా, ఈ అధ్యాయం నుంచి మనం గుర్తుంచుకోవలసిన అంశాలు: (i) కర్మను వదిలివేయడం కాదు; కర్మలోని ఫలాపేక్షను మాత్రమే వదిలివేయడం స్వేచ్ఛకు మార్గం. (ii) సమతుల్యమైన దృక్పథంతో చేసిన పని మనసుకి శాంతిని ఇస్తుంది. (iii) ప్రకృతి మనకిచ్చే సహకారానికి, మనం కూడా ప్రకృతి పట్ల సహకార భావంతో ప్రవర్తించినప్పుడే సృష్టి క్రమం సజావుగా సాగుతుంది. (iv) సరైన దృక్పథంతో ఆచరించే కర్మలోని నిబద్ధత, మన తరువాతి జీవితంలో జ్ఞానానికి, అటు పిమ్మట విముక్తికి, దారితీస్తుంది.
( To read this article in English, click here: https://nvsatish.com/2025/11/14/bg-karma-yoga-03/ )
Leave a reply to జ్ఞానాగ్ని – దగ్ధ కర్మ – My Thoughts on Life and its Philosophy Cancel reply